జాతి జనులకు సాంస్కృతిక వారసత్వం అనేది ఘనమైన సంపద. పండుగలు సంస్కృతిలో ఒక భాగం. కాలక్రమేణా పండుగలు ‘మతం’లోకి చేర్చుకొని పండగలకు మతం రంగులేసి కొన్ని పరిధులు ఏర్పర్చుకున్నాం. కొన్ని అదనపు అంశాలను చేర్చుకున్నాం. అయినా కొన్ని పండుగలను సర్వజనులకు సాంస్కృతిక సంరంభాన్ని ఇస్తూనే ఉన్నాయి. మాటా, పాటా, ఆటల కలయికగా బతుకమ్మ పరిఢవిల్లుతున్నది. సంవత్సరమంతా ఎక్కడాలేని, దొరకని విశ్రాంతి, ఊరట, ఉత్సాహం బతుకమ్మ సమూహ సందడిలో పొందుతారు స్త్రీలు. అత్యంత ప్రాముఖ్యతను స్త్రీలకు ఇచ్చే ఉత్సవం బతుకమ్మ పండుగ. బతుకు తాత్వికతకు నిర్వచనంగా నిలుస్తున్నది. మాటకు విలువ, పాటకు శక్తినీ, ఆటకు సంరంభాన్నీ ఊపునూ ఇస్తుంది ఈ కాలం.
అనాదిగా స్త్రీలు పౌరాణిక పాత్రలనూ, దేవతలనూ ప్రతీకలుగా తీసుకొని తమ వెతలను పాటలుగా బహిర్గతం చేసే ప్రక్రియ బతుకమ్మ పాట. లయాత్మకంగా చప్పట్లు కొడు తూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ తమ గోడును వెళ్ళబోసుకోవడం తమకు శక్తినివ్వమని వేడుకోవడం బతుకమ్మ ఆటలోని విశిష్టార్థం. బతుకమ్మకన్నా ముందు బాలికల కోసం సృష్టించుకునే బొడ్డెమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకూ అన్నీ బతుకమ్మ ఆటలే. బతుకమ్మ ఒక పండుగ తంతు కాదు, తాత్విక జీవన ధార.
ఆడపిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నా తమ పుట్టింటికి వచ్చేందుకు దారులు సుగ మం చేసే రోజు బతుకమ్మ కాలంలోనే జరుగుతుంది. ఊరి చివర చెరువు గట్లమీద చివరి రోజు బతుకమ్మను కొలువు దీర్చినప్పుడు తమ తమ బంధువులు, స్నేహితులూ, ఊరందరి స్త్రీల పరిచయ పలకరింపులు జరిగే సమ్మేళనం స్త్రీలలోని ఆత్మీయ ఆర్ద్రతలకు వేదికగా నిలుస్తాయి.
ఇంతకీ బతుకమ్మ ఏమిటి? ప్రకృతి పట్ల ప్రేమ! ప్రకృతి ఆరాధన! బతుకు కొనసాగింపుకు శక్తుల్ని కూడగట్టుకునే శ్రద్ధ, సహనం, శాంతి మంత్రం! ప్రాకృతిక శక్తుల్ని జాగృతం చేసే సృష్టిని కొలువడం, ఆవాహన చేసుకోవడం, తమను తాము సమీక్షించుకోవడం, సమీకరణలో సమిష్టి ఆనందాన్ని పంచుకోవడం. ప్రపంచంలో… ఆకులకూ, పువ్వులకూ జన్మనిచ్చిన మట్టికీ, చెట్టుకూ తలవంచి మొక్కడం, వాటిని కాపాడుకునేందుకు నిత్యం సమాయత్తమయ్యే ప్రేరణను పొందడం, ప్రాకృతిక నియమాల పట్ల నిబద్దులు కావడం. ప్రకృతి సృష్టించిన మనిషి… ప్రకృతిని ప్రేమిస్తూ విస్తరింపజేసుకోవడం అన్ని జీవ ప్రాకృతిక సముదాయాల అనుబంధం వెల్లివిరియడం బతుకమ్మ ఉత్సవంలో అంతర్లీనమైన సందేశం.
ప్రకృతిలోని ఔషధీ గుణాలు, ప్రాణవాయువులతో జీవుల ప్రాణాల్ని నిలబెట్టే శక్తులు. మనిషికి ఆహారం, ఆహ్లాదం సమకూర్చే సృష్టికి చిహ్నా లు ప్రకృతి స్త్రీలు! సేద్యాన్ని గృహోపకరణాల్నీ! పశువుల పోషణా, రక్షణా, గృహ నిర్మాణం, చేతి పనులూ, కళలూ కనిపెట్టిన స్త్రీల ప్రతిభకూ, జీవ న సృజనకూ, శ్రమ చైతన్య వికాసాలకూ అద్భుతమైన తాత్విక పునాదిని ఏర్పర్చినది బతుకమ్మ’! పూల సేద్యం, పూలతో జీవన వ్యవసాయం అంతఃస్సూత్రంగా ప్రవహించే ప్రకృతి సంగీతం ఈ బతుకమ్మ వ్యవస్థ!
