బ్రతుకునిచ్చు నమ్మ బంగారు బతుకమ్మ
స్ఫూర్తి, కీర్తి నొసగి శుభము లిచ్చు
పువ్వు పువ్వులోన పుట్టెడు పుణ్యము
కలుగజేయు మనకు కలిమి బలిమి!
రంగు రంగు పూల రాశుల బతుకమ్మ
ఆటపాటలందు నలరు చుండ
అందచందములకు నపురూప దృశ్యంబు
చూసి తీరవలయు స్ఫూర్తి ప్రదము!
తేజరిల్లుచుండు తెలంగాణమందున
మరువలేరు స్త్రీలు మనసులోన
రాష్ట్ర ప్రభుత తీరు రమణీయ భావన
పల్లె పట్న ప్రజల పారవశము!
మూల కారణంబు ముచ్చట్ల పరువడి
ఆడమగల కిలను హాయినిచ్చు
మధురమైన గాన మంజుల గీతాల
గౌరి మాత కిచ్చు గౌరవంబు!
పడతులంత కూడి బతుకమ్మలాడుతూ
కన్నుల పండువగాను కాంతులీన
మోదమలరతిరుగ బొడ్డెమ్మ చుట్టును
కొమ్మలంత హాస కోర్కెలమర!
పసుపు తోడజేసి పసిడి గౌరమ్మకు
తీరు తీరు పూల తీర్చిదిద్ది
భక్తి మీర స్త్రీలు బాగుగా కొలువగ
అభయమివ్వు తల్లి నంజలిడుదు!
బంగరు బతుకమ్మ భాతి తెలంగాణ
సాలు సాలు సాగు సంబరమ్ము
జలధి దాటి తాను జగమంత ప్రాకుచు
పూజలందుకొనెడి పూల తేరు!!
-డాక్టర్ గన్నోజు ,శ్రీనివాసాచారి , 85558 99493