సమీప భవిష్యత్తులో కూడా చైనా ఆ దేశ ‘సుప్రీం లీడర్’ షీ జిన్‌పింగ్ ఉక్కు పిడికిలిలోనే కొనసాగుతుందనేది అధికారికంగా ధ్రువపడింది. ‘21వ శతాబ్దానికి, సమకాలీన చైనాకు మార్క్సిజం అంటే జిన్‌పింగ్ ఆలోచనావిధానమే’ అంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనం తీర్మానాన్ని ఆమోదించింది. దేశాధ్యక్షుడిగా రెండుసార్లు మించి ఎవరూ ఉండటానికి వీల్లేదన్న నిబంధనను గతంలోనే రద్దు చేయించుకున్న జిన్‌పింగ్ మూడోసారి ఆ పదవి చేపట్టటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో జిన్‌పింగ్‌కు ముందు అధికార వికేంద్రీకరణ, బహుళ నాయకత్వం నెలకొంటున్న ధోరణి కనిపించింది. కమ్యూనిస్టు పార్టీ పట్టు సడలితే చైనా సమాజం కొంత ఊపిరి పీల్చుకుంటుందనే ఆశలు రేకెత్తాయి. కానీ జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టిన తరువాత అవినీతి ప్రక్షాళన పేర పార్టీలో ప్రత్యర్థులను వెంటాడారు. పార్టీని గుప్పిట పెట్టుకొని తానే జీవితాంతం అధికారంలో కొనసాగే ఆలోచనలో ఉన్నారు.
1970 దశకంలో మావో మరణం తరువాత డెంగ్ జియావోపింగ్ నాయకత్వంలో ఆర్థిక సరళీకరణ విధానాలు అమలయ్యాయి. అయితే ఆర్థికంగా ఉదారవాద విధానాలు అమలు పరిచినా, రాజకీయంగా కమ్యూనిస్టు పార్టీ నిరంకుశత్వం మరింత బలపడింది. ఇక ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో జిన్‌పింగ్ ముఠాకు ఎదురులేకపోవడంతో చైనా ప్రజలకు నామమాత్రపు హక్కులు కూడా కరువయ్యాయి. మరోవైపు చైనా ప్రభుత్వం టిబెట్, వీగర్ ప్రాంతాల ప్రజలను సామ్రాజ్యవాద స్వభావంతో క్రూరంగా అణచివేస్తున్నది. శ్రామికులకు తగిన వేతనాలు ఇవ్వకుండా చౌక వస్తువులను విదేశాలలో కుమ్మరిస్తున్నది. ఆర్థిక, సైనిక శక్తిగా చైనా ఎదుగుతున్న క్రమంలో జిన్‌పింగ్ ప్రజల్లో జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టి తన ప్రాభవాన్ని కాపాడుకుంటున్నారు. ఇదొక ప్రమాదకర పోకడగా చెప్పవచ్చు.
జిన్‌పింగ్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సమాజాలకు ప్రమాదకరమైనవి. పాశ్చాత్య ఉదారవాద వ్యవస్థలకన్నా, చైనా తరహా నిరంకుశత్వాలే మేలని కార్పొరేట్ కంపెనీలు భావించే ప్రమాదం పొంచి ఉన్నది. మూడవ ప్రపంచ దేశాలలో విదేశీ శక్తులు నిరంకుశ పాలనలను ప్రతిష్ఠించడానికి ప్రయత్నించవచ్చు. లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాల్లో చైనా పెట్టుబడుల వరదను పారించి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నది. జిన్‌పింగ్ విధానాల వల్ల చైనాలో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారి ఆందోళనలు చెలరేగవచ్చు. ఈ వ్యతిరేకతను అణచివేయడానికి, ప్రజల దృషి మరల్చటానికి చైనా తన పొరుగున ఉన్న భారత్ వంటి దేశాలతో ఘర్షణలకు దిగే ప్రమాదం పొంచి ఉన్నది. చైనాలో పరిణామాల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలి. చైనా ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామిక సమాజాలతో భారత్ కలిసికట్టుగా పోరా డవలసి ఉన్నది.