అతనే లేకుంటే తెలంగాణ యాడుంటుండే
అతడే రాకుంటే తెలంగాణ ఎట్లుంటుండే
నేల కలను నిజం చేసి కాల గతినె మార్చినోడు
నేర్పుతోన తూర్పు కాంతి వేకువనె తెచ్చినోడు
నది నడకను శాసించిన భగీరథుని ప్రతిరూపం
కరువుకు కళ్లెం వేసిన బలరాముని నైపుణ్యం
పరుగిడే గుర్రాల కదన ప్రగతి రథపు సారధ్యం
భావి చరిత చెక్కిలిపై భాసిల్లిన సంతకం
అదురు లేక అగ్ని సరస్సునీదిన గజ ఈతగాడు
వలస కోరలను పెరికిన గురి తప్పని విలుకాడు
సకల జనులనడిపించిన ఉద్యమాల చెలికాడు
అవనికి చివురుల నొంపిన ఆకుపచ్చ సూరీడు
చిక్కులెన్ని వచ్చి పడిన విప్పగల్ల నేర్పు తనది
అరటి పండు వలిచినట్టు అలరించే మాట తనది
పట్టిన పట్టిడివనట్టి ఉడుంపట్టు బలం తనది
అందరు నావారనుకొని అర్సుకునే గుణం తనది
అతను తొలి అడుగేసితే గమ్యమే రమ్మంటాది
అతని తత్వమేదో గానీ జగమే తల ఊపుతుంది
అతని చేయి తాకితే రాతికి చలనం వస్తది
అతని చూపుకు ఎండమావి నీరయి పోతది
పిట్టలు వాలిన చెట్టుకు కట్టిన గిజిగాని గూడు
కట్ట కింద కతుప వొంపు వాగె ఇల వరద గూడు
గుట్టపయి నర్సన్న అతనికి చుట్టపు రేడు
మట్టి పల్లె కాడి మేడి మహిమను ఎలుగెత్తినోడు
– గోరటి వెంకన్న
కవి, గేయ రచయిత, ఎమ్మెల్సీ
ఇది రైతు దినోత్సవం..
కాలం ఇచ్చే అవకాశాలను, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని వాటిని నిజం చేసేందుకు కృషి చేసినవారే చరిత్ర సృష్టించారు. అలాగే వ్యవసాయం దండుగన్న చోట రైతును రాజును చేసి చరిత్ర సృష్టించిన కేసీఆర్ పుట్టిన రోజును తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుకోవటానికి ఇంతకన్నా మంచిరోజు ఏముంటుంది..?
– హజారి
వెనుతిరుగని ధీరోదాత్తుడు
‘నై తెలంగాణ’ అన్న నోటితోనే ‘జై తెలంగాణ’ అనిపించిన కేసీఆర్ రాజకీయ చాణక్యం అద్వితీయం. తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించటమే నిషేధం అన్న స్థితి నుంచి తెలంగాణ నినాదమే జీవనపథంగా మార్చిన తీరు అపూర్వం. ఈ క్రమంలో ప్రతి సభ, మీడియా సమావేశంలోనూ బీజేపీ కుటిల నీతిని ఎండగడుతూ చేస్తున్న ప్రసంగాలు దేశ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా సరే.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నమ్ముకున్న ప్రజల కోసం వెనుతిరుగని ధీరోదాత్తుడు కేసీఆర్.
– సత్యప్రసాద్ పెద్దపల్లి
కర్త, కర్మ, క్రియ…
భారత స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత అంత గొప్ప ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం. ఈ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే. అకుంఠిత దీక్ష, రాజకీయ ఎత్తుగడలు, పోరాట పటిమతోనే రాష్ర్టాన్ని సాధించి కేసీఆర్ తెలంగాణ జాతిపితగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణను దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపుతున్న మహనీయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
– కాసర్ల నాగేందర్ రెడ్డి, ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షులు
ప్రజా నాయకుడు
తెలంగాణ రాష్ట్రం ఒక కల. అది సాధ్యమవుతుందా.. అన్న సందేహాలను, సవాలక్ష సమస్యలను అధిగమించి అంచెలంచెలుగా కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌ది. సాధించాల్సిన లక్ష్యం కోసం నమ్ముకున్నవాళ్లను నడిపిస్తూ లక్ష్యాన్ని సాధించేవాడు నిజమైన నాయకుడు. ఆ అర్థంలో.. కేసీఆర్ నిజమైన ప్రజా నాయకుడు.
