నా 16 ఏండ్ల ఉపాధ్యాయ వృత్తి జీవితంలో తమ పిల్లలను పిల్లల్లాగా అంగీకరించిన తల్లిదండ్రులను చాలా అరుదుగా చూశాను. విద్యా సంస్థల నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ పిల్లలు చెక్కిన శిల్పంలాగా ఉండాలని ప్రతిఒక్కరూ తాపత్రయ పడుతుంటారు. పిల్లల పట్ల వారు అభద్రతా భావంతో ఉంటారు. మన గుర్తింపుల కోసం పాకులాడే క్రమంలో ప్రత్యేకమైన వ్యక్తులకు మనం జన్మనిచ్చామనే విషయాన్ని మర్చిపోతుంటాం.
చిన్నారుల మోముల్లోని అమాయకత్వాన్ని చంపి, వారిని ఒత్తిడి కుండలుగా (ప్రెజర్ పాట్) మార్చి మనం నేరస్థులుగా మారుతున్నాం. మనకు జీవితఖైదు విధించినా.. వారి పాలబుగ్గల్లాంటి ముఖాల్లో పువ్వులాంటి తాజాదనాన్ని మళ్లీ తీసుకురాలేం. తమ పిల్లల భవిష్యత్తు గురించి ప్రతిఒక్కరూ ఆందోళన చెందడం సహజమే. పిల్లల భవిష్యత్తు పట్ల ఆందోళన పేరిట మనం వారిపై వయసుకు మించిన భారాన్ని వేస్తున్నాం. అయితే మంచి మార్కులే మంచి జీవితాన్ని ఇస్తుందని మనం భావిస్తుంటాం. కానీ, వారికి మంచి అవకాశాలు, భవిష్యత్తును ఆత్మవిశ్వాసమే ఇస్తుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం కంటే వారి భద్రతే ముఖ్యం కదా.
పరీక్షల్లో మంచి మార్కులు సాధించే పిల్లలతో తమ పిల్లల్ని పోల్చే తల్లిదండ్రులను తరచూ చూస్తునే ఉంటాం. వారిపై సిలబస్‌ను రుద్దే ప్రయత్నంలో వారిలో ఉండే సృజనాత్మకతను దూరం చేస్తున్నాం. విద్య అనేది చిన్నారులకు అందించే నీరు లాంటిది. మనం దానిలో వేలు పెడితే అది చెడిపోతుంది. పోటీ మంచిది కాదని నేను చెప్పడం లేదు. ఇతరులతో పోటీ చేయవద్దని అసలే చెప్పను. కానీ, పిల్లల వయసుకు మించి భారాన్ని మాత్రం వారిపై వేయవద్దు. వయసుకు మించిన భారాన్ని మోయాలని మాత్రం వారిని ప్రేరేపించకండి. మీరూ ఆశించకండి.
తరగతి గదులను పిల్లలకు గుర్తింపునిచ్చే మచ్చలేని పూల తోటలుగానే ఉండనివ్వండి. పాస్ లేదా ఫెయిల్ అనే అంశాలను చిన్నారుల మెదళ్లలోకి ఎక్కించకండి. బాల్యం అనేది ప్రెజర్‌కుక్కర్‌లో ఉడికే గింజలా కాకుండా వేడుకలా ఉండనివ్వండి. ‘చిన్నారులకు ఆహ్లాదకరమైన, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాం’ అని మనందరం ఈ కొత్త సంవత్సరంలో ప్రతిజ్ఞ చేద్దాం.
– ఎం. విజయ ప్రభాకర్