తొలి వేకువ తలుపులు తెరుచుకోకముందే
వేప పూతలా రాలిపోతున్నారు
భూమిలో చినుకులా ఇంకిపోయి
విత్తనమై సాళ్లువారుతున్నారు
లౌక్యం తెలియక
రాజకీయ మోసాల జిహ్వలకు
బలైపౌతున్నారు
అంగరంగవైభవంగా
పెళ్లి కొడుకు బరాత్లా
రైతు డిక్లరేషన్లు ప్రకటిస్తారు
ధరలు ముడుచుకొన్నాక
ధాన్యానికి దిక్కులేని దారిద్య్రాలు
పాలకుల విధానాలకు ప్రమోషన్లు
రాళ్లుగా పుట్టుంటే
దేవుడుగా పూజింపబడుదురేమో
నాగళ్లుగా పుట్టి
నిషాన్ లేక పుచ్చిపోతున్నారు
అలలకు
సముద్రం చేతులెత్తేసే దౌర్భాగ్యపు చరిత్ర
అన్ని రుతువులకు మోసపోతున్నారు
అన్ని పంటలకు వంచించబడుతున్నారు
దేశంకోసం నిలబడి
దేహన్ని విడిచి తప్పుకుంటున్నారు
మైకుల ముందు కన్నీళ్లను కార్చటమే గానీ
సమగ్ర శాశ్వతాలకు ప్రాతిపాదికేది?
దేవాలయాలలోని దైవాలు కాదు
నల్లరేగడి భూములలో
పంటకంకులే
నడిపించే దేవుళ్లు
చెరువులో
చంద్రుడి ప్రతిబింబంలా కర్షకుడు
అన్ని దానాల్లో
అన్న దానం మిన్నన్నారు
అన్నాన్ని సృష్టించిన అన్నదాతలు
అన్యాయంగా ఒరిగిపోతున్నారు
శ్రమస్వేదం మట్టిలో
కలిసిపోతున్నది
అనంత సంగ్రామం చేసి
వెన్నెలను తెచ్చుకోవటం
చీకట్లో మగ్గిపోవటానికేనా?
అసమాన త్యాగాలు
కండ్లముందే శ్రామిక
ఫలాలు వట్టిపోతున్నాయి
వరంగల్ డిక్లరేషన్లు
మరో ద్రోహపు చరిత్ర
– వనపట్ల సుబ్బయ్య
94927 65358