సర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించే కార్యక్రమం దేశం నలుమూలలా సంచలనంగా మారిన విషయం తెలిసిందే; మరీ ముఖ్యంగా ఇతర దేశాలతో సరిహద్దు ఉన్న రాష్ర్టాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం ఆందోళనలకు దారి తీస్తుంది. పైగా ఈ కార్యక్రమం ఎన్నికలకు కొన్ని నెలల ముందు చేపట్టటం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. అయితే కసరత్తు చెయ్యటం ఇదే మొదటిసారి కాదు. 1951 నుంచి 2004 వరకు ఇలాంటి కార్యక్రమం 8 సార్లు జరిగింది. 2004 తర్వాత మళ్లీ ఇప్పుడు అంటే 21 ఏండ్ల తర్వాత ఈసీ ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే ఇంతకు మునుపు లేని గందరగోళం, దుమారం ఇప్పుడే ఎందుకు? అనేది ప్రశ్న.
సర్ పేరుతో లక్షలాది మంది పేర్లను ఓటర్ల జాబితాలనుంచి తొలగిస్తున్నారని ఆరోపణ. ప్రజల్లో ఇది భయాందోళన కలిగిస్తుంది. ఓటు అనేది రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించిన హక్కు. ఒకసారి ఓటర్ గా నమోదయితే జీవితకాలం వుండే హక్కుఅది. ఒక పేరును ఓటరు జాబితా నుంచి తొలగించటం అనేది కేవలం ఓటరు మరణించినప్పుడే చెయ్యాలి. వాస్తవానికి ఓటు అనేది సంక్షేమ పథకం కాదు. కాబట్టి సంక్షేమ పథకాల మాదిరిగా ఇప్పుడు అర్హులు భవిషత్తులో అనర్హులవటం, లేక ఇప్పడు అనర్హులు భవిషత్తులో అర్హులవ్వటం జరగదు. సంక్షేమ పథకాలు ఆదాయంతో ముడిపడి ఉంటాయి. ఓటు ఆదాయంతో నిమిత్తం లేనిది. మరి ఏ కారణంతో జాబితాలో వున్న పేరును తొలగిస్తారు? ఒకే నిర్దిష్టమైన కారణం సదరు ఓటరు మరణించినప్పుడు. మరొక కారణం ఒక మనిషి పేరుమీద రెండు ఓట్లు ఉన్నప్పుడు. ఇవి సహేతుకమైన కారణాలు. వీటిమీద ఎవరికీ అభ్యంతరం వుండకూడదు. కానీ బెంగాల్లో, ఈ ప్రక్రియలో పాల్గొన్న ముస్లిం అధికారుల పేర్లు తొలగించారు. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం లేదు. ఓటు లేని అర్హులందరినీ ఓటరు జాబితాలో చేర్చవలసిన ఎన్నికల సంఘం ఒక్క బెంగాల్ లో 90 లక్షల మందిని ఓటరు జాబితా నుంచి తొలగించింది. చట్టంలో లేని విధంగా, ‘లాజికల్ డిస్క్రిపన్సీ’ అనే సాకును నెపంగా చూపి 27 లక్షల మంది పేర్లను తొలగించింది.
ఒక వ్యక్తికి ఒకటే ఆధార్ కార్డు, ఒకే పాన్‌కార్డు, ఒకే పాస్‌పోర్ట్ ఉంటుంది. వారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడి, ఒక మనిషికి ఒకే ఓటు ఉండేలా చేయటం సాధ్యం కాదా అనేది ప్రశ్న.
ప్రభుత్వ పింఛను పొందేవారు తాము జీవించి ఉన్నామని ఏడాదికి ఒకసారి నిరూపించుకోవాలి పింఛను ఇచ్చే సంస్థకి. దానినే లైఫ్ సర్టిఫికెట్ అంటారు. అరవై ఏండ్లు నిండిన ప్రతి ఓటరు ఐదేండ్లకొకసారి, తాము జీవించి ఉన్నామని నిరూపించుకునే ఆన్లైన్ వెసులుబాటు కల్పించలేమా? బ్యాంకు ఖాతా, పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసినట్టు, ఓటరు కార్డు కూడా ఆధార్‌తో అనుసంధానం చేయలేమా? ఎన్నికల్లో బయోమెట్రిక్ ఆధారంగా ఓటు వేసే విధానం తీసుకురాలేమా? అనేవి ఇక్కడ అందరిలోనూ తలెత్తే ప్రశ్నలు. ఓటరు జాబితా వెరిఫికేషన్ పేరుతో ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తిగా నిర్వీర్యం చేసే పాపానికి ఒడిగట్టిందని మాజీ ఎన్నికల అధికారి అశోక్ లావాసా దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి కూడా ఓటరు జాబితాను పునీతం చేస్తామంటారు. ఇది హోంమంత్రి బాధ్యతా? ఎన్నికల సంఘం పనితీరు ప్రభుత్వానికి అతీతంగా ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఒకే భాష మాట్లాడటం విచిత్రం. రాష్ర్టాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు?
ఈ ప్రక్షాళనలో భాగంగా మరణించిన వారి పేర్లను తొలగించటం మీద ఎవరికీ అభ్యంతరం ఉండదు. 21 ఏండ్ల సుదీర్ఘ వ్యవధిలో దేశంలో ఎన్నో కోట్ల మంది చనిపోయి ఉండవచ్చు. కానీ జీవించి ఉన్న లక్షలమంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారనేది విమర్శ.
రెండు ఓట్లు కలిగి ఉన్న ఓటర్లు ఒక రాష్ట్రంలో లక్షల్లో ఉంటారా? ఇక ఓటు హక్కుకు అర్హులుగా నిరూపించుకోవటానికి పౌరసత్వం అనే విషయం కూడా తెరమీదకు వస్తుంది. కానీ ఎంతమంది భారతీయులు తాము ఈ దేశ పౌరులమని నిరూపించుకోగలరు? పౌరుడు అనేదానికి ఖచ్చితమైన రుజువు పాస్‌పోర్టు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం ప్రకారం 2024 ఫిబ్రవరి రెండు నాటికి జారీ చేసిన పాస్‌పోర్టులు 9 కోట్ల 26 లక్షల 24 వేల ఆరువందల అరవైఆరు. గడచిన రెండేండ్లు కలుపుకొన్నా మొత్తం పాస్‌పోర్టులు 10 కోట్లకు మించి ఉండవు. మరి మిగిలిన వారందరూ ఈ దేశ పౌరులుగా నిరూపించుకోవటానికి నిర్దిష్టమైన ఆధారం ఏముంటుంది?
అసలు ఓటును తొలగించటం అనే అంశం మీద సరైన ఏకాభిప్రాయం, అవగాహన ఇంకా రాలేదు దేశంలో. ముందు అవగాహన కలిగించి చేసి ఆ తర్వాత దీన్ని అమలు చేయడం శ్రేయస్కరం. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలు ధర్మబద్ధంగా పనిచెయ్యటమే కాదు, పని చేస్తున్నట్లు కనిపించాలి కూడా. కానీ ప్రస్తుతం ఈ రెండు లక్షణాలు కనుమరుగవుతున్నాయి. భవిషత్తులోనైనా ఎస్ఐఆర్ కార్యక్రమం సక్రమంగా జరిగేటట్టు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి, దాని గౌరవాన్ని కాపాడుకోవాలంటే దాని స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలి. అలా కనిపించాలి కూడా.
– గుమ్మడిదల రంగారావు