ఏ పార్టీ అయినా ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించమని ప్రజలను అడుగుతుంది. ప్రచారం కూడా అభ్యర్థుల తరఫున సాగుతుంది. విచ్రితమేమో కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థికి ఓటు వేయమని అడగటం లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే తన పోస్టు పోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. ఈ ఎన్నిక తమకు జీవన్మరణ సమస్య అని ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్నేమో ఇక్కడ గెలువకపోతే తన దుకాణం బంద్ అవుతుందని, ప్లీజ్! ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల రాష్ట్ర అధినేతలు పార్టీ అభ్యర్థుల తరఫున కాకుండా తమ వ్యక్తిగత ఎజెండా కోసం ఓట్లు అడగటంతో ఇక్కడ పోటీ చేసేది వీళ్లా (అధినేతలా?), వాళ్ళా (అభ్యర్థులా?) అనేది అర్థం కాక జనం తికమక పడిపోతున్నారు.