Congress | కేంద్రంలో అధికారంలోకి రావడమే పరమావధిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన గతాన్ని పూర్తిగా మరిచిపోయింది. అంతేకాకుండా, పరిపక్వత కలిగిన లీడర్లు లేని పార్టీగా చరిత్రలో నిలిచిపోయే దిశగా పయనిస్తున్నది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీల హయాంలో భారత్ అద్భుతమైన ప్రగతిని సాధించింది. నెహ్రూ శాస్త్ర సాంకేతిక రంగాలకు ఇతోధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇస్రో, బీహెచ్ఈఎల్, డీఆర్డీఎల్ లాంటి సంస్థలను నెలకొల్పారు. భాక్రానంగల్, నాగార్జునసాగర్ తదితర భారీ సాగునీటి ప్రాజక్టులకు ఆయన రూపకల్పన చేశారు.
ఇందిరాగాంధీ హయాంలో గ్రీన్ రెవల్యూషన్ ఊపందుకున్నది. రాజీవ్‌గాంధీ కాలంలో టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ వృద్ధిచెందింది. పీవీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకున్నది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు దేశాభివృద్ధిని గాలికి వదిలివేసింది. ప్రజలకు ఉచితాలను ఎరగా వేస్తూ అధికారంలోకి రావడానికి అవస్థలు పడుతుండటం శోచనీయం.
ఇప్పుడు మల్లికార్జున ఖర్గే మాత్రమే ఆ పార్టీకి ఏకైక రాజకీయ నాయకుడు, సలహాదారుడు. దేశం గురించి, దేశ ఆర్థికవ్యవస్థ గురించి పట్టించుకోకుండా ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు.
గద్దెనెక్కడమే లక్ష్యంగా కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇచ్చిన గ్యారెంటీలకే దిక్కు లేదు. వాటిని అమలుచేయలేక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవస్థలు పడుతున్నాయి. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ర్టాల ఆర్థిక స్థితిగతులపై అవగాహన లేకుండా హామీలు ఇవ్వకూడదని హితవు పలికారు. అయినా ఆ పార్టీ నాయకత్వానికి బుద్ధి రావడం లేదు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆ పార్టీ హామీల వర్షం కురిపించింది. మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే ఏటా ఆరు గ్యాస్ సిలిండర్లు, రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, ఏటా రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వంద యూనిట్ల వరకు ఉచిత కరెంట్.. ఇలా ఎన్నో హామీలను కాంగ్రెస్ గుప్పించింది. తెలంగాణలో ఏ ఒక్క హామీ అమలుకాలేదు.
ఉచితాలు, సబ్సిడీల పేరుతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఇలాంటి తాయిలాలు కాకుండా ఆర్థిక వనరులను పెంపొందించే శాశ్వత పరిశ్రమలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్డు రవాణా సౌకర్యాలు, అడవుల విస్తరణ, దవాఖానలు, విద్యాలయాలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రా లు, వ్యవసాయ అనుబంధ రంగాలు, టూరిజం, సమాచార సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలూ అవే కోరుకుంటున్నారు. భవిష్యత్తు తరాలకు కావాల్సిన అవసరాలను తీర్చాలి. వాటిని సమకూర్చే నాయకులు ఇప్పుడు దేశానికి కావాలి.
ప్రస్తుతం దేశం గురించి ఆలోచించే నాయకులు ఎవరూ కాంగ్రెస్ పార్టీలో మచ్చుకైనా కనపడటం లేదు. ఆ పార్టీ నాయకులకు దేశ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర అవగాహన లేదు. హస్తం పార్టీ మళ్లీ బలపడాలంటే దూరదృష్టి కలిగిన నాయకుడు కావాలి. దేశాన్ని ముందుకు నడిపించే ధీశాలి కావాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తయ్యే నాటికి మనం ఇంకా ఏం సాధించాలి? అని ఆలోచించే నేతలు ఆ పార్టీకి కావాలి. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీ అయి నా ఇలా గొప్ప ఆలోచనలతో ముందుకు వచ్చినపుడే ప్రజలు ఆదరిస్తారు.
– కన్నోజు మనోహరాచారి 79950 89083