రామే సీతావియోగ జ్వరజుషి నిహితం, లంఘనం యేన సింధోః
సీతాయాః పథ్య యుక్తం, ప్రమద వన మనోన్మధ్య లంకాధినేతుః
దృక్షున్యస్తః కషాయః దనుజ వరవధూ లోచనేష్వంబు పూరః
స్వాస్థ్యం త్రైలోక్యం జాతం, సజయతి, హనుమాన్ చిత్రవైద్యో కపీంద్రః!
వాల్మీకి రామాయణంలో లేకపోయినా ప్రాచుర్యంలో ఉన్న మనోహరమైన శ్లోకం ఇది. దాదాపుగా రామాయణాన్ని అన్యాపదేశంగా ఈ శ్లోకం తెలియజేస్తుంది. ‘శ్రీరాముడికి జ్వరం వచ్చిందట’- ఏం జ్వరం అంటే.. సీతావియోగ జ్వరం. హనుమను వైద్యానికి పిలిచారు. రోగిని పరీక్షించిన హనుమ.. ‘లంఘనం పరమౌషధం’ అంటారు కాబట్టి లంఘనం చేయమన్నాడట. అలాగని లంఘనం చేయమన్నది రాముడిని కాదట. మరెవరిని? సముద్రుడిని లంఘనం చేయమన్నాడట. రోగి లంఘనం చేయాలి కాని సముద్రుడిని చేయమనడం ఎందుకు? లంకకు వెళ్లేందుకు దారి ఇవ్వలేదని సముద్రుడిని శోషింపచేస్తానని రాముడు బాణం ఎక్కుపెట్టాడు కదా. అప్పుడు భయపడిన సముద్రుడు శోషించిపోయాడు. అదే లంఘనం చేయించడం.అలాగే పథ్యం పెట్టాడట.. ఎవరికి? రామునికి కాదు, సీతాదేవికి.
అదెలా.. రాముడి క్షేమవార్త తెలిపి ఆమెను సంతోషపెట్టాడు, ఉత్సాహపరచాడు. బాధను పోగొట్టడమే పథ్యం పెట్టడం. ఒళ్లంతా మర్దనం చేశాడట. ఎవరికి? అశోకవనానికి.. నందనవనం కన్నా సుందరమైన అశోకవనాన్ని నాశనం చేయడమే మర్దనం చేయడం. కండ్లలో కషాయం పోశాడట.. ఎవరికి? లంకాధిపతి అయిన రావణుడికి! అతని కుమారుడైన అక్షకుమారుడు సహా అశోకవన రక్షకులైన రాక్షస వీరులను ఎందరినో సంహరించడం, తన ప్రతాపానికి ప్రతీకగా నిలిచిన లంకను దహనం చేయడం ద్వారా… రావణుడి కండ్లలో కషాయం పోశాడు. ‘కన్నీళ్లు కార్చేట్టు చేశాడట..’ ఎవరిని? రావణాది రాక్షస వీరులందరూ మరణించడం వల్ల మండోదరి సహా భర్తలను, ఆప్తులను కోల్పోయిన రాక్షస స్త్రీలు కన్నీరు కార్చేలా చేశాడు. ఇక చివరగా, ‘ఆయన వైద్యంతో ఆరోగ్యం కుదుటపడిందట’.. ఎవరికి? ముల్లోకాల్లో ఉన్న వారందరికి! రాక్షస బాధల నుంచి విముక్తులు కావడం వల్ల దేవతలు సహా అన్ని లోకాలవారు ఆనందించారు. – పాలకుర్తి రామమూర్తి