విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం జమ్మూకశ్మీర్. నిత్యం వార్తల్లో ఉండే ఈ ప్రాంతంలో పదేండ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో కేంద్రపాలిత ప్రాంతంగా మారిన కశ్మీర్లో జరగనున్న ఈ ఎన్నికలు జమ్మూకశ్మీర్ చరిత్రలోనే ప్రత్యేకమైనవి. ఈ నేపథ్యంలో ‘పీపుల్స్ పల్స్’ బృందం కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు.. ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.
1977లో మొరార్జీదేశాయ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జరిగిన అసెంబ్లీ ఎన్నికలొక్కటే.. 78 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నికలని కశ్మీరీలు అంటుంటారు. అంతకుముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నికలన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేననేది వారి భావన. అక్కడి ప్రజలకు స్థానిక సమస్యల పరిష్కారం పట్ల ఏకాభిప్రాయం లేనప్పటికీ.. లెఫ్టినెంట్ గవర్నర్ పాలన పోయి, తాము ఎన్నుకున్న ప్రభుత్వం రావాలనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉన్నది.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్కడివారితో ముచ్చటించగా.. ‘సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మహా అయితే ఢిల్లీ లాంటి ప్రభుత్వం ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’ అని ఒక వ్యాపారి అభిప్రాయపడ్డారు. ఇలాంటి అభిప్రాయమే చాలాచోట్ల వినపడింది. కేంద్రపాలిత ప్రాంతాలుగా కాకుండా.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఇటు కశ్మీర్, అటు లఢఖ్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
గతంలో బీజేపీకి ఓటేసినవాళ్లు కూడా రాష్ట్ర హోదా-పాలన విషయంలో ఢిల్లీ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న గుజ్జర్ సామాజికవర్గం ఇప్పుడు ఆ పార్టీకి దూరమైంది. స్థానిక బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ఢిల్లీ తరహా ప్రభుత్వం వద్దని చెప్తున్నారు. కశ్మీర్ విషయంలో తమది చారిత్రాత్మక నిర్ణయమని దేశవ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేసుకుంటుండగా..
ఆ నిర్ణయం సరైనదేనని కశ్మీర్ బీజేపీ నాయకులు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు.
కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫల్యాలు ఉంటాయి. కానీ, మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే అది మెరుగ్గానే ఉంటుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పాలనను ఆశించలేం’ అని జమ్మూ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ అన్నారు. ‘ప్రజల అంచనాలకు తగ్గట్టుగా నాయకులు పని చేయకపోతే, వచ్చే ఎన్నికల్లో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అది దృష్టిలో ఉంచుకొనైనా వారు ప్రజల కోసం పనిచేస్తారు. కానీ, ఎల్జీ, బ్యూరోక్రాట్లకు ఆ ప్రమాదం లేదు’ అని శ్రీనగర్‌లో కలిసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి అభిప్రాయపడ్డారు.
రాజకీయ పార్టీల పట్ల కశ్మీరీల దృక్పథం మారిందని ఇటీవలి లోక్‌సభ ఎన్నికలు నిరూపించాయి. కశ్మీర్ ప్రాంతంలో అశాంతికి, తీవ్రవాదానికి, మత కలహాలకు చోటులేదని సార్వత్రిక ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం అన్ని రాజకీయ పార్టీలకు సానుకూల సంకేతాలు పంపించింది.
వేర్పాటువాదాన్ని, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదనే ఆరోపణలపై జమాతె ఇస్లామీ సంస్థను నిషేధించిన ఎన్డీయే ప్రభుత్వమే.. ఆ నిషేధాన్ని ఎత్తివేయడంపై ప్రజల్లో భిన్నమైన సంకేతాలు వెళ్తున్నాయి. సంప్రదాయ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలకు జమాతె ఇస్లామీ ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలను కశ్మీరీలు కొట్టిపారేయడం లేదు.
లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్లో అభ్యర్థిని నిలబెట్టకుండా జమ్మూలో బీజేపీ తన బలాన్ని పరిరక్షించుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలను ఆ పార్టీ ఒక ప్రయోగంగా చూస్తున్నట్టు అనిపిస్తున్నది. ఎలాంటి ఫలితాలు వచ్చినా ఫర్వాలేదన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. మరోవైపు బీజేపీని ఆకాశానికెత్తేందుకు మీడియాలో చూపించే వంతెనలు, అండర్‌పాస్‌లను పక్కనపెడితే.. స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. మొత్తంగా 2019కి ముందే బాగుండేదని స్థానికులంటున్నారు.
జమ్మూ, శ్రీనగర్.. పేరుకే స్మార్ట్ సిటీలని, కనీస మౌలిక వసతులు లేక తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని వ్యాపారులు వాపోతున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని, మద్యం వ్యాపారం చేస్తున్నారని, ముఖ్యమైన పదవుల్లో స్థానికేతర అధికారులే ఉంటున్నారని, దానివల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. ‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటివాళ్లనే ఎందుకు నియమిస్తున్నారు? ఎందుకంత భయం?’ అని అడ్వకేట్ షేక్ షకీల్ ప్రశ్నించారు.
ఉద్యోగావకాశాలు సన్నగిల్లడం, బయటివాళ్లు అక్కడి వ్యాపారాలు, సంస్థలను నియంత్రించడం పట్ల కశ్మీరీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవన్నీ బీజేపీకి నష్టం చేసేవే. ‘మాకు ఉద్యోగాల్లేవు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహుల కింద మాపై నేరం మోపుతున్నారు’ అని కశ్మీరీ యువత అభిప్రాయపడుతున్నది.
అనవసర ఖర్చు అవుతున్నదని చలికాలంలో జమ్మూ, వేసవిలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్‌పెట్టింది. కానీ, దర్బార్ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవని, వారు ఐదారు నెలల పాటు చేసే ఖర్చే తమ ఆదాయమని జమ్మూకు చెందిన వ్యాపారి వికాస్‌శర్మ చెప్పారు. అంతేకాదు, అమర్నాథ్, మాత వైష్ణో దేవి యాత్రికులు గతంలో జమ్మూలో బాస్మతి బియ్యం, రాజ్మా, బాదం, కుంకుమ, దుస్తులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు కత్రాకు రోడ్డు, రైలు మార్గాలు విస్తరించడంతో జమ్మూలో యాత్రికులు ఆగడం లేదు. ఇది కూడా జమ్మూలో ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. ఇలా తమ ప్రాంతంలోని అనేక సమస్యలు పరిష్కారం కావాలని కశ్మీరీలు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో 1990లో చెల్లాచెదురైన కశ్మీరీ పండిట్లకు ఎలాంటి భరోసా కల్పిస్తారు? నిరుద్యోగ సమస్యను ఎలా రూపుమాపుతారు? అభివృద్ధి, సంక్షేమాన్ని ఎలా అందిస్తారు? శాంతిని ఎలా నెలకొల్పుతారు? లాంటి అనేక ప్రశ్నలకు రాజకీయ పార్టీలు, నాయకులు సమాధానం చెప్పాల్సి ఉంది. ఆ సమాధానాల ఆధారంగా ఓటేసి తమ భవితవ్యాన్ని రూపొందించుకోవాలని కశ్మీరీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకుడు, పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ)
– దిలీప్ రెడ్డి
99490 99802