భారతదేశంలో వాహనాలు నడిపే లైసెన్స్ పొందడం చాలా సులభం లేదా చాలా కష్టం. ఈ రెండింటిలో ఏదో ఒకటి నిజం అవుతుందని ఎవరైనా అనుకుంటారు. కానీ రెండూ నిజమే. అవినీతికి ఏ వైపు నుంచి చూస్తున్నారనేదాని మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. ప్రజలు పదోపరకో వదిలించుకుని పనులు కానిచ్చేసుకుందామని భావించే ప్రభుత్వ విభాగాల్లో రోడ్డు రవాణా ప్రాధికార సంస్థ (ఆర్టీఏ) ఒకటి. ఇటీవలి దశాబ్దాల్లో ఈ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వపరంగా చాలా చొరవలే అమలులోకి వచ్చాయి. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో లుకలుకలు చాలావరకు తగ్గిపోయాయి. అయితే ట్రాక్ పరీక్ష మాత్రం ఆర్టీఏ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారానే జరుగుతుంది.
ఇక్కడే ఏజెంట్లకు కొంత వెసులుబాటు లభిస్తుంది. దీన్ని కూడా సంస్కరించడం పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ, ఏ మాత్రం అవకాశం దొరికినా సర్కారు విధులను ప్రైవేటుకు అప్పగించి చేతులు దులిపేసుకోవడం అలవాటుగా చేసుకున్న కేంద్రం మరోలా ఆలోచిస్తున్నది. డ్రైవింగ్ పరీక్షల నిర్వహణను పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు నిబంధనలు కూడా రూపొందించింది. పాత నిబంధనల ప్రకారం ట్రాక్ పరీక్షలు ఆర్టీవో కార్యాలయ ఆవరణలోనే జరుగుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ట్రాక్ పరీక్షల బాధ్యత గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూ ల్స్ ఆధ్వర్యంలో జరుగుతాయి. వారిచ్చే సర్టిఫికెట్ జత చేసి ఆర్టీఏకు దరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ వస్తుంది. 2021లో నోటిఫై చేసిన ఈ వివాదాస్పద నిబంధనలను జూన్ 1వ తేదీ నుంచి అమలుచేయాలని కేంద్రం సంకల్పించింది. సమస్యను ఈ కొత్త ఏర్పాటు పరిష్కరిస్తుం దా లేక మరింత జటిలం చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నియంత్రణ కొరవడి ప్రక్రియ మొత్తం ప్రహసనంలా తయారవుతుంది. జవాబుదారీతనం సందేహంలో పడుతుం ది. ప్రైవేటు ఫీజుల భారం వల్ల ప్రజలకు ఖర్చు తడిసి మోపెడయ్యే అవకాశమూ ఉంది. ఈ మొత్తం వ్యవహారమంతా గందరగోళానికి దారితీసే ప్రమాదం ఎంతైనా ఉన్నది. మరీ ముఖ్యంగా శిక్షకులు, పరీక్షకులు ఒకరే కావడం వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది.
కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ స్కూల్స్ పెట్టాలంటే ఎకరం జాగా కార్యాలయానికి, రెండెకరాలు శిక్షణకు అవసరం అవుతుంది. ఇది ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వంటి మహా నగరంలో అంతంత భూమి సేకరించడం సాధ్యమేనా? ఒకవేళ డబ్బున్నవారు పెట్టుబడులు పెట్టగలిగినా చిన్నచిన్న సంస్థలు మూసుకోవాల్సి రావచ్చు. దీనివల్ల వేలాది మంది రోడ్డున పడతారు. అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే గుర్తింపు ఉంటుందని, సిబ్బంది తనిఖీలూ ఉంటాయని అధికారులు అంటున్నారు. ప్రైవేటును ప్రోత్సహించడానికి కేంద్ర రవాణా శాఖ ఆర్థిక సహాయ పథకం కూడా ప్రవేశపెట్టినప్పటికీ తీసుకునేవారు కరువయ్యారు. ఈ సమస్యల నేపథ్యంలో జవాబుదారీతనం, ఫీజుల నియంత్రణ, భద్రత అనే మూడు ఆందోళనలు ప్రముఖంగా ముందుకు వస్తున్నాయి. అందువల్ల వివాదాస్పద నిబంధనలు హడావుడిగా అమలు చేయడం కన్నా వాటిపై లోతైన అధ్యయనం జరపడం ముఖ్యమని చెప్పక తప్పదు.