దేశానికి కమ్ముకొస్తున్న చీకట్లను
పటాపంచలు చేయడానికి
ఇతను దారి దీపమై బయల్దేరాడు!
తరతరాల దుఃఖాన్ని
అంతులేని దరిద్రాన్ని విశ్లేషిస్తూ
పరివ్రాజకుడై ఇతను బయల్దేరాడు!
తరగని వనరుల్ని
వినియోగ వైఫల్యాలను ఎండగడుతూ
దార్శనికుడై ఇతను బయల్దేరాడు!
కలిసివచ్చే వారికి కౌగిళ్లిస్తూ
ఎదురొచ్చేవారికి సవాళ్ళు విసురుతూ
ఊహకందని వేగంతో ఇతను బయల్దేరాడు!
రిస్కు ఉన్న సంగతి
అందరికన్నా అతనికే ఎక్కువ తెలుసు
టాస్కుతోనే ఇతను బయల్దేరాడు!
దేశం అమ్మకం వస్తువవుతుంటే
తట్టుకోలేని తెగువతోనే
వడిసెల చేతబట్టి ఇతను బయల్దేరాడు!
జన సమూహాలను రెచ్చగొట్టే
మంత్రగాళ్ల పని పట్టేందుకే
సరికొత్త యంత్రాంగంతో ఇతను బయల్దేరాడు!
ముళ్ళ బాటలో ఎవరో ఒకరు నడవందే
దారులు నిర్మితం కావని తెలిసే
ఎంచుకునే ఇతను బయల్దేరాడు!
మిత్రో! సాహసం చేస్తున్నవాడు
ఒట్టి ఢింబక మాత్రుడు కాడు అఖండ
జన విశ్వాసంతోనే ఇతను బయల్దేరాడు!!
-కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261