దళితులు తమ అభివృద్ధికి తామే బాటలు వేసుకొనే దిశగా చైతన్యమై అన్నిరంగాల్లో భాగస్వా మ్యం అయినప్పుడే వారి ఆత్మగౌరవం నిలబడుతుంది. ఈ ఉద్దేశంతోనే 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి అమలుచేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి బ్యాంకు లింకేజీ, పూచీకత్తు లేకుండా రూ.10 లక్షలు ఇచ్చే పథకం ప్రవేశపెట్టారు. ఈ డబ్బుతో దళితులు తమకు నచ్చిన పని చేసుకొని ఆర్థికంగా ఎదగాలనేదే కేసీఆర్ మహత్తర లక్ష్యం.
రాష్ట్ర జనాభాలో 17.5 శాతం మంది దళితులున్నారు. సంఖ్య సుమారు 75 లక్షలు. వీరిలో నూటికి 80 శాతం మంది వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, అసంఘటిత కార్మికులు, కౌలు రైతులు, ఇతర కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ‘దళితబంధు’ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టడం అభినందనీయం. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమా రు 23 వేల కుటుంబాలకు ‘దళితబంధు’ అందను న్నది. దీనికోసం ఇప్పటికే కేసీఆర్ రూ.2 వేల కోట్లు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దళితుల అభివృద్ధితో పాటు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి మా ర్గం సుగమమవుతుంది. అట్టడుగున ఉన్న దళితులు ఎంత ఎదిగితే సమాజం అంత అభివృద్ధి అయినట్లు భావించిన కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు.
‘దళితబంధు’ పథకం ద్వారా దేశం దృష్టిని తనవైపు తిప్పుకొన్న కేసీఆర్ మీద అక్కసుతో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం పెట్టిన పథకం అని ప్రతిపక్షాలు పసలేని, చిల్లర వాదనలు చేస్తున్నాయి. కేసీఆర్ మహా జ్ఞాని. ఆయనకు భారత సమాజ అభివృద్ధి పట్ల గొప్ప దార్శనికత ఉన్నది. 25 ఏండ్ల కిందట, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ‘దళిత చైతన్య దీపిక’ ద్వారా దళితుల అభ్యున్నతికి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న 165 జాతుల గురించి ‘సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్’ వారు అధ్యయనం చేశారు. అందులో దళితజాతి ఒక టి. 2018 ఆగస్టు 31న ప్రగతిభవన్లో ‘సమగ్ర భూ సర్వే’ కోసం జరిగిన కలెక్టర్ల సమావేశంలో దళితులు, మహిళల అభ్యున్నతి మీద ఆ సంస్థ తమ విజన్ ఆవిష్కరించింది. ఆ సమావేశంలో పాల్గొన్న నేను దీనికి సాక్షిని. 2021-2022 బడ్జెట్లోనే కేసీ ఆర్ ‘దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రాం’ కింద వెయ్యి కోట్లు కేటాయించారు. నియోజకవర్గానికి వంద కుటుంబాలు ఎంపిక చేసి పథకం అమలుచేయాలని మొదట భావించినా, కొద్దిమందికి ఇవ్వడం ద్వారా పథకం ఫలితాలను సరిగ్గా అంచనా వేయలేమని, పైలట్ ప్రాజెక్టు కింద అధిక సంఖ్యలో దళిత కుటుంబాలున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నికలు యాదృచ్ఛికంగా వచ్చినా, కావాలని చేసినా అభ్యున్నతికే కదా..! దీన్ని కూడా వ్యతిరేకించి ప్రతిపక్షాలు తమ డొల్లతనాన్ని బహిర్గత పర్చుకున్నాయి.
దళిత మేధావులు, ఉద్యోగులు, విద్యావంతులపై ‘దళిత బంధు’ పథకాన్ని విజయవంతం చేసే గురుతర బాధ్యత ఉన్నది. దళితులు ఏం చేయలేరనే వాదనను పటాపంచలు చేసి దళితులు ఏమైనా చేయగలరని నిరూపించాలి. ‘దళితబంధు.. ఒక పథకం మాత్రమే కాదు, ఒక ఉద్యమం’ అన్న కేసీఆర్ మాటలను నిజం చేయాలి.
మెట్టు శ్రీనివాస్