చెల్లాచెదురుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా గుదిగుచ్చింది కేంద్ర ప్రభుత్వం. గత ఐదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కోడ్లపై బీహార్ విజయోత్సవ సంరంభంలో హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్మికులకు ఈ కోడ్లు పరమాద్భుతమైన సంక్షేమాన్ని సమకూరుస్తాయని ఆడంబరంగా ప్రకటించింది. సులభ వాణిజ్యానికి ఇవి అండదండలు అందిస్తాయని, ఉపాధి కల్పనను ప్రోత్సహించి, ప్రతి కార్మికుడికి సామాజిక, ఆర్థికపరమైన భద్రతను కల్పిస్తాయని ప్రచారం చేసుకుంటున్నది. అయితే కొత్త కోడ్లు శ్రామికవర్గానికి మేలు చేస్తాయన్న వాదనతో దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు ఏకీభవించడం లేదు. 29 చట్టాలను నాలుగు చట్టాలుగా క్రోడీకరించే క్రమంలో కొత్త హక్కులు రావడం మాట అటుంచి ఇప్పటిదాకా ఉన్నవి లుప్తమైపోయాయని యూనియన్లు మండిపడుతున్నాయి. కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరించే బీజేపీ సర్కారు కార్మిక చట్టాల మౌలిక స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసిందని, యజమానులకు మేలు చేసేందుకే వీటిని తెచ్చిందని అంటున్నాయి.
కొత్త కార్మిక కోడ్లు సులభ వాణిజ్యం ముసుగులో కంపెనీలకు వెసులుబాటు కల్పించినట్టు ప్రాథమిక పరిశీలనలోనే తెలిసిపోతుంది. యాజమాన్యాలకు చట్టపరమైన నిబంధనల సడలింపు, ఉద్యోగుల తొలగింపులో మరింత స్వేచ్ఛ కల్పించడం కార్మికుల సంక్షేమం ఎలా అవుతుంది? మరోవైపు ఉద్యోగులను విధుల్లోంచి తొలగించడానికి అనుకూలంగా, యాజమాన్యాలతో చర్చలకు, సమ్మెలకు ఇవి ఆటంకంగా ఉన్నాయి. పైగా పాత చట్టాల్లోని శాశ్వత ఉద్యోగ విధానం, ఉద్యోగ ఒప్పందకాలం లాంటి ఉద్యోగ భద్రత అంశాలు కొత్త కోడ్లలో లేవు. 100 నుంచి 300 దాకా ఉద్యోగులున్న పరిశ్రమల్లో ఉద్యోగుల తొలగింపు, సంస్థ మూసివేతపై ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా యాజమాన్యాలకు పూర్తి హక్కు కల్పించారు. పైగా 50లోపు ఉద్యోగులున్న సంస్థల్లో లేఆఫ్ ప్రకటించినప్పుడు ఉద్యోగులకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదనడం అన్యాయం.
ఇలా కార్మికులను కట్టడి చేసి, యాజమాన్యాలకు సౌలభ్యం కల్పించే ఈ కోడ్లలో కొన్ని పైపై మెరుగుల్లాంటివి చేర్చారు. గిగ్ వర్కర్లకు గుర్తింపు కల్పించినట్టు చెప్తున్నప్పటికీ వారి సంరక్షణ భారాన్ని యాజమాన్యాలపై వేసి చేతులు దులిపేసుకున్నారు. డిజిటల్ సంస్థలు తమ లాభాల్లోంచి ఒకటి, రెండు శాతం ఉద్యోగుల సామాజిక భద్రత ఫండ్‌లో జమ చేయాలని కోడ్లు సూచిస్తున్నాయి. ఈ నిధి నిర్వహణ, పనితీరుపై ఎలాంటి స్పష్టత లేదు. పైగా ప్రభుత్వ ప్రత్యేక కేటాయింపుల ప్రస్తావనే లేదు. సార్వత్రిక కనీస వేతనాన్ని కార్మికులందరికీ వర్తింపజేస్తున్నట్టు సర్కారు గొప్పగా చెప్పుకొన్నది. కానీ, సదరు వేతన లెక్కింపునకు అవసరమయ్యే ఫ్లోర్వేజ్ రోజుకు రూ.178గా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. వేతన నిర్ణయం సర్కారు దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉండటమనేది మాత్రం సమర్థనీయం కాదు. బెంగాల్ ఈ కోడ్లను అమలు చేసేది లేదని తెగేసి చెప్పగా; కేరళ, తమిళనాడు వీటి తీరుతెన్నులపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. కొత్త చట్టాల నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా పది ప్రధాన కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్త సమ్మె నిర్వహించాయి. సమాఖ్య వైఖరికి విరుద్ధంగా ‘వన్ నేషన్, వన్ వేజ్’ అంటూ ఏకరూప కార్మిక చట్టాలను దేశంపై కేంద్రం రుద్దాలని ప్రయత్నించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.