యాదగిరిగుట్ట పాలక మండలిలో గుట్ట మొఖం కూడా తెల్వని కొందరు ఆంధ్రోళ్లకు కాంగ్రెస్ సర్కార్ పదవులను కట్టబెట్టింది. ఆ పదవులు కావాలని వాళ్లు కూడా అడగలేదు. ఈ లిస్టు చూసిన కొందరు తెలంగాణ వాదులకు చిర్రెత్తుకొచ్చి ఇసంత రమ్మంటే ఇళ్లంతా మాదే అనే రకాలు వాళ్లు. మన గుట్టలో వాళ్ల పెత్తనం ఏంది? అంటూ ప్రశ్నించుడు మొదలు పెట్టిన్రు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రతి అడుగు పైలంగా వేయాలి. టీటీడీ బోర్డులో మనకేమీ ముందు నుండి స్థానం లేదు, అక్కడి ఆదాయంలో మన వాటా కూడా ఎక్కువే కాబట్టి కొట్లాడి కోటా పెట్టించుకున్నం. టీటీడీ పాలక మండలిలో పేరుకే తెలంగాణ కోటా డైరెక్టర్లు, అదీ ప్రత్యేక దర్శనం టికెట్లకే సంబురపడే నాయకులు. నిధుల గురించి అడిగేటోళ్లు తక్కువే.. తెచ్చింది తక్కువే! అలాంటి డైరెక్టర్ పదవులను చూసి యాదగిరిగుట్ట బోర్డులోకి వాళ్లని స్వాగతిస్తుంటే నవ్వురాదా మరి! తెలంగాణ ఖ్యాతి ఉట్టిపడేలా తొలి సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దితే, ఇప్పుడు ఆ బోర్డులో కూడా పక్క రాష్ట్రం వాళ్లను కూర్చోబెడుతుంటే స్వాగతిద్దామా? స్వాభిమానంతో అడ్డుకుందామా?.. ఆలోచించాల్సిందే.

ప్రభుత్వ గురుకులాలల్లా బట్టలు పెట్టుకోవడానికి ఇచ్చే కోట్ల విలువైన ట్రంక్ పెట్టెల టెండర్‌ను ఈ ఏడాది ప్రముఖ డ్రగ్ పెడ్లర్ కంపెనీకి అప్పజెప్పిండ్రట! పిల్లలకు మంచి భవిష్యత్తు ఇయ్యాల్సింది పోయి, గిట్లాంటి మత్తు దందాలు చేసేటోళ్లకు టెండర్లు ఇచ్చుడంటే పాముకు పాలు పోసి పెంచినట్లే ఉన్నది యవ్వారం. నిన్నటికి నిన్న హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏఐతో నడిపిస్తామంటూ అనలాగ్ అనే కంపెనీ సీఈవో అలెక్స్ కిప్మాన్ అనే పెద్దమనిషితో ఎంవోయూ కుదుర్చుకున్నది. అసలు గీ కిప్మాన్ ఎవరయ్యా అంటే మహిళా ఉద్యోగులను తీవ్రంగా వేధించాడని, సతాయించాడనే కోపంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ మెడపట్టి బయటకు నూకేసిన మనిషి! అంతర్జాతీయంగా పరువు పోయినోడిని పట్టుకొచ్చి, ఇప్పుడు మన హైదరాబాద్‌లో సర్కార్ కాంట్రాక్ట్ అప్పగించిన్రు. ఊరు ఇడిసినోడికి ఊరేగింపు జేసినట్టు స్థానికంగా ఉండే మనోళ్లను పక్కన పెట్టి.. ఇట్లాంటి డ్రగ్ పెడ్లర్లను, కంపెనీలు గెంటేసినోళ్లను తెచ్చి కోట్లు కుమ్మరించడం వెనుకున్న మర్మమేందో సామాన్యుడికి కూడా సమజైతది కదా. అందుకే జనం అడుగుతున్నరు.. గివేం సోపతులు రేవంత్ అని

