రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే భారీగా క్షీణించడం ఆర్థిక వ్యవస్థపై విస్తృతమైన ప్రభావాన్ని చూపుతున్నది. 2025, జనవరి 13న రూపాయి విలువ 86.62గా నమోదు కావడం రెండేండ్ల అత్యల్ప స్థాయిని సూచిస్తున్నది. ఈ పరిస్థితి రూపాయి బలహీనతను, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులను ప్రతిబింబిస్తున్నది.
అమెరికా ఆర్థిక వ్యూహాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావంతో డాలర్ బలపడింది. డాలర్ ఇండెక్స్ 110 స్థాయిని దాటింది. అమెరికా ఎన్నికల అనంతరం డాలర్ డిమాండ్ పెరగడం రూపాయి పతనానికి కారణమైంది. ముడి చమురు ధరల పెరుగుదల మరో కారణంగా చూడవచ్చు. బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు చేరడం రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది. ఫలితంగా భారత్ వంటి చమురు దిగుమతిదారులపై అధిక భారం పడుతున్నది. భారత మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంట్ పెరగడంతో విదేశీ పెట్టుబడులు తగ్గడం కూడా రూపాయి పతనానికి మరో కారణం అనుకోవచ్చు.
రూపాయి పతనంతో సామాన్య ప్రజలపై భారం పడుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. దిగుమతులతో సంబంధమున్న వస్తువుల ధరలు అధికమవుతాయి. విదేశీ విద్య భారంగా మారుతుంది. ఎగుమతులపై రూపాయి పతనం ప్రభావం చూపుతుంది. ఎగుమతులకు కొంతకాలం మద్దతు అందించినా, దీర్ఘకాలంలో దిగుమతుల వ్యయాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవడం అవసరం. రూపాయి పతనం ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయి. పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. చమురు ఆధారిత పరిశ్రమలు, దిగుమతి వ్యాపార సంస్థలు నష్టాల బారినపడే అవకాశం ఉంటుంది.
రూపాయి విలువ స్థిరీకరణ కోసం ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవాలి. వడ్డీ రేట్లను సర్దుబాటు చేయడం ద్వారా ద్రవ్యోల్బణ నియంత్రణ చేపట్టాలి. భారతీయ ఉత్పత్తుల పోటీదనాన్ని పెంచేందుకు విధానాలు అమలు చేయడం, కొత్త అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించడం, ఎగుమతులకు ప్రోత్సాహం అందించడం వంటి చర్యలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. అవసరమైన వస్తువుల స్థానిక ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను తగ్గించడం, స్వదేశీ చమురు, గ్యాస్ వనరుల శోధన, వాడకం పెంపు వంటి చర్యలు చేపట్టడం వలన రూపాయి పతనాన్ని నిలువరించవచ్చు . మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో స్వదేశీ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పతనాన్ని అడ్డుకోవచ్చు.
రూపాయి పతనం భారత ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ, సమర్థమైన వ్యూహాలను అమలు చేయడం ద్వారా దీన్ని అదుపులోకి తేవడం సాధ్యమే. సత్వర చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపాయి విలువను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. భారత ప్రభుత్వం, ఆర్బీఐ కలసి సమన్వయంతో చర్యలు తీసుకుంటే, రూపాయి పతనాన్ని ఆపొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు.
(వ్యాసకర్త: ‘ఫిన్ నౌ’ ఫౌండర్)
– శ్రీనివాస్ గౌడ్ ముద్దం 80088 88834