‘పొలాలకు పోతూ, వస్తూ ఎదురుపడ్డోళ్లమంతా ఎదల దుఃఖం పంచుకుంటున్నాం’ అని ఇటీవల గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలుకరిస్తే, జంగిలప్ప అనే రైతు నాతో ఆవేదనను పంచుకున్నాడు. ‘రైతుకు ఏమియ్యకున్నా పురస్తేగాని, కనీసంగా పట్టింపు కూడా లేదని అర్థమైనాక అనాథలతీరైతిమని, రెక్కల కష్టం తప్ప మరేపనీ ఎరుగని రైతు లోలోపల తల్లడిల్లిపోతడన్న’ అంటూ ఇంజన్న అనే పేద రైతు జతకూడి చెప్తుంటే అక్కడున్న మా అందరిలో ఆవేదన కలిగింది. ఇప్పుడు ఏ ఊర్లో, ఏ రైతును పలుకరించినా ఆ రైతుల్లానే వేదనను వెళ్లగక్కుతున్నారు. వదిలించుకున్న వేదనను మళ్లీ తగిలించుకొని విలవిల్లాడిపోతున్నారు.
తెగులంటుకున్న తెలంగాణల గ్రామాలన్నీ దిగులంటుకొని దినదిన గండంలా గడుపుతున్నాయి. ఏ పీడదినాలైతే మళ్లీ కలలో కూడా రాకూడదని పోరాడారో అవే కల్లంలోకి, అందరి పల్లెంలోకి వచ్చి పడ్డాయి. రెండున్నరేండ్లుగా రేవంత్ సర్కార్ రీతిలేని పనితీరు వల్ల, రాష్ట్ర పునాది రంగంలో పస్తుల విధానం పునరావృతమయ్యింది. దశాబ్దాల పోరాటం, తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి విప్లవ ఫలాలు బాల నాగమ్మ కథ సినిమాలో మాయలఫకీరు నాగమ్మను మాయం చేసినట్లు అయిపోయాయి. నిజానికి దశాబ్దాల విధ్వంస, వివక్షా విధానాల బారినపడి అప్పులు తప్ప ఏవీ పండవని ఆశలు చాలించుకున్న సాగు రంగాన్ని సస్యశ్యామలం చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం పడరాని పాట్లెన్నో పడింది.
రాష్ట్ర ఏర్పాటుకు మునుపు వ్యవసాయం దండగ లాంటి అనేక మాటలు పాలకుల నోటి వెంటే వినీవినీ, నీళ్లు లేక, కరెంట్ రాక రాత్రీపగలూ సేను సెలకల కోసం చకోరపక్షుల్లా బతికిన రైతులు వ్యవసాయంపై విశ్వాసం వదిలేశారు. ఆశ, ఆత్మవిశ్వాసం ఆవిరైన అన్నదాతలు అప్పులు, ఆత్మహత్యలు భరించలేక సేద్యానికి సెలవని వలసల జీవితం ఎంచుకున్నారు. అలాంటి అభద్రతాభావంలో తలమునకలై ఉన్న రైతు లోకంలో విశ్వాసం వికసింపజేయటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వశక్తులు వొడ్డింది.
బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ చారిత్రక నేపథ్యం, భౌగోళిక స్థితిగతులు, సామాజిక అవసరాలపైనే ఆర్థిక నమూనాను రూపొందించుకొని అమలుపరిచింది. పునాదిలో ఆరోగ్యకర స్థితిని స్థిరపరచకుండా, ఉపరితలంలో ఏ ఆర్థిక నమూనాతో ఊరేగినా వొరిగేదేమీ ఉండదనే దృష్టికోణం కలిగిన సర్కార్ కాబట్టే రైతు సంక్షేమ పథకాలను అత్యంత ప్రాధాన్యంగా ఆచరించింది.
సాగునీరు, విద్యుత్తు, విత్తన పంపిణీ, పంటల కొనుగోలు ఇలా అన్నింటా ప్రతి ఏటా ఏమరుపాటుతో నడుచుకున్నది. అయితే ఏడు దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమ పథకాల పేరిట అనుసరించిన మూస, మోస విధానాల వొరవడికి స్వస్తిపలికి వ్యవసాయరంగ శాశ్వత స్థిరీకరణకు లోతైన, మానవీయ నమూనాను కేసీఆర్ సర్కార్ సాగు రంగంలో అమలు చేసింది.
గుండెల నిండా తెలంగాణ తప్ప మరే ధ్యాస లేని గుణమున్న సర్కార్ కాబట్టే చెరువుల నుంచి నదుల వరకు ఏ నీటిబొట్టునూ వదలకుండా వొడిసిపట్టి, వ్యవసాయానికి అనుసంధానించింది కేసీఆర్ ప్రభుత్వం. గోదావరి నుంచి కృష్ణా, తుంగభద్ర వరకు ఏ నది నీటినీ నిరుపయోగంగా కిందకు వదలకుండా కాళేశ్వరం మొదలు తుమ్మిళ్ల దాకా ఏయే ప్రాజెక్టులు, ఎన్నెన్నో ఇక్కట్లను దాటి, వ్యయప్రయాసాలకు వోర్చి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందో మన కండ్లకు కనిపిస్తున్నాయి. ఎనిమిదేండ్లలో లక్షా 76 వేల కోట్లను ఒక్క సాగునీటి రంగం మీదనే ఖర్చు చేసి కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందించిన సర్కార్ ఈ దేశంలో ఏదైనా ఉన్నదా? లక్షా 37 వేల కోట్లు ఖర్చు చేసి 7 వేల మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచటమే కాదు, 6 లక్షల 87 వేల 500 కోట్ల ఆస్తులను విద్యుత్తు రంగంలో సృష్టించింది బీఆర్ఎస్ సర్కార్.
కల్లాల్లోనే రైతుల సంపద వడగండ్ల వానకు ఆగమైపోరాదనే దృఢసంకల్పంతో 4 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 24.73 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యానికి నూతన గిడ్డంగులు నిర్మించటమే కాదు, లక్షా 35 వేల కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఆసరాగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుబంధు, బీమా ఇలా ఎన్నో మానవీయ పథకాల అమలేకాదు, అడుగడుగునా రైతులకు అన్నీ తానై వెంట నిలిచింది.
రేవంత్ సర్కార్ వచ్చిందే తడవుగా రాచి రంపా న పెట్టటానికి అన్నట్లు రైతుబంధుకు గండికొట్టి, నీటి ఇక్కట్లు, కరెంట్ కష్టాలకు తెరలేపింది. చివరికి పండించిన పంటనూ కొనకుండా రైతుల ఉసు రు పోసుకుంటున్నది. రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రె స్ ఇచ్చిన గ్యారెంటీలను గుర్తుచేసుకుంటే సీఎంతో ఏ బేతాళ మాంత్రికుడు కూడా తూగలేడు. ప్రతి మండలంలో అధునాతన మార్కెట్ యార్డ్ నిర్మాణంతో పాటు అనేక హామీలిచ్చి ఆదర్శ రైతు రాజ్యం తెస్తామని పాలకులు గొప్పలు చెప్పారు. కానీ రెండున్నరేండ్లలో పట్టించుకునే నాథుడే కరువై అనాథనైపోయాననే వేదనకు రైతు లోకాన్ని గురిచేశారు. రైతు భరోసా
ఎగ్గొట్టినా అసమర్థుడని తిట్టి వదిలేశారు. కానీ చివరికి రెక్కల కష్టాన్ని కూడా కొనకుండా వెక్కిరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరును మాత్రం రైతాంగం జీర్ణించుకోలేకపోతున్నది. కండ్లెదుటే కల్లాలన్నీ అల్లకల్లోలంగా మారిపోతున్నాయి.
ఇప్పుడు ఏ ఊరి రైతును కదిలించినా కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. గ్యారెంటీలు ఎగ్గొట్టిందే కాకుండా, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినవన్నీ కూడా రేవంత్ సర్కార్ నిలిపేసింది. పైగా, వ్యవసాయ రంగంలో విధ్వంసక పాలనా నమూనాను అమలుపరుస్తున్నది. ఇలా ఒకవైపు రైతాంగాన్ని హింసిస్తూ, మరోవైపు ఈనెల 4 నుంచి రైతు వారోత్సవాల పేరిట అసత్యాల డంభాచారానికి ఒడిగట్టిన సర్కార్ గాయం మీద యాసిడ్ పోసినట్లుగా రైతులను ఎగతాళి చేస్తున్నది. అందుకే పొలాలకు పోయే తొవ్వల్లో ఏ ఇద్దరు రైతులు ఎదురుపడ్డా దిగులు పంచుకుంటున్నారు. మన సేద్యం కోసం సంగ్రామం తప్ప మరో మార్గం లేనేలేదు. దానికోసమే నేడు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సుతో శంఖారావం పూరిస్తున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్