తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, ప్రయోజనాత్మకంగా అమలుపరుస్తున్న నీటివనరుల వినియోగం అనేకవిధాలుగా ఉపయోగపడుతున్నది. సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడం వంటివి రాష్ట్ర ప్రజల అనుభవంలో కనిపిస్తున్నాయి. వ్యవసాయరంగం అనతికాలంలోనే సాధించిన ప్రగతి, ‘మిషన్ భగీరథ’ అమలు ఫలితంగా తెలంగాణ ప్రజల దాహార్తిని పరిపూర్ణంగా తీర్చగలిగిన విజయగాథ లాంటి ఉదాహరణలు కోకొల్లలు.
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నది.నీటి వనరుల్లోని ‘బ్యాక్ వాటర్’లో ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకాన్ని చేపట్టేందుకు వీలున్నమార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి చేపల పెంపకానికి సుమారు ఆరున్నర లక్షల హెక్టార్లు అందుబాటులో ఉన్న నీటి విస్తీర్ణం, కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఏడున్నర లక్షల హెక్టార్లకు విస్తరించి ఉపరితల జల వనరుల సౌలభ్యంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకున్నది.
శానికే తలమానికమైన బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి అనుబంధంగా నిర్మించుకున్న అనేక జలాశయాలు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ఫలితంగా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఫిషరీస్, ఆక్వాకల్చర్ రంగాలు తెలంగాణలో ఉజ్వలమైన భవిష్యత్ పథంలో దూసుకుపోతున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలు ఇక్కడి జలసేద్యానికి జవసత్వాలను సమకూరుస్తున్నాయి. ఈ ఎనిమిదేండ్లలోనే మత్స్యరంగం అనేక మైలురాళ్లను దాటుకుంటూ ముందుకుసాగుతున్నది.
ఇందులో భాగంగానే మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయలతో దేశంలో ఎక్కడా లేనిరీతిలో ‘ఉచిత చేప పిల్లల పంపిణీ’ పథకాన్ని అమలుపరచి వారి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నది. మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వానికి సంబంధించిన నిబంధనలను సరళీకరించింది. తద్వారా కొత్తగా వేల మందికి సొసైటీల్లో సభ్యత్వం లభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా మరో 1100 మత్స్య సహకార సంఘాలను ఏర్పాటుచేసింది. తద్వారా మరో లక్ష మంది మత్స్యకారులకు సొసైటీలలో సభ్యత్వం కల్పించింది.
గత మే, జూన్ నెలల్లో అమలుచేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా 650 మత్స్యసహకార సొసైటీలను ఏర్పాటుచేసింది. దీంతో దాదాపు 15 వేల మందికి కొత్తగా మత్స్య సహకార సొసైటీలలో సభ్యత్వం లభించనున్నది. రాష్ట్రంలో మహిళా మత్స్య సహకార సొసైటీల సంఖ్యను పెంచడం ద్వారా మత్స్యరంగానికి సంబంధించిన కార్యకాలాపాల్లో మహిళల పాత్రను మరింతగా పెంచేందుకు తెలంగాణ మత్స్యశాఖ ప్రయత్నిస్తున్నది. సొసైటీలలో సభ్యత్వం కల్పించేందుకు అవకాశాలు లేనిచోట మత్స్య మార్కెటింగ్ సొసైటీలను ఏర్పాటుచేసి ప్రతిఒక్కరికీ సభ్యత్వాన్ని కల్పించడం ద్వారా ప్రభు త్వ పథకాలను వర్తింపజేస్తున్నది. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ.5 లక్షలను చెల్లించే ఎక్స్గ్రేషియా పథకాన్ని ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నాది.
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. నీటి వనరుల్లో ‘బ్యాక్ వాటర్’లో ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకాన్ని చేపట్టేందుకు వీలున్న మార్గాలను అన్వేషిస్తున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి చేపల పెంపకానికి సుమారు ఆరున్నర లక్షల హెక్టార్లుగా అందుబాటులో ఉన్న నీటి విస్తీర్ణం, కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఏడున్నర లక్షల హెక్టార్లకు విస్తరించుకొని ఉపరితల జల వనరుల సౌలభ్యంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకున్నది.
సంప్రదాయ చేపల పెంపకం విధానాలకు భిన్నమైన పద్ధతుల్లో ఈ జలవనరుల్లో ఆధునిక విధానాలను అమలుపరచడం ద్వారా ‘ఆక్వాకల్చర్’ పద్ధతుల్లో చేపల పెంపకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన అమెరికా పర్యటన సందర్భంగా మధ్య మానేరు జలాశయంలో సుమారు రూ.వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో ఆధునిక ‘కేజ్ కల్చర్’ విధానం లో చేపల ఉత్పత్తి, ఫిష్ ప్రాసెసింగ్, విదేశీ ఎగుమతులకు సంబంధించిన ప్రాజెక్టుపై ఒప్పందం కుదుర్చుకున్నారు.
జార్ఖండ్ లో నిర్వహిస్తున్నట్టుగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తర్వాత మూసివేసిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోనూ ఆధునిక పద్ధతులను పాటిస్తూ చేపలను పెంచేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తున్నది. కొత్తగా ఉనికిలోకి వచ్చిన సాగునీటి వనరులతో పాటుగా, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నిరుపయోగమైన నీటి వనరులన్నింటినీ చేపల ఉత్పత్తికి అనుకూలంగా మార్చుకొని వినియోగించుకోవాలనే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు.
సంప్రదాయ పద్ధతుల్లో కొనసాగుతున్న మత్స్యరంగంతో పాటుగా ఆధునిక విధానాలను అనుసరించి నిర్వహించే ‘ఆక్వాకల్చర్’ పద్ధతులను కూడా రాష్ట్రంలో విరివిగా ఆచరణలోకి తీసుకురావాలి. తెలంగాణలో చేపలు, రొయ్యల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలి. మన రాష్ర్టానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేందుకు వీలున్న మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉన్నది.
చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో పాటుగా, ఆక్వాకల్చర్ అనుబంధరంగాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వీలున్న మార్గాలను అన్వేషించి, అమల్లోకి తీసుకురావాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. ఫలితంగా సంప్రదాయ మత్స్యరంగంతో పాటుగా, ఆక్వాకల్చర్ ద్వారా తెలంగాణలో కనిష్ఠంగా మరో లక్ష మంది యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు.
ఈ రంగం మీద అవగాహన కలిగిన పలువురిని కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఉపరితల జలవనరుల విస్తీర్ణంలో దేశంలో అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే చేపల ఉత్పత్తిలోనూ అగ్రస్థానం సాధిస్తుందనటం లో సందేహం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన కార్యాచరణలోనూ ప్రతి భా పాటవాలను ప్రదర్శిస్తూ.. ముందు కు పోవటమే.
(వ్యాసకర్త: ‘తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు)
-పిట్టల రవీందర్
99630 62266