e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News Telangana | తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో మనమెటువైపు?

Telangana | తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో మనమెటువైపు?

There is one war that matters. The Great War. And it is here. If it comes true, everything we fought for will be for nothing, everything we suffered would be for nothing-2011 నుంచీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూవున్న HBO వారి కాల్పనిక రాజకీయ మహాచిత్రం ‘Game of Thrones’ లోని యుద్ధసన్నివేశంలోని మాటలవి!

సారాంశం ఏమంటే.. ఒక మహావిపత్తు ముంచుకువస్తున్నది. దానిని అడ్డుకొనకపోతే మన ఇన్నాళ్ళ పోరాటాలు వృథా అయినట్టే. మన ఇన్నాళ్ళ వ్యధా వృథా అయినట్టే అని!

- Advertisement -

నిజానికి జీవితం విపత్తుల సమాహారం. వాటిని యెట్లా ‘డీల్‌’ చేస్తామన్న దానిపైనే ఆ విపత్తు తుత్తునియలు అవుతుందా, మహావిపత్తుకు విత్తుగా పరిణమిస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌కు ఎంత ప్రతిష్ఠాత్మకమో తెలియదుగానీ, ఆయన ఓడిపోవడం మాత్రం తెలంగాణకు; ఈ రాష్ట్ర తాత్విక, రాజకీయ భూమిక అయిన చైతన్యశీలతకు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఇప్పుడు హుజూరాబాద్‌ ప్రజల ముందున్న విపత్తు ఈటల రాజేందర్‌. ఈ విపత్తును తుత్తునియలు చేయకపోతే మన ఇన్నాళ్ళ పోరాటాలు వృథా అయినట్టే. మన ఇన్నాళ్ళ వ్యధ వృథా అయినట్టే’!

కమలం పువ్వు గుర్తుతో ఎన్నికలోకి దిగినాక, ఆయన ఉద్యమకారుడనీ, వామపక్ష భావజాలం పునాదిగా ఉన్నవాడని, ధిక్కారానికి ప్రతీక అని చెప్పడం హాస్యాస్పదం. బీజేపీ ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని ఎన్ని కష్టాల్లోకి నెట్టిందో గుర్తుచేసుకోవాలి. రైతు హంతకులు పదవిలోనే ఉన్నా పల్లెత్తు మాట అనని ఈటల రైతుల గురించి మాత్రం ఊక దంచుతూ ఉంటారు. పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఆర్బీఐ, నీతిఆయోగ్‌లాంటి కేంద్ర సంస్థలన్నీ తెలంగాణ అన్నిరం గాల్లో అభివృద్ధి సాధించడాన్ని ప్రశంసిస్తూ ఉంటే, ఒక్క పైసా సాయం చేయకపోగా, విభజన చట్టం హామీల్నీ నెరవేర్చని బీజేపీ నేతగా ఓటు అడగడానికి ఈటల సాహసించడం ప్రజల పట్ల తీవ్ర పరిహాసం!

ఈటల బహుజన నాయకుడని, మద్దతు ఇద్దామని కొత్తగా పుట్టిన ఒక నాయకుడు అంటున్నరు. జాతీయ స్థాయిలో మనువాదంపై పోరాటం వల్లెవేసే బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీ నాయకులు బీజేపీని హుజూరాబాద్‌లో గెలిపిస్తే తమ తాత్విక భూమిక ఎట్లా గట్టిపడుతుందో కొంచెం ఆలోచించు కోవాలి.
ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బయటకు పోయిన నేపథ్యం, తదనంతర పరిణామాల గురించి ఒక్క హుజూరాబాద్‌ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలు సు. రాజేందర్‌ తప్పుల గురించీ తెలుసు. అయినప్పటికీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటే ఆయన చెప్పుకొంటున్న నిజాయితీకి ఈ ఎన్నిక ఒక గీటురాయిగా నిలిచేది. కుడి, ఎడమ భావజాలాల శిబిరాలకూ ఒక న్యాయమైన ఆప్షన్‌ దొరికివుండేది. ఓటు వేయడానికీ, వేయ కుండా ఉండటానికీ! బీజేపీ నాయకుడిగా ఆయన పోటీచేస్తున్నపుడు ప్రజలకు కాదు, ఆయన పరీక్ష పెడుతున్నది తాత్విక చింతనకు. ఇదొక ప్రమాదకరమైన ఆట!

మరోవైపు విద్యార్థి దశ నుంచే వామపక్షవాదినని చెప్పుకొంటూనే, ఫక్తు మతతత్వ పార్టీ (అ)జెండాను మోస్తున్న ఈటలకు వామపక్ష శిబిరంలోని వారు ఎట్లా పనిచేయగలరు? ఎట్లా ఓట్లు వేయగలరు? అటూ ఇటూ కాని ఈటలను ఏ శిబిరమైనా ఎందుకు తలకెత్తుకోవాలి?

