ఆకలైతే సప్పిడి బువ్వల ఉప్పునీళ్లకు బదులు
కన్నీళ్ళను కలుపుక తాగినోళ్లను..
అగ్గి తానమాడి చీకటి కూడళ్లల్ల
కొర్రాసై నిలబడినోళ్లను…
ఉడుకుడుకు బువ్వలిన్ని తునుకలేసి కలుపుకొంటున్నపుడు
వాడకట్టు మూలమీది లైటుకిందా
నలుగురం గూడి మాట్లాడుకుంటున్నపుడు
మిమ్ముల యాజ్జేసుకుంటం..
మండే ఎండకాలం కూడా
నిండుగా పారే వాగు వంకల కాడా..
యాసంగిలో పుట్లు పుట్లుగా పుట్టే వడ్ల కుప్ప కాడా
మిమ్ముల యాజ్జేసుకుంటం..
ఖాళీగున్న కొలువుల్లో
మీ అన్నదమ్ములో, మీ అక్కాచెల్లెల్లో కూసుంటే
ఆ కుర్చీలల్ల మీ రూపు తలిసి
మిమ్ముల యాజ్జేసుకుంటం..
శెరువు నీటి అలల మీద ఊయలూగే
బతుకమ్మ శిగలోన మెరిసే గౌరమ్మల్లో
అనిత, అశ్విని, స్వర్ణలను యాజ్జేసుకుంటం..
దసర నాడు ప్రేమగా పంచుకునే
జమ్మాకు బంగారం, పాల పిట్టల్లో
యాదయ్య, శ్రీకాంత్, సురేష్లను
యాజ్జేసుకుంటం..
రాష్ట్రం నడిబొడ్డున
చిన్న రాష్ర్టాల సృష్టికర్త బాబాసాహెబ్ ముందు
మీ స్మృతివనం నివాళి దీపమోలే ఎలిగేది
మా కన్నీటి సమురుతోనే బిడ్డా..
మీ ఆశయాన్ని అమలుజేసుకునేటప్పుడు
మల్లొక ఉద్యమమే చేయాల్సి వచ్చినప్పుడు
మీ స్ఫూర్తిని, పోరాటాన్ని తప్పక యాజ్జేసుకుంటం
యాజ్జేసుకుంటం.. యాజ్జేసుకుంటం..
వి.దిలీప్: 84640 30808