ధాన్యం కొనుగోలు గురించి వాస్తవాలేమిటో మాట్లాడేందుకు ప్రభుత్వ మద్దతుదారులే కానక్కరలేదు. లెక్కలన్నీ కండ్ల ఎదురుగా ఉన్నందున,జరుగుతున్నదేమిటో ఎవరైనా గుర్తించవచ్చు. వానకాలం మొత్తం కొనుగోళ్లు నిరుడు (2020-21) 48.74 లక్షల టన్నులు కాగా, ఈ సంవత్సరం (2021-22)
డిసెంబర్ 16 వరకు జరిగిందే 50 లక్షల టన్నులకు పైగా ఉంది. సేకరణ ఇంకా జరుగుతున్నది. అటువంటి స్థితిలో బీజేపీ, కాంగ్రెస్‌లు అసలు సేకరణే జరగటం లేదన్నట్లు రోజూ కాకిగోలతో హోరెత్తటం చూస్తే వారి నిజాయితీ ఎటువంటిదో అర్థమవుతున్నది.
ప్రతిరోజు టీవీలు, పత్రికలు చూసేవారికి బీజేపీ, కాంగ్రెస్‌ల విమర్శలు నిజమనే భ్రాంతి కలుగుతుంటుంది. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతమాత్రం ఖరీదు చేయటం లేదని, రైతులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, కొనుగోలు కేంద్రాలన్నవే లేవని, దానితో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తోస్తుం ది. ఇదిగాని నిజమైతే ఈ ప్రతిపక్షాలు తమ లెక్కలు ఏమి టో తాము చెప్పాలి. అది నిజమా కాదా అన్నది తర్వాత విషయం. ముందుగా తమ లెక్కలంటూ ఏదో ఒక్కటి చెప్పాలి. కానీ, కొన్ని వారాలుగా విమర్శలు చేస్తున్న ఈ రెండు పార్టీలు ఇంతవరకు ఒక్కటంటే ఒక్కసారైనా ఏ లెక్కలూ చెప్పినట్లు లేదు.
పౌర సరఫరాల శాఖ బహిరంగంగా ప్రకటించిన దాని ప్రకారం, ఈ సీజన్లో ధాన్యం సేకరణకు 6,846 కేంద్రా లు ప్రారంభించారు. ఇన్ని కేంద్రాలు గతంలో ఎన్నడూ లేవు. సేకరించిన ధాన్యం లోగడ (2020-21) అత్యధికం గా 48.74 లక్షల టన్నులు కాగా, ఈ సీజన్లో (2021 -22) ఇప్పటికే దాన్ని మించిపోయి ఈ నెల 16 వరకు 50 లక్షల టన్నులకు చేరింది. కొనుగోళ్లు ఇంకా సాగుతున్నా యి. ఈ లెక్కలన్నీ నిజమా కాదా? బీజేపీ, కాంగ్రెస్‌లు సూటిగా సమాధానమివ్వాలి. కాదంటే తమ లెక్కలేవో ప్రకటించాలి. వాటిని తటస్థులు తనిఖీ చేసేందుకు వీలవుతుం ది. ఒకవేళ రాష్ట్రవ్యాప్తంగా ఇందుకు వీలుకాకపోతే ప్రతి జిల్లాలో నమూనా కోసం కొన్ని మండలాల చొప్పున తీసుకొని, ప్రభుత్వం చెప్పే లెక్కలతో పోల్చవచ్చు. తేడాలుంటే అధికారులను ప్రశ్నించవచ్చు. రైతులకు వివరించవచ్చు. ఇది సవ్యమైన విమర్శనా పద్ధతి అవుతుంది. అందులో నిజాయితీ ఉంటుంది. అందుకు విశ్వసనీయత లభిస్తుంది. రైతుల దృష్టిలోనే కాదు. సాధారణ ప్రజలకు కూడా.