– కాలేరు సురేశ్, రాష్ట్ర సహాధ్యక్షుడు,
తెలంగాణ ఉద్యోగుల సంఘం
ప్రతి ఇంట్లో వెలుగులు
తెలంగాణ ప్రతి ఇంట్లో కేసీఆర్ కొలువైండు. తంగేడు పూలు తళుక్కుమన్నట్టు.., గునుగు పువ్వు గుబాలించినట్టు.. కట్టెల పువ్వు నాట్యమాడినట్టు.. బంతిపూలు దండలైనట్టు.. చామంతి చెంగుమనేలా.. మల్లెల తోటలై.. గులాబీల మెరుపులతో పేర్చిన సంక్షేమ బతుకమ్మ తెలంగాణ. ఇవ్వాళ తెలంగాణ ప్రతి ఇంట్లో కేసీఆర్ ప్రగతిరథ చక్రం తిరుగుతున్నది. జన జీవితాలు వెలుగులీనుతున్నవి.
– చిటుకుల మైసారెడ్డి, సీనియర్ జర్నలిస్టు
తెలంగాణకు వరం
ఏ కాలం వారైనా, ఏ దేశం, ఏ ప్రాంత ప్రజలైనా మనస్ఫూర్తిగా కనే కమ్మని కల కేసీఆర్ లాంటి నేత తమ కోసం ఉండాలని. కేసీఆర్ అధికారం కోసం, ఆధిక్యత కోసం ఖడ్గం తిప్పలేదు. ఎప్పుడూ అనవసరంగా అడుగు ముందుకువేయలేదు. అవసరం ఉన్నప్పుడు అర అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ చేసిన పోరాటాలన్నీ ఒక సామాజిక ప్రయోజనం కోసం, జనహితం కోసం చేసినవే. అందుకే కేసీఆర్ వలె పోరాటాలు చేయాలి. విజయాలు సాధించాలి. కేసీఆర్ తెలంగాణకు ఒక వరం.
– ఎడ్ల బాబు, సామాజిక కార్యకర్త
పేదల పెన్నిధి
అనేక సంక్షేమ పథకాలతో పేదల పాలిట పెన్నిధిలా నిలుస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ ఏదో రూపంలో లబ్ధి చేకూరుస్తున్నారు. ఒక్క రూపాయి కూడా కొత్త పన్ను వేయకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్న దార్శనికుడు కేసీఆర్. విద్య, వైద్యం, కూడు, గూడు మొదలు ప్రతి విషయంలోనూ కేసీఆర్ నేనున్నాననే భరోసా కల్పిస్తున్నారు. అన్నివర్గాలను అక్కు న చేర్చుకొని ఆదుకుంటున్న కేసీఆర్ ఆధునిక భారతంలోనే ఆదర్శ పాలకుడు
– డాక్టర్ బొల్లికొండ వీరేందర్, కేయూ
యావద్భారతం ఎదురుచూపు
దేశంలో ఏ రాజకీయ నాయకునికి లేని వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానం, పోరాట పటిమ, పలు భాషలపై పట్టు కేసీఆర్ సొంతం. ఇలాంటి నేత కోసం నేడు దేశం ఎదురుచూస్తున్నది. తెలంగాణ పాలనానుభవం పునాదిగా దేశాన్ని నడిపించటానికి కేసీఆర్ సమాయత్తం కావాలని యావద్భారతం కోరుతున్నది. ఆ దిశగా అడుగులు పడాలని ఆకాంక్షిస్తూ…
– మార్గం లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్