హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలోకి రేవంత్‌రెడ్డి ప్రవేశించగానే తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌కు స్వాగతం అని వేదికపై ఉన్న యాంకర్ ఆహ్వానించారు. పేరు మర్చిపోవడం, తప్పుగా పలకడం మహాపరాధమేమీ కాదు. ఇదే మొదటిసారీ కాదు. అయితే దీనిపై సామాజిక మాధ్యమాల్లో చాలా హడావుడి జరిగింది. చివరికి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగు మహాసభలో తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు.
పుష్ప సినిమా ఫంక్షన్లో నటుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ రేవంత్‌రెడ్డి పేరు గుర్తురాక వదిలేశారు. ఆ తర్వాత సంధ్య థియేటర్లో తొక్కిసలాట, అల్లు అరెస్ట్, శాసనసభలో నటుడిపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా పెద్దలు వెళ్లి సీఎంను కలవడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అల్లు అర్జున్ తన ప్రసంగంలో సీఎం పేరు మర్చిపోవడం వల్లనే ఈ ఘర్షణ అని ప్రచారం సాగింది. తెలుగు సభల్లో సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ కూడా నటుడే. కాబట్టి, ఈ హీరో అరెస్ట్ కూడా తప్పదా? అని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
‘మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు’ అన్నట్టు ఒకవైపు యాంకర్ సీఎం పేరు మర్చిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, మరోవైపు వేదిక పైకి రేవంత్ వస్తుంటే అప్పటికే వేదికపై కూర్చున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి మంత్రులు అలానే కూర్చొని ఉన్నారు. ఒకవైపు తెలుగు సభల వీడియో, మరో వైపు సీఎం వస్తున్నా మంత్రులు అలానే కూర్చున్న వీడియో.. ఈ రెండూ వైరల్ కావడంతో ఎంపీ చామల లాంటి వారు స్పందించి సీఎం పేరు మరిచిపోవడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఏదో కుట్ర ఉన్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజులు మాత్రమే సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు పేరు కూడా మరిచిపోరు కానీ, ఏడాది నుంచీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి పేరు గుర్తురావడం లేదంటే ఆలోచించాల్సిందే. మంత్రులు లేవకపోవడం, పేరు మర్చిపోవడం యాదృచ్ఛికం కావచ్చు, ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ, ఒక్క ఉచిత బస్సు తప్ప కాంగ్రెస్ పాలనలో ప్రజలపై పాజిటివ్ ప్రభావం చూపే నిర్ణయాలు లేవు. రేవంత్ రెడ్డి తన పాలనతో ప్రజలపై బలమైన ముద్ర వేయలేదనేది నిజం.
అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇలాంటి దృశ్యాలు ఊహించలేం, జరగలేదు కూడా. పార్టీ మీద, ప్రభుత్వం మీద వారికి అంతటి పట్టు ఉండేది. ఎన్టీఆర్‌ను దించి బాబు సీఎం అయిన కొత్తలో ఎంపీగా ఉన్న వడ్డే శోభనాద్రీశ్వరరావు టెలికాన్ఫరెన్స్‌లో బాబు అని పేరు పెట్టి పిలిస్తే బాబు ఆయన్ని కట్ చేసి దూరం పెట్టారు. తనను అలా పేరు పెట్టి పిలువ వద్దని సున్నితంగా మందలించారని ఆ మధ్య కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సుబ్బారెడ్డి, వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వారు రాజకీయాల్లో, టీడీపీలో బాబు కన్నా సీనియర్లు. అయినా, సీఎం పోస్ట్‌లో ఉన్న వారి పట్ల హుందాగా ఉండాలి. రేవంత్‌రెడ్డి విషయంలో అటు ప్రజల్లో, ఇటు సొంత పార్టీలో, మంత్రుల్లో ఆ గౌరవం కనిపించడం లేదు. రేవంత్‌రెడ్డి పార్టీలో అందరి కన్నా జూనియర్ కావడంతో తలెత్తుతున్న సమస్య ఇది.
పేరు చెరిపేస్తా అంటూ ప్రకటనలు చేసిన రేవంత్ పేరే సీఎంగా గుర్తుకురాకపోవడం బాధాకరం. అది ఆయనకే కాదు, తెలంగాణకే అవమానం. సంక్షేమ పథకాలే కాదు, తెలంగాణ పేరెత్తినా కేసీఆర్ గుర్తొస్తారు. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాల పేరు వినగానే కేసీఆర్ మదిలో మెదులుతారు. రేవంత్‌రెడ్డి కూడా తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పేరు నిలిచిపోయేవిధంగా, తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి.