ఇదంతా ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేనిది కాదు. ఆ నాయకులు చదువుకున్నవారు, అనుభవజ్ఞులు. కానీ సమస్య వస్తున్నదెక్కడ? వారికి కావలసింది అర్థం చేసుకోవటం కాదు. వాస్తవాలు కాదు. విశ్వసనీయత కాదు. ఏదో ఒకవిధంగా అధికారం కావాలి. అందుకోసం అబద్ధాలు మాట్లాడటం, ప్రజలను తప్పుదారి పట్టించటం కావాలి. అందుకు రైతులను రెచ్చగొట్టడానికి వెనుకాడరు. తమ పాలనలో ఉన్న కేంద్రం చేస్తున్నదేమిటో తాము స్వయంగా తమ రాష్ర్టాల్లో చేస్తున్నదేమిటో బీజేపీ విస్మరిస్తుంది. తమ రికార్డును కాంగ్రెస్ మరిచిపోతుంది. స్వయంగా తమ కేంద్రమే చెప్పేదానికి విరుద్ధంగా ఇక్కడి బీజేపీ మాట్లాడుతుంది.
ఉదాహరణకు పంటల వైవిధ్యత అవసరమని కేంద్రం సూచిస్తే ఇక్కడి బీజేపీ నాయకత్వం వడ్లే పండించి తీరాలంటున్నది. పంటల వైవిధ్యత ఎందుకు అవసరమో వ్యవసాయ శాస్త్రవేత్తలంతా స్పష్టంగా చెప్తున్నా వీరికి పట్టదు. ఇదంతా ఎందువల్ల? కేవలం అధికారం కోసం. తెలంగాణ రైతుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్నట్లు నటించటం మినహా, ఇక్కడి మేలు కోసం కాంగ్రెస్, బీజేపీలలో ఎవరూ ఎప్పుడూ కృషి చేసింది లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్రద్ధ చూపించటం తప్పితే, ఇక్కడి కాంగ్రెస్ వాదులంతా డబుల్ గేమ్ ఆడినవారే. బీజేపీ ఆడిన డబుల్ గేమ్‌లు కూడా అందరికీ తెలిసినవే. అందుకే ప్రజలు వారిద్దరిని ఈ స్థితిలోకి నెట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వీరిద్దరి ధోరణి మారలేదు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయం, నీటిపారుదల సహా అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందుతుండగా.., ప్రతిపక్షాలది అడుగడుగునా నెగెటివ్ పాత్ర అవుతున్నది. ఎక్కడైనా ఒక చిన్న పొరపాటో, ఆలస్యమో జరిగితే ఎత్తి చూపటాన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ ఏమీ లేని దగ్గర కూడా కల్పిత దృష్టి, వక్రీకరణలు, రాష్ర్టాభివృద్ధి కోసం తమకు వీలైన చేయూతనివ్వటానికి బదులు నష్టదాయకంగా వ్యవహరించటం గర్హనీయం. స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రశ్నోత్తరాలలో ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన సందర్భాలను సైతం విస్మరించి అవే అంశాలపై అసత్య ప్రచారాలు చేయటం, బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక అలవాటుగా మారింది. కొన్ని పత్రికలు, ఛానళ్లు, కొందరు సినికల్ మేధావులు ఏవేవో ప్రయోజనాల కోసం వీరితో గొంతు కలపటం ఒక విచారకర స్థితి.
దీనికి విరుగుడుగా వాస్తవాలు మరింత విస్తృతంగా, లోతుగా సామా న్య ప్రజలకు చేరవలసి ఉంది. ఆ విషయమై రాష్ట్రస్థాయి నుంచి మొదలుకొని గ్రామాల వరకు, వివిధ రంగాలకు సం బంధించి తరచూ చర్చలు జరగాలి. అందుకు ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ యంత్రాంగం, రాష్ట్రం బాగు ను కోరే ఆయా వర్గాలు కృషిచేయాలి. ఇది ఒక పద్ధతి ప్రకారం నిరంతరం జరిగితే బీజేపీ, కాంగ్రెస్‌ల గోబెల్స్‌కు అవకాశం లభించదు.
– టంకశాల అశోక్ ,98481 91767