ఉద్యమమే జీవితమైతే దానికి నిలువెత్తు నిదర్శనం… వట్టికోట ఆళ్వారు స్వామి. కష్టాలతో సహవాసం చేసి, సాహిత్యంతో దో స్తీ చేసి, ఉద్యమానికి చేయూతను అందించిన ప్రజల మనిషి ఆయ న. ‘అసలు ఆళ్వార్లు పన్నెండు మందే, పదమూడో ఆళ్వారు మా వట్టికోట ఆళ్వా రు స్వామి’ అని మహాకవి దాశరథి కీర్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజా రచయిత, నిస్వార్థ సేవా పరాయణుడు వట్టికోట ఆళ్వారు స్వామి. సొంతంగా తెలుగు, ఇంగ్లీషు నేర్చుకున్న ప్రతిభావంతుడు ఆయన. కమ్యూనిస్టు కావడం వల్ల ఆయన జైలుకు వెళ్లారు. జైలు నుంచి బయటికొచ్చాక కూడా అనేక ఉద్యమాల్లో పని చేశారు. స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి అనేక సంస్థల్లో చురుగ్గా పని చేశారు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికుల సంఘాలకు నేతృత్వం వహించారు.
నాయకుడు ఎలా ఉండాలో ఆయన ‘ప్రజల మనిషి’ నవల తెలుపుతుంది. ఆయన రాసిన నవలలు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తెచ్చాయి. ‘గిర్దావరు’ నవలికలో భారత్లో హైదరాబాద్ రాజ్యపు బలవంతపు విలీనం, దేశ స్వాతంత్య్రానంతరం సమాజంలో పెరిగిన స్వార్థం, పతనమవుతున్న విలువలను సూటిగా, నిక్కచ్చిగా విమర్శించారు. తెలంగాణ మాండలికంలో, సహజ సుందరమైన శైలిలో వాస్తవిక జీవితాలకు అక్షర రూపమిచ్చిన సజీవ శిల్పాలుగా వట్టికోటవారి కథలు నిలిచిపోతాయి. కథకునిగా, నవలాకారునిగా, ప్రజా ఉద్యమ నాయకునిగా ఆళ్వారు స్వామి జీవితకాలమంతా చేసిన కృషి ఈనాటి రచయితలకీ, కవులకీ ఆదర్శప్రాయం.
– కామిడి సతీష్ రెడ్డి, 98484 45134
(నేడు ‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి)