e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home ఎడిట్‌ పేజీ ముమ్మాటికీ రైతుల విజయమే

ముమ్మాటికీ రైతుల విజయమే

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఏడాదికాలంగా ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం లభించింది. ప్రధాని నరేంద్రమోదీ గురునానక్‌ జయంతి రోజున దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ‘దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా.. మంచి మనస్సుతో, పవిత్ర హృదయంతో, ఓ విషయం చెప్పదలచుకున్న. బహుశా మా తపస్సులో ఏదో ఒక లోపం ఉండి ఉండొచ్చు. అందుకే దీపం లాంటి సత్యం గురించి కొందరు రైతు సోదరులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. ఇది ఎవర్నీ తప్పుబట్టే సమయం కాదు. మూడు వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు.

మూడు వ్యవసాయ చట్టాల రద్దు ముమ్మాటికీ రైతుల విజయమే. అదే తరహాలో తెలంగాణలో రైతుల పక్షాన పోరాటం కొనసాగుతున్నది. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని రైతులు పట్టుబడుతున్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించి స్వయంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నది. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా ఉద్యమ కార్యాచరణను దశలవారీగా కొనసాగిస్తున్నది. దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై అందరినీ ఆలోచింపజేస్తున్నది.

- Advertisement -

కేసీఆర్‌ పట్టువదలని విక్రమార్కుడు. పోరాట పంథా ఎంచుకున్నారంటే దానికి ఫలితం వచ్చేంతవరకు నిష్క్రమించరనే భావన ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే స్వరాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం ప్రజలకు తెలియంది కాదు. అదే తరహాలో రైతు పోరాటం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జయకేతనం ఎగురవేస్తుందనేది స్పష్టమవుతున్నది. కేసీఆర్‌ ఏదైనా పోరాటం చేయాలని ముందుకువస్తే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని ఒక వ్యూహంతో ముందుకుసాగుతారు. అదే తరహాలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో చైతన్యం రగిలించారు. అనతికాలంలోనే ఉద్యమస్ఫూర్తిని రాజకీయ కోణంలోకి మార్చి ఉద్యమాన్ని మరింత ఉరకలెత్తించారు. చివరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక తప్పలేదు. తెలంగాణ పోరాట విషయంలో ప్రపంచమే నివ్వెరపోయిన పరిస్థితి. అలాంటి పోరాటధీరుడు రైతుల పక్షాన నిలిచి ప్రత్యక్షంగా పోరాట మార్గంలోకి వచ్చారని, ఆ పోరాటం దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలపై ఒక స్పష్టతకు వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాదు కేసీఆర్‌ తన ఉద్యమంతో రైతుల పోరాట తీవ్రతను మరింత పెంచుతున్నారని ప్రముఖ పాత్రికేయుడు భూపేంద్ర చౌబే ప్రకటించారు.

కేసీఆర్‌ గతంలో రైతుల పోరాటానికి మద్దతిచ్చారు. అదేవిధంగా ఇప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులపై వారు పండించిన ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రంపై దండయాత్రకు బాటలు వేశారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇచ్చేవరకు రైతుపక్షాన పోరాటాలు ఆగవని ఇప్పటికే కేసీఆర్‌ ప్రకటించారు. ఒకవేళ కేంద్రం మొండిగా వ్యవహరిస్తే పోరాటం ఉధృతంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు కేంద్రం వరిధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ రైతాంగం ఎట్టి పరిస్థితిలో నష్టపోకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని రైతులకు కేసీఆర్‌ భరోసా కల్పించారు. రైతులు పండించిన ధాన్యంలో చివరి గింజవరకు కొంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు రైతులు పండించే పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కేసీఆర్‌ పట్టుబడుతున్నారు. అందుకు దేశంలోని 15 కోట్ల మంది రైతు కుటుంబాలను సైతం ఏకం చేసే బాధ్యత కేసీఆర్‌ తన భుజాన వేసుకున్నారు. మద్దతు ధర చట్టంపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ పార్లమెంటు సభ్యులు కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. అందుకు కేసీఆర్‌ పార్లమెంటులో జరగబోయే పోరాటానికి దిశానిర్దేశం చేశారు. ఒక వేళ అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం మరొకమారు తలొగ్గక తప్పదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్తు చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నదని అందుకు వాటిని రద్దు చేసుకోవాలని కేసీఆర్‌ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపాదిత విద్యుత్తు చట్టాలు రద్దు చేయకపోతే దేశవ్యాప్త ఆందోళనకు రైతులను ఏకంజేసే అవకాశం సైతం ఉన్నది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోకరిల్లి దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పకతప్పదు.

కేసీఆర్‌ వ్యూహాలు.. పోరాటాలతోనే సరిపెట్టేది కాదు. దాన్ని ఆచరిస్తూనే పోరాటంలో నష్టపోయినవారికి దాతృత్వం చాటుతుంటారు. ఢిల్లీ కేంద్రంగా రైతులు చేస్తున్న పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.మూడు లక్షల ఆర్థికసాయం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. రైతు ఉద్యమంలో సుమారుగా 750 మంది రైతులు మరణించారని రైతుసంఘం నాయకులు ప్రకటించారు. ఆ మొత్తం కుటుంబాలకు రూ.22.50 కోట్లు అందచేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.

కేసీఆర్‌ మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్నారు. కేసీఆర్‌ స్ఫూర్తితో అనేక జాతీయస్థాయి నేతలు సైతం రైతు అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సైతం అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారంగా 25 లక్షలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి.

(వ్యాసకర్త: అరూరి రమేష్‌, శాసనసభ్యులు, వర్ధన్నపేట)

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement