రెండు తుమ్మెదలు
ప్రకృతి చుట్టూ తిప్పుతూ
పరమానందాన్ని రాసి పోసి
హృదయ సంచీని నింపుతాయి
పురుషుడిని చూట్టూ తిప్పుతూ
కవితల కాంతులను వేలాడదీసి
కొత్త లోకంలోకి పద్య పాదాలను నడిపిస్తాయి
రెండు రెక్కలు తొడిగి జీవిత గమనానికి
పుప్పొడిని పూసి, తియ్యని రాగాన్ని ఆలపించి
మౌనపు మబ్బులను చీల్చి,
కడగంటితో తుఫాన్ రేపి
మాయా మత్తును చల్లుతాయి.
అవును పెదవులు మాత్రమే కాదు
మాటల మంత్రం వేసేవి.
చూపుల బాణాలు వేసి మత్తెక్కించే
తుమ్మెదలు కూడా మాట్లాడుతాయి
మకరందాన్ని నింపుకొని
కదలికలతో కవ్విస్తూ మాట్లాడుతాయి
ఓరగా ఓనమాలు పలికిస్తాయి.
పక్షుల పాటలకు పల్లవి అందించాలంటే
లోపలి సముద్రం గీతాన్ని వినాలి
ఎదలో పొంగే అలల సవ్వడిని
అర్థం చేసుకోవాలి
మొత్తని పూల పందిరిని తడమాలి
నెమలి నాట్యాన్ని దర్శించాలి
అలాంటప్పుడే సంపెంగ ఇరుపక్కల వేలాడే
కోమలి భ్రమరాల ఝంకార నాదం
మనసుకు తెలుస్తున్నది.
-బింగి శ్రీకాంత్ ,7893613015