మట్టిని ముద్దగా కలిపి తంతెలు నిర్మించి బొడ్డెమ్మగా కొలిచే క్రమంలో మరింత విస్తృతమైన భావనల పుట్టుక నుండి బతుకమ్మ పుట్టింది. కేవలం పూల సేకరణ, పూల అలంకరణ బతుకమ్మ కాదు. తొమ్మిది రోజుల ఆరాధనలో తొమ్మిది రకాల పదార్థాలతో ఆరగింపులు చేసి అందరూ పంచుకొని తినడంలో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి.
పసుపుతో ముద్దచేసి బతుకమ్మ తలన పెట్టే గౌరమ్మ స్త్రీ గౌరవానికి గుర్తుగా నిలుస్తున్నది. అనేక స్థాయిల్లో బాధ్యతల్లో గౌరవం నిలబెట్టే కర్తవ్యంలో స్త్రీని గౌరవించే చిహ్నంగా గౌరమ్మ హైజినిక్ గుణాలు కలిగి ఉంటుంది. అది పసుపుతో చేసిన గోపురపు ఆకారపు ముైద్దెనా.. గుమ్మడి పువ్వు అయినా, బరువూ బాధ్యతలూ వివిధ హోదాల్లో నిర్వర్తించే స్త్రీ గౌరవానికి శిఖరాయమానంగా ఉంటుంది గౌరమ్మ. స్త్రీని ఉన్నతంగా గౌరవం నిలుపమని కోరడం. నిలుపుతుందని ఎత్తున పెట్టడం కూడా ఒక ఆలోచన నియమం అయి ఉంటుంది. బతుకమ్మ పాటల్లో కాల్పనిక పౌరాణిక గాథలు పల్లీయుల రాగాల్లో జాలువారుతాయి. ఉక్తో, పునరుక్తో, అతిశయోక్తో జానపదులు కాల్పనిక పౌరాణిక గాథలను మౌఖికంగా చరిత్రలో, నిలబెడుతున్నారు నేటి స్త్రీలు.
వావివరుసలు, పుట్టింటి, అత్తింటి సంబంధాలు, భక్తి భావనలు, స్త్రీల కష్టా లూ కడగండ్లు, కుటుంబ అనుబంధాలు, అప్పగింతలు, స్త్రీ ధర్మాలు, సంవాదాలు, బొడ్డెమ్మ బతుకమ్మల ఆంతర్యపు పాటలు, పౌరాణిక కథలు, నోములు ఇంకా ఎన్నెన్నో అంశాలతో అల్లుకున్న పాటలు… బతుకమ్మ పాటలు.దేవతామూర్తులుగా కొలిచే దేవతా స్త్రీలను సామాన్య స్త్రీలుగా ఊహించుకుని పాడుకునే పాటలు… ఉత్పత్తి ప్రకృతీ సంబంధిత పాటలు.
తూరుపు దిక్కునా ఉయ్యాలో/
తులసి వానలు కురిసె ఉయ్యాలో/
పడమటి దిక్కునా ఉయ్యాలో/
పాల వానలు కురిసె ఉయ్యాలో”
నాలుగు దిక్కుల కురిసిన వానలు కాల్వలుగా వాగులుగా సాగి చివరకు చెరువుల్లో కలిస్తే చెరువులు నిండుతాయన్న సామాజిక ఆలోచనా ధార బతుకమ్మ పాటగా కట్టింది.
బతుకమ్మ పాట పుట్టిన మొగిలిచెర్ల గ్రామం ఓరుగల్లుకు కూతవేటు దూరం లో ఉన్నది.
పాట పుట్టిన కథ – బతుకమ్మ పాటలో
మొగిలివనంలోన ఉయ్యాలో
మొలిచింది ఒక పాట ఉయ్యాలో/
ఊరి చెర్లలన్నింట ఉయ్యాలో
ఊట పాటల మోట ఉయ్యాలో
ఇన్నూరు ఏండనాడుయ్యాలో
పాట కోలాటమాడె ఉయ్యాలో
తెలంగాణా ఉద్యమం – బతుకమ్మ పాటలో
చిన్ని చిన్ని అడుగుల్లూ కోల్
చిన్నారి అడుగుల్లూ కోల్/
చప్పట్లు కొట్టుకుంటూ కోల్
జై తెలంగాణ అంటూ కోల్ /
బతుకమ్మ మానవాళి జీవన తత్వానికి భాష్యం చెప్పే మూలశక్తి అమ్మ’ మాత్రమే కాదు ఉద్యమాలకు ఊపిరులూది గెలుపు పథాన నడిపించే నైతిక శక్తి!
బతుకమ్మ’ తెలంగాణా ప్రాంత స్త్రీల సమూహ సాంస్కృతిక భాండాగారం. కానీ విశ్వ మానవ శాంతి, ఉన్నతీ, సంతోషాలకు పచ్చని ఆకాంక్షలు వర్షించే వరదాయని. బతుకును నడిపించే చోదకశక్తికి నిదర్శనంగా చేసుకోవలసిన ఊరు తల్లి! ఉసురులు నింపే సమృద్ధుల కల్పవల్లి! తాత్వికతల సారాంశం! జీవన చేతనకు కళోత్సవ శతపత్ర గీతం! ప్రకృతీ స్త్రీ మమేకం బతుకమ్మ!
(అక్షరయాన్ సౌజన్యంతో)
-అనిశెట్టి రజిత , 98494 82462