‘సుప్రీంకోర్టు అంటే ప్రభుత్వానికి గౌరవం ఉన్నట్లు లేదు. మీరు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు’ అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్య.. ట్రిబ్యునళ్లపై కేంద్రం చూపుతున్న సాచివేత ధోరణికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. సాంకేతిక, ప్రత్యేక అంశాలకు సంబంధించిన వివాదాల్లో సత్వర న్యాయం కోసం ఏర్పాటైన ట్రిబ్యునళ్లలో దాదాపు రెండేండ్లుగా నియామకాలు లేవు. దీంతో అవి నిష్క్రియంగా ఉండిపోయాయి. ట్రిబ్యునళ్లలో పేరుకుపోయిన నియామకాలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు హితవు పలికింది. అయినా కూడా కేంద్రంలో చలనం లేకపోవటంతో సీజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్రిబ్యునళ్ల విషయంలో కేంద్రప్రభుత్వ ధోరణి తొలినుంచీ వివాదాస్పదంగానే ఉన్నది. మోదీ అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే ట్రిబ్యునళ్లను ‘హేతుబద్ధీకరించే ప్రక్రియ’ను చేపట్టారు. ‘ఆర్థికబిల్లు, 2017’ ద్వారా ఏడు ట్రిబ్యునళ్లను రద్దు చేయటమో, ఇతర ట్రిబ్యునళ్లలో కలిపివేయటమో చేశారు. దీంతో వాటి సంఖ్య 26 నుంచి 19కి తగ్గింది. ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్తూ ఇటీవలి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేయించుకుంది. ఫలితంగా మరో 8 ట్రిబ్యునళ్లు రద్దయ్యాయి. వీటిలో ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పీలేట్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ వంటి కీలకమైనవి కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ బిల్లుకు ముందు తెచ్చిన ఆర్డినెన్సును సుప్రీంకోర్టు కొట్టివేయటంతో.. కేంద్రం తాజాగా ఈ బిల్లును తీసుకొచ్చింది. ఓవైపు ఈ విధంగా ట్రిబ్యునళ్లను రద్దు చేయడమే కాకుండా, మరోవైపు ఉన్న అరకొర ట్రిబ్యునళ్లలోనూ కేంద్రం నియామకాలను జరుపటం లేదు.
కొత్త చట్టం ద్వారా కేంద్రం ట్రిబ్యునల్ చైర్పర్సన్లు, సభ్యుల నియామకాలు, సర్వీసు కండిషన్లు, వేతనాలపై అజమాయిషీ చేసే అవకాశాలున్నాయి. ఈ విధంగా వాటిని కేంద్రం నియంత్రిస్తుందని తద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఇది చెరుపు చేస్తుందని న్యాయనిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జలవివాదాల విషయంలో కేంద్రం వైఖరిని ప్రత్యక్షంగా మనం చేస్తున్నాం. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తేల్చేందుకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయాలని తెలంగాణ కోరుతున్నా కేంద్రం ఆ సంగతిని పక్కనపెట్టింది. పుండు మీద కారం చల్లినట్లుగా.. కృష్ణా, గోదావరి నదుల మీద ఏర్పాటైన ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకుంటూ నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటుచేసింది. భారతదేశం వంటి సమాఖ్య రాజ్యంలో కేంద్రం ప్రదర్శిస్తున్న ఏకపక్ష ధోరణి ఎంతమాత్రం సరికాదు. సుప్రీంకోర్టు ఆక్షేపణలతోనైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి.