‘నో ఎంట్రీ’ ‘గోల్మాల్ రిటర్న్స్’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో పాపులర్ అయింది కథానాయిక సెలీనా జైట్లీ. దాదాపు పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె బాలీవుడ్లో పునరాగమనం చేస్తూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సమాజ సేవకురాలు సిస్టర్ నివేదిత బయోపిక్‌లో నటించనుంది. రామ్‌కమల్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఐర్లాండ్‌లో 1867లో జన్మించిన సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ నోబెల్. స్వామి వివేకానంద బోధనల స్ఫూర్తితో భారత్‌లో అడుగుపెట్టిన ఆమె సిస్టర్ నివేదితగా పేరు మార్చుకున్నారు. భారతదేశంలో ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో తనదైన ముద్రను వేశారు. తనను ఎంతోగానో ప్రభావితం చేసిన ఆధ్యాత్మికవేత్త సిస్టర్ నివేదిత బయోపిక్‌లో నటించడం ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం అంకితభావంతో పనిచేస్తానని సెలీనా జైట్లీ పేర్కొన్నది.