నేడు, డిసెంబర్ 9, తెలంగాణకు అమృతం కురిసిన రోజు! నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ పదకొండు రోజుల ఆమరణ దీక్షాఫలంగా నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు ఈ డిసెంబర్ 9. ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర ఆకాంక్షకు, లెక్కకు మిక్కిలి తెలంగాణ బిడ్డల త్యాగాలకు న్యాయం దక్కిందని మనమంతా సంబురపడ్డ రోజు! అయితే, ఈ ‘సోనియా పుట్టిన రోజువరం’ శాపంగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. సీమాంధ్ర లాబీకి తలొగ్గిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9 ‘తెలంగాణ ఏర్పాటు ప్రకటన’ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిందీ ఈ డిసెంబర్ నెలలోనే!
2006లో అంతకుముందు, తెలంగాణ సాధన కోసం పదవులను తృణప్రాయంగా వదిలిన కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టిన కరీంనగర్ ప్రజలు 2 లక్షల చారిత్రాత్మక మెజారిటీ ఇచ్చి ఉద్యమానికి చిరస్మరణీయ శక్తినిచ్చింది కూడా డిసెంబర్ మాసమే! బీఆర్ఎస్ పార్టీ డిసెంబర్ 9ని ‘విజయ్ దివస్’గా జరుపుకోవడం ఎంత సందర్భోచితమో; కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ ఈ డిసెంబర్ 9 ‘విద్రోహ దినం’ అనడం సరైనది! ఈ మకిలికి మేలిమి మకిలి పూత ఏమంటే -రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలన ‘దినం’ కూడా ఈ డిసెంబర్ 9 కావడమే.
రెండేండ్ల కింద జరిగిన ఎన్నికల్లో అందమైన అబద్ధాలు, అరచేతి వైకుంఠ దర్శనాల ద్వారా జనాన్ని మాయచేసి అధికారంలోకి రేవంత్‌రెడ్డి వచ్చిన్రు! ప్రమాణ స్వీకారానికి ముందే ‘రేపు సోనియమ్మ బర్త్ డే గిఫ్ట్‌గా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న, బ్యాంకులకు పోయి తెచ్చుకోండి’ అన్నరు రేవంత్ రెడ్డి. అక్కడితో మొదలైన మోసం, దగా, విద్రోహం ఈ రెండేండ్ల పాటు నిరాఘాటంగా సాగుతున్నది. మరో మూడేండ్లు సాగనున్నది.
‘మౌలిక సదుపాయాల కోసం రూ.500 కోట్లు కూడా కేటాయించలేను నేను. మీ జీతాలు కూడా ఇవ్వలేకున్న. నా సీటు మీకు ఇస్తా, మీరే పాలించండి. ఎక్కడా అప్పు పుట్టడం లేదు, చెప్పులు ఎత్తుకుపోయే దొంగను చూసినట్టు చూస్తున్నరు’ అని సీఎం హోదాలో ఉద్యోగుల సభలో అన్నరు రేవంత్ రెడ్డి. మరి ఇపుడు ‘ప్రజా పాలన’ విజయోత్సవాలు జరుపుకోవడానికి అద్దం ముందు నిలబడినప్పుడన్నా ఏం అనిపించలేదా సీఎం సారుకు? పోనీ, తన సమక్షంలోనే మొన్న బహిరంగ సభలో ‘గ్రామాల్లో మేము తలెత్తుకుని తిరగలేకపోతున్నం’ అంటూ వాపోయిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాటలకైనా తప్పు తెలుసుకున్నరా కాసేపటికైనా, రేవంత్‌రెడ్డి? లేదు సరికదా, అదే వెటకారపు నవ్వు, అదే వెకిలి దిలాసా!
సమైక్య పాలన, తెలంగాణ స్వయంపాలన, ఇప్పటి రేవంత్ పాలనాలేమి- ఇవన్నీ ఊళ్లల్లో రచ్చకట్టల దగ్గర చర్చకు వస్తున్నై. ‘సారు మళ్లా రావాలె’ అంటున్నరు. ఆర్థిక ఇబ్బందులు, పడిపోయిన జీవన ప్రమాణాలు, అడుగంటిన భవిష్యత్ ఆశలు పేదలకు నిత్యానుభవంగా ఉన్నది. అందునా, మహిళలకు మరింతగా ఆ బాధ తెలుసు. ఇంటి కష్టాలు ఇల్లాలి కంటే ఎవరు ఎరుగుదురు? కాబట్టే, బూతుల రూపంలో ప్రజాగ్రహం వాట్సాప్‌లలో మీదాకా వస్తున్నది. వీటి ముందు రేవంత్ విన్యాసాలు నిలవవు, పాచికలు పారవు!
కాబట్టే, మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చేసినట్టే, ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతున్నది, తమ ప్రత్యర్థి అభ్యర్థులను బెదిరించి నామినేషన్ ఉపసంహరింపజేయడం; నయానో భయానో లొంగదీసుకోవడం; తమవి కాని ‘ఏకగ్రీవాలను’ నిస్సిగ్గుగా ఖాతాలో వేసుకోవడం రాష్ట్రమంతా నడుస్తున్నది. ఈ వ్యాసకర్త సొంత మండలంలో కాంగ్రెస్ దాష్టీకాలు అనుభవంలోకి వచ్చిన కారణంగా, హేతువుతో రాస్తున్న విషయాలివి. మొన్న సర్పంచ్‌లతో కేసీఆర్ సమావేశాన్ని కూడా సహించలేనంత అసహనంలో ఉన్నరు రేవంత్ రెడ్డి. ధూల్‌పేట గుడుంబాగాళ్లను, పసిపిల్లలను చంపిన ఖైదీలను కలవడాన్ని కూడా గొప్పగా చెప్పుకొనే వారి దుర్బలత అది!