యుద్ధరంగంలో మీమాంసలు ఉంటే అది యుద్ధం కాదు, అనైతికమైన ఆట. మన దేశంలో ఎన్నికల ప్రక్రియ పై వ్యాఖ్యానించడం అంటే ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం, వారిని కొనేయడం.. అంటూ ఒక ఉపరితల భావం బలంగా ఉన్నది. ఈ భావమూ, భావజాలమూ ప్రమాదకరం. కడుపులో చల్ల కదలకుండా టీవీల ముం దూ, సోషల్‌ మీడియాలోనూ మేధో పోరాటాలు చేసే వారు, కిలోమీటర్ల కొద్దీ నడిచి ఓటేసే ప్రజాస్వామిక మూలస్తంభాలైన ఓటర్లను అవహేళన చేయడం ప్రజాస్వా మ్యానికి మంచిది కాదు. కేవలం ఏడున్నర దశాబ్దాల వయసు మన ప్రజాస్వామ్యానిది. ‘ఎవాల్వ్‌’ అవుతూ ఉన్నాం, ఇంకా ఇంకా అవుతాం. అందుకే ఈ చర్చ.

నిజానికి అసలైన ఉపద్రవం ఏమంటే.. ఏ భావజాలం ప్రాతిపదికగా ఎన్నిక జరుగుతున్నది అనే ఎరుక ప్రజలకు లేకుండా చేయడం. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.. ఓడిపోలేదోయ్‌’ అని సీనియర్‌ సముద్రాల అన్నది మానసిక స్థితికి సంబంధించిన చింతన. రాజకీయాల్లో యుద్ధం విస్పష్టంగా ఉండాలి. ఏ తాత్విక భూమిక తమ ప్రతినిధిని నడిపిస్తున్నదో ఓటర్లకు తెలియాలి. అబద్ధాల మీద, అవకాశవాద భావజాలం మీద జరిగే నిర్మాణం..ఆ తదనంతరం జరగబోయే విధ్వంసానికి పునాది లాంటిది! ఈటల నిర్మాణంలా కనిపించే ఒక విధ్వంసం! ఆ విధ్వంసం తెలంగాణ ఆత్మకు నష్టం!

తానేమిటో సరిగా, స్పష్టంగా చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో నేడు ఉన్నరు ఈటల. ఆయన ప్రజలకేం నాయకత్వం వహించగలరు? అసెంబ్లీలో ఏ ఉత్థానానికి నాంది పలుకగలరు? రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌కు డిపాజిట్‌ దక్కే పరిస్థితి లేదు కాబట్టి, ప్రజలు వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నరు. కాబట్టి వారి గురించి ఎక్కువ మాట్లాడుకోనవసరం లేదు.

బీజేపీయేతర, కాంగ్రెసేతర తెలంగాణ శక్తులు అన్నీ ఇప్పుడు కలిసి రావాల్సిన సందర్భం. ఇప్పుడే కాదు రెండేండ్ల తర్వాత కూడా. తెలంగాణ అస్తిత్వ బావుటా అయిన టీఆర్‌ఎస్‌ నేడు హుజూరాబాద్‌లో కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యేలపరంగా శతాధికసంఖ్యతో, పతాకస్థాయిలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభ ఈ ఒక్క సీటుతో పెరిగేదీ తరిగేదీ కాకపోవచ్చును. కానీ అన్యులను అందలం ఎక్కిస్తే నష్టపోయేది తెలంగాణ. కష్టపడేది తెలంగాణ. ఈ నేల అస్తిత్వంతోనూ, ఇక్కడి జనం గోసలతోనూ సంబంధం లేని నాయకుల నేతృత్వంలోని పార్టీలు ఈ నేలకు అన్యులే!
ఈ అస్తిత్వ భూమికకు సంబంధించి మరికొన్ని విషయాలు.. తెలంగాణ రాక ముందు మన సంస్కృతి మనకు తెలియక పోవడం, మనభాష, మన వ్యవహారాలు తక్కువగా అనిపించడం అస్తిత్వ స్పృహారాహిత్యం! నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌ లైన్‌ అనే మాట మనందరి అనుభవంలోనిది. ఆ మూడూ మెటీరియల్‌ బెనిఫిట్స్‌. అవి అత్యవసరమైనవి. అంతకంటే ముఖ్యం అస్తిత్వం. ఇప్పుడు మనందరమూ సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన తరుణం అస్తిత్వం. ఆ స్పృహ ఉన్నప్పుడే అస్తిత్వాన్ని మనం నిలుపుకోగలం.

దేశంలోనే అతి పిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ. కానీ ఈ కొంచెమైన పిట్ట ఘనమైన కూత ఎట్లాంటిది అంటే.. తలసరి ఆదాయంలో, ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణది మూడోస్థానం! కేంద్ర గణాంకాల శాఖ సాధికారికంగా చెప్పిన విషయం ఇది. నేడు దేశ తలసరి ఆదాయం రూ.1.28 లక్షలు మాత్రమే. ఇది గత ఏడాది కంటే 4.8 శాతం తక్కువ. తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే రూ.1.09 లక్షలు అధికంగా అంటే, రూ. 2.37 లక్షలుగా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ పురోగతి మెరుగ్గా ఉంది. దేశంలోనే తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది.

