కోర్టు కొరడా ఝళిపిస్తేగానీ హైదరాబాద్ యూనివర్సిటీలో బుల్డోజర్ల ఆగడాలు ఆగలేదు. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఎస్టీల భూములు లాక్కొనేందుకు ప్రయోగించిన ఖాకీ కర్కశత్వం ప్రజాపోరాటాలతో వీగిపోక తప్పలేదు. ఇప్పుడు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోనూ పీఛేముడ్ అనక తప్పలేదు. ఇలా జరగడం కాంగ్రెస్ సర్కార్కు ఇదే మొదటిసారి కాదు, బహుశా ఇదే చివరిసారి కూడా కాకపోవచ్చు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కాంగ్రెస్ ధోరణిలో ‘మార్పు’ రావడం లేదు. హామీలు, గ్యారెంటీల అమలును అటకెక్కించిన రేవంత్ సర్కార్ ‘నక్కలు బొక్కలు వెదుకును’ అన్నట్టుగా భూముల వేటలో గడుపుతున్నది. ప్రభుత్వ భూదాహం ప్రకృతికి, పర్యావరణానికి, ప్రజలకు చేటు కలిగిస్తున్నది.
కాంగ్రెస్ ప్రజాకంటక పాలనకు వెలుగుమట్లలో రెండు వారాల క్రితం జరిపిన బుల్డోజర్ల విధ్వంసం పరాకాష్ట. భూదాన్ భూముల్లో పేదలు కట్టుకున్న పిచ్చుకగూళ్లపై గత నెల 24న రేవంత్ సర్కార్ రాబందులా విరుచుకపడింది. పోలీసు బందోబస్తు నడుమ యంత్రభూతాలతో బీభత్సం సృష్టించింది. ఏకంగా 766 నిస్సహాయ కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా వీధిన పడేసింది. భూదాహంతో జరిపిన బుల్డోజర్ దాడి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కాంగ్రెస్ దౌష్ట్యాన్ని ఎండగట్టడం గమనార్హం.
నోరులేని పేదలు భయాందోళనలతో ఎక్కడివారక్కడ చెదిరిపోతారని ఆశించిన సర్కార్కు శృంగభంగమైంది. ఇండ్లు కోల్పోయిన వారిని దిక్కులేనివాళ్లుగా భావించి తరిమికొట్టాలని చూసింది. ఆందోళనకు దిగిన వాళ్లను పెయిడ్ ఆర్టిస్టులంటూ ముద్రవేయాలని చూసింది. నిర్వాసితుల శిబిరాల్లో సౌకర్యాలు లేకుండా చేసింది. నిర్వాసితుల కోసం పంపిన భోజనాన్ని సైతం అడ్డుకోవడం కాంగ్రెస్ కర్కశత్వానికి అద్దం పట్టింది. అయినా బాధితులు అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించడంతో కథ అడ్డం తిరిగింది. బీఆర్ఎస్ నేతృత్వంలో బాధితులు చేసిన పోరాటం సర్కార్ మెడలు వంచింది.
బీఆర్ఎస్ నేతలు బాధితుల పక్షాన ఉక్కుస్తంభంలా నిలబడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా వెళ్లి నిర్వాసితులకు ధైర్యం చెప్పారు. న్యాయం కోసం ఎంతదాకానైనా పోరాడుతామని భరోసా ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చిచెప్పడంతో సర్కార్కు కండ్లు బైర్లు కమ్మాయి. దీంతో సర్కార్ పీఛేముడ్ చెప్పక తప్పలేదు. కూల్చినచోటే బాధితులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం బీఆర్ఎస్ రాజీలేని ప్రజాపోరు సాధించిన ఘనవిజయమని చెప్పక తప్పదు.
పేదలను కొట్టి పెద్దలకు పంచే ‘కాంగ్రెస్ మార్క్’ దుర్మార్గానికి వెలుగుమట్ల తాజా నిదర్శనం మాత్రమే. యూపీలో బుల్డోజర్ పాలనపై విమర్శలు కురిపించే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడ తమ పార్టీ ఏలుబడిలో జరుగుతున్న విచ్చలవిడి కూల్చివేతలపై నోరు మెదపకపోవడం విడ్డూరం. అంతులేని భూదాహంతో అమాయక ప్రజల ఇండ్లు కూల్చేందుకు కాంగ్రెస్ సర్కార్ తెగబడుతున్నది. కానీ అస్మదీయుల అక్రమ నిర్మాణాల జోలికి మాత్రం వెళ్లడం లేదు.
ప్రభుత్వం ఇటీవల కాలంలో జరిపిన రెండు రకాల కూల్చివేతలను న్యాయస్థానాలు దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. కోర్టులు తలంటు పోసినా, ప్రజలు తిరగబడి విరగబోట్లు పొడిచినా కాంగ్రెస్ తీరు మారడం లేదు. ఎన్నికలకు ముందు ‘మార్పు’ అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్.. తర్వాత ప్రజల బతుకులను ఆగమాగం చేసింది. సంక్షేమం సడుగులిరిగింది. అభివృద్ధి అడుగంటింది. పాలన గాలికిపోయింది. మోసపోయి గోసపడుతున్న ప్రజలు.. కాంగ్రెస్ను ఇంటికి సాగనంపే ఓటు తీర్పు చెప్పాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ప్రజానీకం ఏకమై అదను కోసం ఎదురుచూస్తున్నారని రాష్ట్ర పాలకులు గుర్తుంచుకోవాలి.