ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ర్టసాధన ఉద్యమనేత, తెలంగాణ జన హృదయ సార్వభౌముడు చంద్రశేఖరరావు ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శంకుస్థాపన కావించారు. 2001 నుంచి 2014 వరకు నిరంతరం కొనసాగిన తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం ద్వారా మహత్తర లక్ష్యాన్ని సాధించి, అపూర్వ, అద్భుతరీతిలో ప్రగతి పథంలో పయనిస్తూ సాటిలేని ఘట్టాలను సృష్టిస్తున్న తెలంగాణ చరిత్రలో ఈ శంకుస్థాపన మరో మహత్తర సన్నివేశం.
తెలంగాణ ఎన్నో బాలారిష్టాలకు గురి అవుతుందని, సమస్యల వలయంలో చిక్కుకుంటుందని శత్రు శిబిరాలు, నిరాశావాదుల వ్యాఖ్యలు విఫలమయ్యాయి. దీనికి ప్రధాన హేతువులు రాజకీయ సుస్థిరత్వం, ప్రగతిశీల ప్రభుత్వ విధానాలు, పరిపాలనా సామర్థ్యం. ఈ కారణాల వల్లనే తెలంగాణ కరోనా, లాక్డౌన్లు కల్గించిన ఆర్థిక సంక్షోభాలను తట్టుకొని తన అస్తిత్వాన్ని కాపాడుకోగలిగింది.
ఢిల్లీలో తెలంగాణ భవన్ మన అస్తిత్వ శిఖరం, తెలంగాణ జయకేతనం, తెలంగాణ ధ్వజస్తంభం. తెలంగాణ విముక్తి సమరంలో 1947 సెప్టెంబర్ 2 నాడు వరంగల్లు సమీపంలోని పరకాల పట్టణంలో మరో జలియన్‌వాలాబాగ్ మారణకాండ జరిగింది. అంతకు ముందు.. 1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జలియన్‌వాలాబాగ్‌లో బ్రిటిష్ పాలకుల అమానుషత్వం, క్రూరత్వం హద్దులు దాటి ప్రదర్శితమైనాయి. బ్రిటిష్ పాలకుల రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా దేశమంతటా శాంతియుత నిరసన ప్రదర్శనలు జరుపాలని గాంధీజీ పిలుపునిచ్చారు. జలియన్‌వాలాబాగ్‌లో శాంతియుత నిరసన తెలుపడానికి చేరిన వేలమందిపై బ్రిటిష్ సైన్యాధికారి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ జరిపించిన తుపాకి కాల్పుల్లో వేయిమంది మరణించారు. కొన్ని వేల మంది గాయపడ్డారు. బ్రిటిష్ పాలకుల ఈ అమానుష చర్యను ఖండిస్తూ విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్ తన ‘సర్’ బిరుదును త్యజించారు. భారత స్వాతంత్య్రం తర్వాత కేవలం పదిహేను రోజులకే నిజామ్ రాజు పోలీసులు, ఖాసిమ్ రజ్వీ నాయకత్వంలోని మతోన్మాదులు 1947 సెప్టెంబర్ 2న పరకాల పట్టణంలో నాలుగు వేలమంది శాంతియుత సత్యాగ్రహులపై కాల్పులు జరిపి పదిహేను మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు.