‘కూసుండి తింటే కొండలైనా కరుగుతాయ్’ అని పెద్దలు అన్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు ‘కూసుండి తింటే కొండలు కరుగుతాయ్, భూములు అమ్మితే పైసలు దొరుకుతాయ్’ అనే తీరుగా కథ నడిపిస్తున్నారు. పన్నుల రూపంలో సర్కార్‌కు ఆదాయం పెంచాలె, ఆ పైసలతోని అభివృద్ధి, సంక్షేమం కోసం పథకాలు నడిపించాలె. కానీ, ఇప్పుడు పాలకుల తరీఖ మొత్తం ఇచ్ఛంత్రంగనే కొడుతున్నది. ఎప్పుడు ఏ భూములు కుదవెడుదాం, ఏ భూములు అర్రాస్ పాడుదాం, ఎక్కడ బాండ్ల రూపంలో అప్పులు తేవాలె? అనే ఆలోచనతోనే రోజులు గడుపుతున్నరు.
ఆఖరికి కథ ఎక్కడికి వచ్చిందటంటే… టీజీఐఐసీ, హెచ్ఎండీఏ లాంటి సంస్థల బాసులను పిలిచి, పెద్దలు క్లాసులు పీకుతున్నరట. ఈ నెలలో ఇన్ని ఎకరాలు అమ్మాల్సిందే, ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖజానాకు తేవాల్సిందే అని టార్గెట్లు పెడుతున్నరట. ఆ ఆఫీసర్లేమో పారిశ్రామికవేత్తలను వెతికే పని పక్కనబెట్టి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల లెక్క భూములు అమ్ముతాం.. భూములు.. అని తిరుగుతున్నరట. ఇంకా గమ్మతు ముచ్చటేందంటే, ఈ అమ్ముడు గోలలో అధికారులకు మైండ్ పని చేస్తలేదట. ఒక్కోసారి ఆగమాగంల అమ్మిన భూమినే మళ్లా అమ్ముతున్రంటే.. ఇక వాళ్ల పరేషాన్.. డిప్రెషన్.. ఎట్లున్నదో అర్థం చేసుకోవచ్చు. ఉన్నయన్నీ అమ్ముకుంటూ పోతే.. ప్రభుత్వ భవిష్యత్తు అవసరాల సంగతి ఎట్లా అని జనం అడుగుతున్నరు. అయినా ఎట్లనోగట్ల ఇంకో రెండేండ్లు దాటిస్తే అయిపాయె అన్నట్టుంది కాంగ్రెసోళ్ల కథ.

రాష్ట్ర అప్పుల మీద చర్చ కోసం తెలంగాణ భవన్‌కు వస్తా అని మంత్రి జూపల్లి సవాల్ విసిరిన్రు. సరే దా.. చూసుకుందాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సై అన్నరు. ఇటు చూస్తే… సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బయటపెట్టిన్రు. దీనికి కూడా మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ మేం కూడా రెడీ అని మీసాలు తిప్పింన్రు. కానీ చర్చకు వస్తానన్న జూపల్లి రాలేదు. గన్‌పార్క్‌కు రా చూసుకుందాం అన్నరు. సరే అని హరీశ్‌రావు అక్కడికి పోతాంటే.. పోకుండా పోలీసులతో అడ్డుకున్నరు. ఇదేం తొండి ఆట! ఇంకేంది.. హమ్మయ్య అనుకొంటూ గన్‌పార్క్ నుంచి మంత్రులు తుర్రుమన్నరు. హైలెట్ ఏందంటే.. పోలీసులతో మాకేం సంబంధం అన్నరు.. మంత్రి అడ్లూరి. శాతగానప్పుడు సవాల్ చేసి, అందరి ఇజ్జత్ తీసిన్రని మంత్రులపై రేవంత్ మండిపడ్డడని ప్రభుత్వంలో ముచ్చట నడుస్తాంది.
– దాము నర్మాల