పాలకుల పంచన చేరని సీఈసీ శేషన్!
దేశంలో కొన్నేండ్లుగా ఎన్నికల సంఘం వివాదాస్పదంగా మారిపోయింది. ఇప్పుడైతే బీజేపీకి తాబేదారుగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకొక పాలసీ, రాష్ర్టానికొక విధానంతో ఈసీ తన స్థాయిని తానే భ్రష్టు పట్టించుకుంటున్నది.
దేశంలో కొన్నేండ్లుగా ఎన్నికల సంఘం వివాదాస్పదంగా మారిపోయింది. ఇప్పుడైతే బీజేపీకి తాబేదారుగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకొక పాలసీ, రాష్ర్టానికొక విధానంతో ఈసీ తన స్థాయిని తానే భ్రష్టు పట్టించుకుంటున్నది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకల వివాదంతో ఈసీ ఖ్యాతి పతనావస్థకు చేరింది. ఏకంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పైనే ఏతీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన రాజీనామా కోరుతూ ఆందోళనలు ఉధృతంగా నడుస్తున్నాయి. కానీ ఈసీకి సంబంధించి ఈనాటి ఈ దుస్థితికి భిన్నమైన చిత్రం ఒకనాడు ఉండేది. వెన్నెముక లేని అధికారులు ఎన్నికలను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి తరుణంలో సీఈసీ పదవికి వన్నె తెచ్చిన ఒక ప్రజాస్వామిక పరిరక్షకుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరమున్నది. ఆయన మరెవరోకాదు, టీఎన్ శేషన్‌గా ప్రఖ్యాతిగాంచిన తిరునళ్లై నారాయణ అయ్యర్ శేషన్. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి కృషిని స్మరించుకుందాం.
ఐఏఎస్అంటే ‘అయ్యా.. ఎస్’ అని తలూపడం కాదని రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలతో నిష్పక్షపాతంగా, నిర్భయంగా ప్రజల కోసమే పని చేయడం అని నిరూపించిన అధికారులు అరుదు. అందులో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి టీఎన్ శేషన్ ముందువరుసలో ఉంటారు. రాజ్యాంగం విలువలను గౌరవిస్తూ అదేబాటలో పయనించారు. ఒత్తిళ్లకు లొంగకుండా సాహసోపేతమైన సంస్కరణలను అమలు చేసి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఎన్నికలంటే ఒక తంతు కాదని, అది ఒక గొప్ప బాధ్యత అని భావించి, లోపభూయిష్టమైన విధానాలను రూపుమాపారు. ఆ తర్వాత కాలంలో చాలామంది ఎన్నికల అధికారులకు మార్గదర్శిగా నిలిచారు. శేషన్ గురించి తెలుసుకుంటే అధికారులకు తమ పదవికున్న గొప్పదనం స్పష్టంగా అర్థమవుతుంది.
1990వ దశకం తొలినాళ్లలో కొందరు ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడి దిక్కుదోచని దశలో ఉన్న రోజులవి. అటువంటి సమయంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉద్యోగ ధర్మం నిర్వహించే ఐఏఎస్‌లను ఏ రాజకీయ నాయకులు ఏమీ చేయలేరని నిరూపించారు టీఎన్ శేషన్. ఐఏఎస్‌లు తమ విలువల్ని మరిచినప్పుడు మాత్రమే రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తాల్సి వస్తుందని, విధి నిర్వహణలో నిజాయితీగా పని చేస్తే నిర్భయంగా ఉండొచ్చని తన ఆచరణ ద్వారా చాటిచెప్పారు. ఐఏఎస్ విశిష్టతను అర్థమయ్యేలా చూపెట్టారు. ఎందరో ఐఏఎస్‌లలో ఆత్మైస్థెర్యం, స్ఫూర్తిని నింపారు. కేంద్ర ఎన్నికల సంఘంలో పదో ఎన్నికల ప్రధానాధికారిగా నియమితుడైన ఆయన 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు పదవిలో కొనసాగారు. పదవిని స్వీకరించిన తొలినాళ్లలోనే ఎన్నికల విధానంలోని వంద అవకతవకలు, లోపాల్ని గుర్తించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్ల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని భావించారు. బెదిరించి ఓట్లు వేయించుకునే పద్ధతులు, నిబంధనలకు మించి ఖర్చు పెట్టే అభ్యర్థులపై కఠినంగా వ్యవహరించారు.
గూండాయిజంతో పోలింగ్ బూత్‌లను ఆక్రమించడం, అధికారుల పక్షపాత ధోరణి లాంటి అంశాలపై దృష్టి సారించారు. లోపాలను సరిచేయడంలో చాలా కఠినంగా వ్యవహరించారు. అంతేకాదు పారదర్శక ఎన్నికల నిర్వహణలో ఫొటో గుర్తింపు కార్డులు అత్యవసరమని ప్రతిపాదించారు. కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. తన ప్రతిపాదనకు సరైన ప్రతిస్పందన ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఫొటో గుర్తింపు కార్డులు లేకపోతే ఎన్నికలే నిర్వహించబోనని తేల్చిచెప్పారు. చివరికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించారు. శేషన్ పట్టుదల వల్లనే తర్వాతి కాలంలో ఫొటో గుర్తింపు కార్డులు అమల్లోకి వచ్చాయి.
1993లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రచార వ్యయ వివరాలను సమర్పించకపోవడంతో 1,488 మంది అభ్యర్థుల్ని మూడేండ్ల వరకు పోటీకి అనర్హులుగా ప్రకటించారు శేషన్. సుమారు 40,000 మంది ఆశావహ అభ్యర్థులు సమర్పించిన వివరాలను స్వయంగా పరిశీలించి, తప్పుడు వివరాలిచ్చినందుకు 14,000 మందిని పోటీకి అనర్హులుగా నిర్ధారించారు. తన కఠిన నిర్ణయాల వల్ల, ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయినా శేషన్ తన సంస్కరణలను కొనసాగించారు. తాను చట్టంలోని కామాలు, ఫుల్‌స్టాప్‌లను కూడా మార్చకుండా అమలు చేశానని అనేవారు. ప్రజాస్వామిక విలువల కోసం పాటుపడిన శేషన్ 2019 నవంబర్ 10న చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. భౌతికంగా దూరమైనా ఆయన నెలకొల్పిన విలువలు ఎందరో అధికారులకు మార్గదర్శకాలయ్యాయి. శేషన్ బాటలో నడిచిన అధికారులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
(వ్యాసకర్త: న్యాయవాది)
-బసవరాజు నరేందర్‌రావు,9908516549
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