సీఎం పదవి చేపట్టిన కొత్తలో శాసనసభలో రెండు విషయాలు చెప్పారు. తాను కేసీఆర్‌ను కాదని, ఆయన ఆనవాళ్లు అన్నీ చెరిపేస్తానని ప్రకటించారు. బోలెడు డబ్బు ఖర్చుచేసి టీఎస్ అని ఉన్న చోటల్లా టీజీ అని పేరు మార్చారు. అయితే మంత్రులు ఇప్పుడు కూడా ‘టీజీ ఆర్టీసీ’ అని కాకుండా ట్విట్టర్లో ‘టీఎస్ ఆర్టీసీ’ అనే రాస్తున్నారంటే పేరు మార్పు ఎలాంటి ఫలితం ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ మీడియాలోనే కాకుండా చివరికి మహారాష్ట్ర మీడియాలో సైతం రూ.వందల కోట్ల ఖర్చుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలతో పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చినా ప్రజల దృష్టిలో సీఎంగా నిలబడకపోవడం గమనార్హం. ప్రపంచంలోని తెలుగువారందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకొనే ప్రపంచ తెలుగు సమాఖ్య తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించిన ముగింపు సభలో సీఎం స్వయంగా పాల్గొన్నా ఆయన పేరు గుర్తుకురాక కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు చెప్పారంటే ఇక సామాన్యులకు ఏ విధంగా గుర్తు ఉంటుంది.
తాను కేసీఆర్ లాంటి నాయకుడిని కాదని రేవంత్‌రెడ్డి చెప్పుకొంటారు. సీఎం అనే కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ప్రత్యేకత ఉంటుంది. ఎవరూ మరొకరు కారు. ఒక సభలో ఓషో యోగా గురించి చెప్తూ వందకోట్ల మంది భారతీయులు ఉన్నప్పుడు వంద కోట్ల రకాల యోగా పద్ధతులు ఉండాలని, ప్రతి మనిషి ప్రత్యేకమేనని అంటారు.
అదేవిధంగా ప్రతి ముఖ్యమంత్రికి తమ ప్రత్యేకతలు తమకు ఉంటాయి. ఎవరూ ఇంకొకరి లాంటి వారు కాదు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయినా వైఎస్సార్ పార్టీలో సుదీర్ఘ కాలం పోరాటం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయ పార్టీ అయినా సీఎంగా ప్రాంతీయ పార్టీ నాయకుడిలా అధికారం చెలాయించారు. ప్రభుత్వంపైనా, పార్టీ పైనా పట్టు సాధించారు. సాధారణంగా కాంగ్రెస్‌లో సోనియాగాంధీ చెప్పారంటే ఏ నాయకుడైనా దాన్ని పాటించాల్సిందే. కానీ, వైఎస్సార్ సీఎం అయ్యాక పి.జనార్దన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సోనియా సిఫారసు చేస్తే వైఎస్ మాత్రం పట్టించుకోలేదు. సోనియా తిరిగి అడగలేదని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ లాబీలో మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో వైఎస్సార్ పట్టు అంత బలంగా ఉండేది. చంద్రబాబు ప్రాంతీయ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన ఇష్టం. అదే విధంగా ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు కాబట్టి ప్రభుత్వంపై, పార్టీపై కేసీఆర్‌కు పూర్తి పట్టు ఉండేది.
కేసీఆర్ పట్టుబట్టి తెలంగాణ సాధించారని ‘మహా టీవీ’ ఇంటర్వ్యూలో స్వయంగా రేవంత్‌రెడ్డే చెప్పారు. అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. కాబట్టి, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడానికి అదేమన్నా గాంధీభవన్ గోడల మీదున్న మరకలా? సున్నం వేస్తే కనిపించకుండా పోవడానికి? ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎలా మలిపేస్తారు?
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో సీఎంను ఎంపిక చేయాల్సిన సమయంలో ఎంత రాజకీయం జరిగినా అధికారిక ప్రకటన మాత్రం ఏకగ్రీవంగా ఉంటుంది. ఫలానా వారిని సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నట్టు ప్రకటిస్తారు. కానీ, తెలంగాణలో తొలిసారి దీనికి భిన్నంగా జరిగింది. అప్పుడు సీఎల్పీ నాయకుడి ఎన్నిక వ్యవహారం చూసిన వేణుగోపాల్.. రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నట్టు ప్రకటిస్తూనే సీఎంగా ఏకపక్ష నిర్ణయాలుండవని, అందరితో చర్చించి సమష్ఠిగా నిర్ణయాలు తీసుకుంటారని ప్రకటించారు. పార్టీలో ఉన్న అందరూ రేవంత్ కన్నా సీనియర్లే కావడం వల్ల వారిని కూడా సంతృప్తి పరచాల్సిన పరిస్థితి కాంగ్రెస్ హై కమాండ్ది.
పేరు చెరిపేస్తా అంటూ ప్రకటనలు చేసిన రేవంత్ పేరే సీఎంగా గుర్తుకురాకపోవడం బాధాకరం. అది ఆయనకే కాదు, తెలంగాణకే అవమానం. సంక్షేమ పథకాలే కాదు, తెలంగాణ పేరెత్తినా కేసీఆర్ గుర్తొస్తారు. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాల పేరు వినగానే కేసీఆర్ మదిలో మెదులుతారు. రేవంత్‌రెడ్డి కూడా తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పేరు నిలిచిపోయేవిధంగా, తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. దేశం గాంధీని గుర్తుంచుకుంటుంది, గాడ్సేనూ గుర్తుంచుకుంటుంది. విధ్వంసం ద్వారా కాకుండా నిర్మాణం ద్వారా తన పేరు గుర్తుండే విధంగా రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకోవాలి.
– బుద్దా మురళి