నాయనలు
కుంగిపోవద్దు, కాల్చుకొని కూలిపోవద్దు
కుట్రలు కుర్చీలేలుతూ మీసాలు మెలెస్తాయి
నిరాశ నిస్పృహలొద్దు
మనచేతిలో నిప్పుంది
అన్యాయాన్ని తగులబెడ్దాం!
ఆత్మగౌరవ పతాకాన్ని
ఎగురెయ్యడానికి రెక్కలుండాలి
స్వప్నం కళ్లచూడాలి
జీవితాలే బూడిదలైనాక
అనుభవించేదేముంటుంది?
స్వాతంత్య్ర సమరం, సాయుధ పోరాటాలలో
పిడికిళ్లలో కారపు పొట్లాలు
కొంగు నడుముకు చుట్టిన కొడవండ్లు
చేతుల్లో రోకలి బండలు
వీరులెందరో తెగించి పోరాడారు
వీర కిశోరాలై నిలిచారు
తొవ్వకడ్డంగా మర్రివృక్షాలలా విస్తరించిండ్రు
పీఠాలు పోతాయని
లోలోపల అందరూ ఒకటే మాట పాట కూటమి
గ్లోబల్ సమిట్ దోపిడీ ఆవిష్కరణలకు
ఎదురొస్తాయి అపాయింట్మెంట్లు
బడుగుల బతుకు దెరువులకు
ప్రధానమంత్రి కార్యాలయ
తలుపులు మూసుకుంటాయి
సవర్ణ కుటుంబాల అసమాన న్యాయాలు
అన్నలు…
ఇన్నాళ్లు పనిముట్ల కోసం కొలుములు…
42 శాతం సాధించేందుకు మండిద్దాం
ధిక్కార నాదాలై సకల కశిపెలను కదిలిద్దాం!
బీసీ గోసను వినిపిద్దాం!
సబ్బండ శక్తేందో చూపిద్దాం!!
వాగ్దానాలన్నీ పుచ్చిపోయినప్పుడు
మనసు కలత చెందుతుంది
నిజమే
మన స్వరాలు పాటలే కావన్నప్పుడు
ఆకలి నిర్మూలనకు విధానాలే లేవన్నప్పుడు
సేవకులకే పనికొస్తారన్నప్పుడు…
ఆశ నిరాశై గుండె పగులుతుంది
శ్రామిక సమూహాలేకమై
సకల వృత్తుల నిలిపేద్దాం
దేశం బండి ఎట్లా నడుస్తదో చూద్దాం
విడివిడిగా కాదు ఫూలే అంబేద్కర్లయి నడుద్దాం
మీరు లేని ఎర్రకోటెందుకు?
బీసీ విప్లవాన్ని సృష్టిద్దాం!
ఆవేశాలొద్దు
వంచించడమే అలవాటైనచోట
ఒడువని దుఃఖము
ఓడిపోవడమే వంతైన చోట నగుబాట్ల పాలు…
వికసిత భారత్‌గా వెలిగిపోవడం అంటే
వెనుకబడిన వర్గాలను కూల్చటమే…
ఊరిలో వెలివేయబడటమే…
(సాయి ఈశ్వరాచారికి కన్నీటి నివాళులు)
వనపట్ల సుబ్బయ్య, 9492765358