తెలంగాణ నేడు అన్నిరంగాల్లో ముందుంటున్నది. అభివృద్ధి, సంక్షేమం, ఆధ్యాత్మిక పరిమళాలు, స్వల్ప/ మధ్య/ దీర్ఘకాలిక ప్రణాళికలతో భారత దేశంలోని ఎన్నోరాష్ర్టాలకంటే ఎంతో ముందున్నది. బొగ్గు కొరతతో దేశంలోని పలురాష్ర్టాలు విద్యుత్‌ కోతలు విధిస్తూ ఉంటే, తెలంగాణ వెలుగులు విరజిమ్ముతూ ఉన్నది. దళితుల జీవితాల్లో వెలుగు కోసం ఉద్దేశించిన ‘దళితబంధు’ ఆషామాషీగా హుజూరాబాద్‌ కోసం, హుజూరాబాద్‌ వరకే ఉద్దేశించినది కాదు. దీనికి ఎంతో నేపథ్యం, అవిరళ కృషి, అధ్యయనం ఉన్నది. 1990 దశకం చివరలోనే నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ మార్గదర్శనంలో ప్రపంచవ్యాప్తంగా 135 జాతులపై సాగుతున్న వివక్షపై ‘సెంటర్‌ ఫర్‌ సబాల్టర్న్‌ స్టడీస్‌’ వేదిక ద్వారా అధ్యయనం జరిగింది. అప్పుడు పురుడు బోసుకున్న ఎన్నో ఆలోచనల్లో ‘అణగారిన కులాల సాధికారత’ ప్రముఖమైనది.

విద్య విషయానికివస్తే.. గురుకుల పాఠశాలల నిర్వహణలో దేశంలోనే తెలంగాణకు అగ్రతాంబూలం. ఆ విషయం ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్న ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌కు కూడా తెలుసు! రూ.19 లక్షల 20 వేల కోట్ల ఖర్చుతో పేదలకోసం డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణం దశలవారీగా పూర్తవుతున్నది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 1000-1500 ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉన్నది.

నేడు తెలంగాణ అభివృద్ధి, అటు పెట్టుబడులను మాత్ర మే ఆకర్షించడం కాదు.. 15 లక్షల పైచిలుకు కార్మికులు అనేక రాష్ర్టాలనుంచి బతుకు దెరువు కోసం మనదగ్గరకు వస్తున్నరు. ఒకనాడు మనం వలస పోయినం. ఇప్పుడు మనమే ఒక destination అవుతున్నాం. హుజూరాబాద్‌ ఒక గీటురాయి వంటిది. సందర్భం అలాంటిది. ఈ రోజు తెలంగాణ సమాజపు loyalty అస్తిత్వం వైపు ఉండాలి. అది నాయకుల, మతాల, కులాల ఎల్లలు దాటి అస్తిత్వ పరిరక్షణవైపు పయనించాలి. టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ను పరిరక్షించడానికి, తద్వారా తెలంగాణను సమున్నతంగా నిలబెట్టడానికి మీ ముందుకు వస్తున్నది. బీజేపీ కబళించడానికి వస్తున్నది.

హిందూ మతం ఒక జీవనవిధానం. అదేమీ బీజేపీ గుత్త సొత్తు కాదు. ఆ పారీ ్టపుట్టకముందే ఈ నేలపై సనాతన ధర్మం వెల్లివిరిసింది. హిందూ మతంలోని దురాచారాలు, ఛాందస భావాలను ఎదిరించిన సమతా మూర్తి రామానుజాచార్యుల దివ్యసన్నిధానానికీ, శ్రీరాముని ప్రశ్నించిన గోపన్న భద్రాద్రికీ పుట్టిల్లు ఈ తెలంగాణ. బౌద్ధం, వైష్ణవం, శైవం సహా.. ఇస్లాం, క్రైస్తవాలకు చెందిన ప్రజలూ సఖ్యతతో జీవిస్తున్న గంగా-జమునా, కృష్ణా-గోదావరీ తెహజీబ్‌ ఈ తెలంగాణ.

మనమెటువైపో తేల్చుకోవాలి!
ఈ ప్రజాయుద్ధంలో కలిసి పోరాటం చేయాలంటే పరస్పరం నమ్మకం కలిగి వుండాలి. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిలో stake holders కు ఎవరికి అనుమానాలు ఉన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమూ, పార్టీ నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నది. మనమందరం ఎలాంటి తెలంగాణ కావాలనుకున్నమో ఆ తెలంగాణ సాకారం అయింది. అది ఇంకా గొప్పగా చేసుకుందాం. రాజకీయాల పేరిట తెలంగాణను మలినం చేయొద్దు. రాజకీయాల కోసం తెలంగాణను శపించవద్దు. మనను మనమే న్యూనతపరచుకోవద్దు. ఇప్పుడు చెప్పండి.., తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలోమనం ఎటువైపు?!

శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
90309 97371

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement