అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కేసీఆర్ మీద ప్రతిపక్షాలు ఏమని ప్రచారాలు చేశాయి? ఏ సాకుతో బురద జల్లాయి? బాగా వినిపించిన మాట. ఫాంహౌస్. అవును.. ప్రతిపక్షాలు, పచ్చ లాబీ మేపే మేధావులు, పాత్రికేయులు, లెప్ట్, రైటు సిద్ధాంతకర్తలు, కుల గురువులు అందరికందరూ ఫాంహౌస్.. ఫాంహౌస్ అంటూ ప్రచారంతో ఊదరగొట్టారు. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడమే తప్పు అన్నట్టుగా బీఆర్ఎస్ అధినేతపై ఈ మూకలన్నీ మైకులు బద్దలయ్యేదాకా దుష్ప్రచారం చేశాయి.
HYDRAA | ప్రజల మనసులో విషం నింపాయి. అయితే, కాలం ఒక్కలా ఉండదు. అది ఎదురుతన్నిన రోజు ఒకటి వస్తుంది… వచ్చింది! గ్యారెంటీలను అమలుచేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి హైడ్రా పేరుతో డ్రామా మొదలుపెట్టింది. అయితే, ఈ డైవర్షన్ డ్రామా అటు కాంగ్రెస్ పార్టీకి ఎదురుతన్నడంతో పాటు ఇటు బీఆర్ఎస్కు ఒక గొప్ప మేలు చేసింది. ఈ కూల్చివేతలు, నోటీసుల పర్వం వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఎందరెందరు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఎన్నెన్ని ఫాంహౌస్లున్నాయో తొలిసారి బయటపడింది. కోట్ల విలువ చేసే ఫాంహౌస్‌లు ఎంత విలాసవంతంగా కొలువుదీరాయో ఫొటోలు, వీడియోలతో సహా బయటపడ్డాయి. ఒక్కో నాయకుడు ప్రభుత్వ భూములు, చెరువులు ఎంత అడ్డంగా ఆక్రమించి మరీ వాటిని కట్టుకున్నారో కూడా ఆధారాలు, మ్యాప్‌లతో సహా వెల్లడైంది.
ఈ డ్రామా వ్యవహారానికి ముందు రాష్ట్రం లో ఒక్క కేసీఆర్‌కే ఫాంహౌస్ ఉందేమో అనే రీతిలో పచ్చ మీడియాగాళ్లు, వెట్టి సోషల్‌మీడియా గాళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశా రు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు ‘కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లాడు’, ‘కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్నారు’ అంటూ అదేదో తప్పయినట్టు పచ్చ మీడియా, సోషల్ మీడియాలో పెయిడ్ రాతగాళ్లు ప్రచారాలు చేశారు.
బీజేపీ అయితే కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని, పాలన పడకేసిందని చిత్తం వచ్చిన రీతిలో ప్రచారం చేసి అది నిజమేనని ప్రజలను కూడా నమ్మించింది. ఆ ప్రచారాన్ని ప్రజలూ నమ్మారు. కేసీఆర్‌కు మాత్రమే ఫాంహౌస్ ఉన్నదని విద్యావంతులూ భ్రమపడ్డారు. కానీ, ఇవాళ ఎందరు నాయకులకు ఎన్నెన్ని ఫాంహౌస్లున్నాయో బయటపడుతుంటే నోళ్లు వెళ్లబెడుతున్నారు. వాస్తవమేమంటే రాష్ట్రంలో అత్యధిక ఫాం హౌస్‌లు ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకే. బీజేపీ అధికారంలోకి రాలేదు కాబట్టి దానికి ఆ చాన్స్ దొరకలేదు.
అసలు ఫాంహౌస్ అనే కల్చర్‌ను తెచ్చింది కూడా కాంగ్రెస్ నాయకులే. వైఎస్ ఇడుపులపాయ రాష్ట్రంలోనే అతిపెద్ద ఫాంహౌస్. అయినా పచ్చమీడియా ఏనాడూ దాన్ని ఆ పేరుతో పిలవలేదు. కానీ, కేసీఆర్ దగ్గరికి వచ్చేసరికి ప్లేటు ఫిరాయించి ఫాం హౌస్ అంటూ ప్రచారాలు చేసింది. కేసీఆర్ మీద జరిగిన దుష్ప్రచారంలో ఫాంహౌస్ అనేదాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఆ సాదా సీదా ఇంటిని భూస్వాముల గడీలతో పోల్చి, కేసీఆర్ అక్కడ ఏదో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారా? అనేంతగా ప్రచారాలు చేసిన వాళ్లూ ఉన్నారు. ఈ ప్రచారం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారింది కూడా.
కానీ, తాజాగా హైడ్రా రంగప్రవేశంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో ఢిల్లీ లీడర్ల నుంచి గల్లీ లెవల్ లీడర్ల దాక ఎవరెవరికి ఫామ్హౌస్లున్నాయో హైడ్రా నోటీసులతో తేటతెల్లమైంది. ఈ అంశం మీద ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ‘ఇంతకాలం కేసీఆర్ ఒక్కడికే ఫాంహౌస్ ఉందనుకున్నాం. కానీ, ఇంతమందికి, ఇన్ని ఫాంహౌస్లున్నాయా?’ అని ప్రజలు ఆశ్చర్యచకితులవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫాంహౌస్‌ల విషయం హాట్‌టాపిక్ అయింది. గండిపేటలో ఫాంహౌస్లున్న నాయకులే గతంలో కేసీఆర్ ఫాంహౌస్ మీద చేసిన వ్యాఖ్యలను ఆ నాయకులకే గుర్తుచేస్తూ వారిని ఒక ఆట ఆడుకుంటున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఫాంహౌస్‌ల బండారం బయటపడటం పట్ల ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తమ్మీద కొన్ని విషయాలు ప్రజలకు తేటతెల్లమయ్యాయి. ఒకటి.. కేసీఆర్‌కే కాదు, దాదాపు అన్ని పార్టీల లీడర్లకూ రాజధానిలో ఫాంహౌస్లున్నాయి. రెండు, కేసీఆర్ ఫాంహౌస్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది. అక్కడ ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుల ఫాంహౌస్లన్నీ దందాల కోసం కట్టుకున్నారు. మూడు, రాజధానిలో ఎందరు నాయకులకు ఫాంహౌస్లున్నాయో మీడియాకు బాగా తెలుసు. అయినా ఏనాడూ ఆ విషయాన్ని మీడియా పొరపాటున కూడా వెల్లడించలేదు. అంతా కలిసికట్టుగా ఒక కుట్రపూరిత ప్రచారం చేశారు.
ఫాంహౌస్‌ల మంచి చెడుల మీద జర్నలిస్టు వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతున్నది. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి కావలసిన భూమిని డబ్బులు చెల్లించి కొనుక్కున్నారు. ఒక్క అంగుళం కూడా ఆక్రమించుకున్నది, గుంజుకున్నది లేదు. అందులో ప్రభుత్వ భూమి లేదు. అసైన్డ్ భూమి కూడా లేదు. అలాగే చెరువులు, కుంటలు లేవు. ఎఫ్టీఎల్లు, బఫర్జోన్ల వంటి సమస్యలు లేవు. అంతా పారదర్శకం. పైగా, తన వ్యవసాయ క్షేత్రం నుంచి భగీరథ పైపులు వేయడానికి స్వయంగా ఆయనే అనుమతించారు. అందుకోసం కొంత పంట కూడా తొలగించారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతల ఫాంహౌస్లన్నీ దురాక్రమణలే. పైసా చెల్లించకుండా బరితెగించి జరిపిన అడ్డగోలు ఆక్రమణలు.
ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, ఎఫ్టీఎల్ భూములు, బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టకూడని నిషేధిత భూములు. చెరువుశిఖం భూములు, ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి నింపి అడ్డంగా కబ్జాలు పెట్టిన భూములు ఏవీ వదల్లేదు. అడిగేవాడు లేకపోవడంతో ఒక్క పైసా ఖర్చు లేకుండా జంట నగరాల ప్రజలకు మంచినీరందించే గండిపేటనే అడ్డగోలుగా చెరబట్టి కట్టుకున్న అక్రమ నిర్మాణాలు అందులో ఉన్నాయి. నాలా మార్గాలు, ఎఫ్టీఎల్లు, బఫర్జోన్ల పరిధిని ధ్వంసం చేసి మట్టిని నింపి కట్టుకున్న విలాస మందిరాలున్నాయి. పేరుకు ఫాంహౌస్ అయినా ఇందులో ఒక్కడూ వ్యవసాయం చేసినవాడు లేడు. ఇక్కడ జరిగిందంతా ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం, కాలుష్య సృష్టి.
కేసీఆర్ ఫామ్ హౌస్‌గా చెప్తున్నది కేవలం నివాస గృహం. సాదా సీదా ఇల్లు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేని గ్రామీణ వాతావరణం తలపించే ఒక మామూలు నిర్మాణం. పచ్చని పంట చేల మధ్య ఒక సామాన్య రైతు నివసించడానికి అనువైన ఇల్లు. ఫాంహౌస్ అనే పేరుతో అదేదో అద్దాల భవనం అయినట్టు ప్రచారం చేశారు. అయినా, దాన్ని గడీ అంటూ కూడా కొందరు ప్రచారాలు చేశారు. అక్కడేదో జరగరానిది జరుగుతున్నట్టు.. అదో విలాసమందిరమా అన్నట్టు ప్రజలకు నూరిపోశారు. మరి గండిపేట పరిధిలోని ఫాంహౌస్‌ల మాటేమిటి? అవి కేవలం నివాసాలా? రాజ ప్రాసాదాలు తలపించే నిర్మాణాలు.
కోట్లకు కోట్లు పోసి కట్టిన బహుళ అంతస్థుల అత్యాధునిక విలాస మందిరాలు. బలిసిన కోటీశ్వరులు వారాంతాల్లో సేద తీరడానికి ఎంజాయ్ చేయడానికి వచ్చే రిలాక్స్ రిసార్టులు. ఆయా ఫాంహౌస్‌ల ప్రాంగణంలో పార్కులు, పెద్ద పెద్ద హాళ్లు. అందులోనే బార్లు, రూఫ్‌టాప్‌లో గండిపేట దృశ్యాలు చూస్తూ ఎంజాయ్ చేసే విలాస మందిరాలు. చుట్టూ ఎవరి చూపు అందనంత ఎత్తులో కోట గోడల్లాంటి ప్రహరీలు, లోపలి దృశ్యాలేవీ కనిపించని స్థాయిలో పెద్ద పెద్ద గేట్లు. కాపలాకు కుప్పలు తెప్పులుగా బౌన్సర్లు. మరి ఎవరివి గడీలు?
వాస్తవానికి ఆ ఫాంహౌస్ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం. వ్యవసాయం చూసుకోవడానికే ఆయన అక్కడికి వెళ్లారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండి వ్యవసాయం చూసుకుంటారు. రకరకాల పంటలు పండిస్తారు. వ్యవసాయంలో రకరకాల ప్రయోగాలు చేస్తారు. కొత్త కొత్త పద్ధతులు పాటిస్తారు. కొత్త పంటలు తాను పండించి, తన అనుభవాన్ని అక్కడికి వచ్చే వారితో పంచుకుంటారు. కేసీఆర్ ఫాంహౌస్ కేవలం వ్యవసాయం చేయడం కోసమే కట్టుకున్నది. అక్కడ ఆయనకు వేరే వ్యాపకం లేదు. మరి గండిపేట, తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు కట్టిన రాజప్రాసాదాల్లో ఏం జరుగుతోంది? దందాలు, సెటిల్మెంట్లు, మజాలకు నిలయాలుగా మారాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. కేసీఆర్ స్వయంగా విలేకరులను పిలిచి తన వ్యవసాయక్షేత్రంలో అంగుళం అంగుళం వారికి చూపించారు.
వ్యవసాయంలో తాను చేస్తున్న ప్రయోగాలను వారికి విడమరిచి చెప్పారు. మరి కాంగ్రెస్ నాయకులు ఏనాడన్నా తమ ఫాం హౌస్లలోకి విలేకరులను రానిచ్చారా? అక్కడ పరిస్థితిని చూడనిచ్చారా? అసలా వైపే ఎవరినీ రానివ్వకూడనంత రహస్యం దేనికి? కేసీఆర్ ఫాంహౌస్‌లో అంతా పారదర్శకం. తనను చూడటానికి వచ్చే నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు, అధికారులకు స్వయంగా కేసీఆరే తన పాత ఓమ్ని కారులో వ్యవసాయ క్షేత్రమంతా తిప్పి చూపిస్తారు. ఎలాంటి దాపరికం లేదు. కానీ, కాం గ్రెస్ ఫాంహౌస్లన్నీ రహస్యాలే. అసలు ఆ ప్రాం తం వైపే ఎవరినీ రానివ్వరు, దందాగాళ్లను తప్ప. వాటికి బౌన్సర్లు నిరంతరం కాపలా కాస్తారు. ఆఖరికి మహిళా జర్నలిస్టులు కూడా వారి దాడికి గురైన సంఘటనలు ఇటీవల జరిగాయి కూడా.
కేసీఆర్ ఫాంహౌస్ నుంచి ఎలాంటి వ్యర్థాలు బయటకు రావు. చుట్టూ వ్యవసాయ భూములే కాబట్టి వ్యర్థాల సమస్యే తలెత్తదు. కానీ, ఎఫ్టీఎల్ పరిధిలోని కాంగ్రెస్ నేతల ఫాంహౌస్‌ల మాటేమి టి? అందులోని వ్యర్థాలు ఎటు వెళ్తున్నాయి? ఆ వ్యర్థాలు ఏకంగా హైదరాబాద్ నగర ప్రజలు తాగే నీటినే కలుషితం చేస్తున్నాయి. కేసీఆర్ వ్యవసా యం చేసుకుంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు. ఆ ఫాంహౌస్ దగ్గరలో 200 ఆవులతో గోశాల కూడా ఉంది. మరి ఈ కాంగ్రెస్ నాయకులు? ఆక్రమించిన ఫాంహౌస్‌లను లక్షల రూపాయల అద్దెలకు ఇచ్చుకుంటున్నారు.
గండిపేట ఏదో వీళ్ల అబ్బ సొత్తయినట్టు దాన్ని చెరబట్టి భవంతులు కట్టుకొని దాన్నీ వాణిజ్య అవసరాలకు వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వీళ్లెవరూ ఈ ఫాంహౌస్‌లలో వ్యవసాయం చేయడం లేదు. ఖరీదైన విందు సమావేశాలు, వినోద సమావేశాలు పెట్టుకుంటున్నారు. గమ్మత్తేమంటే చెరువులను కబ్జాలు పెట్టిన ఈ నాయకులే కేసీఆర్‌ది ఫాంహౌస్ పాలన అంటూ దుష్ప్రచారాలు చేశారు. ప్రజలను నమ్మించారు. పచ్చ మీడియా కూడా తప్పు దారి పట్టించింది. ప్రజలూ పొరపడ్డారు. ఏదో ఊహించుకొని ఏదో అభిప్రాయానికి వచ్చారు. ఏమైనా చివరికి నిజం బయటపడింది. అయితే, జరగవలసిన నష్టం జరిగిపోయింది. అందుకే, ప్రజలు ఏది మంచి, ఏది చెడు అనేది చూడకుండా ప్రచారాలకు మోసపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ఫాంహౌస్ ఉదంతమే దానికి ఉదాహరణ!
– ఎస్జీవీ శ్రీనివాస రావు