చుక్కలు తెగి రాలిపడుతున్నప్పుడు
ఇంద్ర ధనస్సును కలగన్నాం
అస్తిత్వాన్ని మరిచిపోయినప్పుడు
ఆత్మగౌరవాన్ని తట్టిలేపినం
అడవుల్లో యవ్వనం పచ్చని ఆకుల మీద
ఎండిన నెత్తురైనప్పుడు
రాజ్యపు అహంకారాన్ని అణగదొక్కినం
నిన్నటివరకు నా నేలను మట్టిగ గుర్తించని వాళ్లు
శిలాఫలకాల మీద దుమ్ము దులపని వాళ్లు
బతుకమ్మ చీరలను కాలబెట్టిన వాళ్లు
దొంగలతో జోడీ కట్టి
యాత్రలకు బయలుదేరిన్రు..
చార్మినార్ కడుపులో కత్తులు దింపినవాళ్లు
ఈ నేలను ఎండబెట్టి వలస పంపినవాళ్లు
సగం సగం ఉద్యోగాలతో మన చావు చూసినవాళ్లు
చుట్టూ సల్లని పంకలు
మెత్తని పరుపులతో దీక్షలు మొదలు పెట్టిన్రు..
అస్తిత్వ జెండా అన్నీ చూస్తున్నది
ఎండిన నేలల్లో జలసిరులై పారుతున్నది
పల్లెల వాకిట్లకు పండుగను మోసుకొచ్చింది
దోపిడీ గుంపులకు బల్లెమై బరిగీసింది.