‘నను గని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ!’, ‘నాకు తల్లివి నీవు, నేను నీకు సుతుడ..నా తెలంగాణ! కోటి రతనాల వీణ’, ‘నా తెలంగాణ తల్లి కంజాతవల్లి’ వంటి గీతాలు రచించి, తన రుద్రవీణ కవితా సంకలనాన్ని తెలంగాణకు అంకితం చేసిన మహాకవి, తెలంగాణ బిడ్డ దాశరథి. ఆయన తెలంగాణ అస్తిత్వం కోసం అమితంగా ఆరాటపడ్డారు. దాశరథి ఆరాటం ఆయన గీతాలలో ప్రతిధ్వనిస్తుంది. బహుముఖ ప్రతిభావంతుడు, మహా పండితుడు, మేధావి, చరిత్ర పరిశోధకుడు, సంపాదకుడు సురవరం ప్రతాప రెడ్డి 90ఏండ్ల కిందటనె తెలంగాణ అస్తిత్వం, గౌరవం కోసం తపించి ‘గోలకొండ కవుల చరిత్ర’ ప్రచురించారు. నాటి తెలంగాణ సాహిత్య వికాసానికి, భాషాభిమానానికి ప్రత్యక్ష నిదర్శనం, దర్పణం ‘గోలకొండ కవుల చరిత్ర’. 1930-43 సంవత్సరాల్లో నాటి ఆంధ్ర మహాసభ ద్వార కూడ సురవరం తెలంగాణ అస్తిత్వం నిలుపడానికి తీవ్రంగా కృషి జరిపారు. ఈ విధంగా నాడు తెలంగాణ అస్తిత్వం కోసం ఆరాటపడిన మహోన్నత వ్యక్తులకు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఆత్మశాంతి కల్గిస్తుంది అనటంలో సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన మరుక్షణం నుంచి, గడిచిన ఏడేండ్లలో రాజకీయ సుస్థిరత్వం, పరిపాలనా సామర్థ్యంతో నూతన, శైశవ రాష్ట్రం బహుముఖంగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నది. అట్టడుగు వర్గాల సర్వతోముఖ అభ్యున్నతికి, శ్రేయస్సుకు సంక్షేమ పథకాలు అత్యవసరం అని గుర్తించిన బహుశా మొట్టమొదటి రాష్ర్టం తెలంగాణ. శైశవ దశలో ఉన్న తెలంగాణ రాష్ర్టం ఎన్నో బాలారిష్టాలకు గురి అవుతుందని, క్లిష్ట సమస్యల వలయంలో చిక్కుకుంటుందని కొందరు శత్రు శిబిరాల వారు, నిరాశావాదులు చేసిన వ్యాఖ్యలు విఫలం కావడానికి ప్రధాన హేతువులు రాజకీయ సుస్థిరత్వం, ప్రగతిశీల ప్రభుత్వ విధానాలు, అసాధారణ పరిపాలనా సామర్థ్యం. ఈ కారణాల వల్లనే తెలంగాణ రాష్ట్రం కరోనా మహమ్మారి లాక్డౌన్లు కల్గించిన ఆర్థిక, సామాజిక సంక్షోభాలను తట్టుకొని తన అస్తిత్వాన్ని కాపాడుకోగలిగింది. రాజకీయ సుస్థిరత్వంతో, నిరంతర ప్రగతితో, పరిపాలనా సామర్థ్యంతో తన అస్తిత్వానికి ప్రపంచమంతట గుర్తింపును, గౌరవాన్ని తెలంగాణ రాష్ట్రం పొందగలుగుతున్నది.
కొందరు ఈర్ష్యాద్వేషాలతో తెలంగాణ రాజకీయ సుస్థిరత్వానికి, తద్వారా తెలంగాణ అస్తిత్వానికి భంగం కల్గించే దుష్ట ప్రయత్నాలు జరిపినప్పటికి తెలంగాణ ప్రజల రాజకీయ విజ్ఞత వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. రాజకీయ అస్థిరత్వం కారణంగా పలు దేశాలు, దేశంలోని పలు రాష్ట్రాలు సంక్షోభం పాలైనాయి. ఈ సందర్భాన ఇటీవలి అఫ్గానిస్థాన్ పరిణామాలను ఒకసారి పరికిస్తే.. మతోన్మాద టెర్రరిస్టులైన తాలిబాన్లు సులభంగా దేశమంతటినీ ఆక్రమించుకోగలిగినప్పటికి రాజకీయ సుస్థిరత కలిగించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్నో క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ సుస్థిరత్వం లేనిదే అఫ్గానిస్థాన్ కానీ, ఇంకే దేశం కానీ అభివృద్ధి పథంలో ముందుకు సాగలేవు. వియత్నాం ఈ సందర్భాన ఒక ప్రబల నిదర్శనం. అమెరికా ఆక్రమణలో యుద్ధాలతో సంక్షోభం పాలైన వియత్నాంలో రాజకీయ సుస్థిరత్వం, విజ్ఞత గల రాజకీయ నాయకత్వం అందుబాటులో ఉన్నందువల్లనే ఆ దేశం వెంటనే అభివృద్ధి పథంలో పయనించింది. తద్వారా సామాన్య ప్రజల ఇక్కట్లను, పేదరికాన్ని దూరం చేయగలిగింది. రాజకీయ సుస్థిరతలో, అభివృద్ధిలో తెలంగాణ ఒక తాజా ఉదాహరణ.
దేవులపల్లి ప్రభాకర రావు