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వ దొంగాటలు, ద్వంద్వ వైఖరులతో రోసిపోయి, బలవన్మరణానికి గురైన శ్రీకాంతాచారి త్యాగం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎలాంటి మార్పూ తీసుకురాలేకపోయింది. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ అదే మోసం, అదే దొంగాట. ఫలితం; సాయి ఈశ్వర్‌చారి బలవన్మరణం. తెలంగాణ బిడ్డలు మట్టిలో కలిసిపోతూ ఉంటే, తెలంగాణ ద్రోహులు రాజ్యమేలడం; పైగా నికార్సయిన తెలంగాణ సేనాని కేసీఆర్‌పై దివారాత్రంగా ‘వల్గర్ టు ది కోర్’ మనస్తత్వంతో నీచపు విమర్శలు చేస్తూ పోవడం ఎంత అన్యాయం!
రెండేండ్ల రెంటికీ చెడ్డ రేవడు చేస్తున్నవి రెండే రెండు! పలు రూపాల్లో ప్రజాధనం కొల్లగొట్టడం; డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడటం! ప్రజా సమస్యలు చర్చలోకి వచ్చే ప్రతి సందర్భంలోనూ అధికార పార్టీ పనికిమాలిన అంశాలను తెరమీదకు తెస్తున్నది. ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో పదేండ్లు ప్రశాంతంగానే గడిచింది. ప్రభుత్వం మారగానే ఎందుకు ఇప్పుడు విగ్రహాల పేరుతో, దిష్టిపేరుతో తెలంగాణవారితో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నరు? జూబ్లీహిల్స్ ఫలితం వాళ్లకు ఏ ధైర్యాన్నిచ్చింది? వాళ్ల తదుపరి లక్ష్యం, వ్యూహాలు, ఎత్తుగడలు ఏమిటి? పన్నెండేండ్ల కాలం గడిచిన తర్వాతైనా తెలంగాణ ఉనికి పూర్తి సురక్షితం అయినట్టేనా?’ అంటూ ఫేస్బుక్ వేదికగా వాపోయిండు ఉదయ భాస్కర్ కేశవదాసు అనే మిత్రుడు!
పోలీస్ స్టేషన్లలో, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో సెటిల్మెంట్లు నిరాఘాటంగా జరుగుతున్నై. మంత్రుల ఓఎస్డీల ‘గన్ పాయింట్’ దందాలు మనం చూసినవే. ప్రజా భవన్లో, సచివాలయంలో ‘రేట్ చార్టులు’ వెలిసినై. ‘ప్రజాపాలన’ అని అధికారంలోకి వచ్చిన పార్టీ కార్యాలయం ముందు ఇనుపకంచెలు వచ్చినయి; ఓడిపోయిన పార్టీ కార్యాలయానికి జనాలు వెతుక్కొని వెళ్లి తమ బాధలు చెప్పుకొంటున్నరు. తెలంగాణ భవన్ ‘జనతా గ్యారేజీ’గా మారిపోయింది. ఇది మరింత కలవరం రేవంత్ రెడ్డికి. కాబట్టే, కారు కూతలు కూస్తున్నరు, అనవరతంగా!
అయితే… కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు. ‘కాలమే సమాధానం చెపుతుంది’ అంటారు కదా! ఆ సమాధానం మామూలుగా ఉండదు, రాబోయే రోజుల్లో. నీళ్లు, నిధులే కాదు మన కలలనూ దోచుకుపోతున్న తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి పట్లా; ఆయనను కుడి-ఎడమలుగా కాపాడుతున్న ఇరు జాతీయ పార్టీలూ, ఇరుకు మేధావుల పట్లా అప్రమత్తత అవసరం. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాలని మనవి. తెలంగాణను కాపాడుకునే పనిలో పడుదాం. చారిత్రక విజయ, విద్రోహాల సాక్షి అయిన డిసెంబర్ మనలో ఆ స్ఫూర్తి రగిలించాలి. అన్నిటికీ ఆ కేసీఆర్ ఉన్నరు!!
ముగించే ముందు ఒక విషయం చెప్తా! ‘డిసెంబర్ పూలు’ తెలుసు కదా! అకంథేసి కుటుంబానికి చెందిన మొక్కకు పూచే వీటిని గొబ్బిపూలు, పెద్దగోరింట అని కూడా అంటారు. రక్త శుద్ధీకరణకు పనికొస్తాయి. ఆకు రసాన్ని కాలిన గాయాలకు, వాపు తగ్గడానికి రాస్తారు. దీని గింజలను పాము కాటుకు విరుగుడుగా వాడతారు. అర్థం అయింది కదా, డిసెంబర్ స్ఫూర్తి!! జై తెలంగాణ!
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల 90309 97371