దేశమంతటా బీఆర్ఎస్ గాలి
దేశంలో ఇక వీయనున్నది బీఆర్ఎస్ గాలి. దేశ స్వాతంత్య్రానంతరం చిరకాలం వీచిన కాంగ్రెస్ గాలి తేలిపోయింది. కొద్దికాలం పాటు ఉండిన ప్రతిపక్ష ఐక్య సంఘటనల గాలి పలచబడింది.
దేశంలో ఇక వీయనున్నది బీఆర్ఎస్ గాలి. దేశ స్వాతంత్య్రానంతరం చిరకాలం వీచిన కాంగ్రెస్ గాలి తేలిపోయింది. కొద్దికాలం పాటు ఉండిన ప్రతిపక్ష ఐక్య సంఘటనల గాలి పలచబడింది. ఎండమావి అభివృద్ధిని చూపి, మతతత్వపు రాకాసిపై స్వారీ చేస్తున్న బీజేపీ గాలి నెమ్మదిగా స్తంభిస్తున్నది. ఇతర సభ్యులను ఖరీదు చేయనిదే అడుగు ముందుకు సాగని స్థితి ఏర్పడింది. ఇటువంటి వేళ, ఈ శూన్యంలో దేశానికి అవసరమైన సరికొత్త గాలిరూపంలో బీఆర్ఎస్ ప్రవేశిస్తున్నది. ఇప్పటికే మొదలైన ఈ గాలి క్రమంగా వేగాన్ని పుంజుకోగలదనేందుకు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం నాటి నాందేడ్ సభ అందుకు తాజా ఉదాహరణ.
టీఆర్ఎస్ను నిరుటి అక్టోబర్లో బీఆర్ఎస్గా మార్చినప్పటి నుంచి ఈ నాలుగు మాసాల స్వల్ప వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సానుకూల పవనాలు వీయటాన్ని చూస్తున్నాం. ఆయా రాష్ర్టాల్లో వేర్వేరు పార్టీలకు చెందినవారు, ఎంతో సీనియర్లు అయిన నాయకుల నుంచి మొదలుకొని, వ్యవసాయం తదితర రంగాలకు, దళిత బహుజన వర్గాలకు, గిరిజనులకు, మైనారిటీలకు, ఆలోచనాపరులకు చెందిన అనేకులు ఈ కొద్దికాలంలోనే బీఆర్ఎస్లో చేరటమో, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను కలవటమో జరిగింది. ఖమ్మం సభకు వచ్చిన, పరేడ్ గ్రౌండ్స్ సభకు రానున్న వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు బీఆర్ఎస్లో చేరకపోతుండవచ్చుగాక. కానీ అది ఆ పార్టీ రాజకీయ వైఖరికి, విధానాలకు సంఘీబావమే అవుతుంది. కేవలం నాలుగు నెలల్లో ఇదంతా జరగటం సాధారణ విషయం కాదు.
ఇట్లా జరగటం ఎందువల్ల అనేది జాగ్రత్తగా, నిర్వికారంగా ఆలోచించవలసిన విషయం. అది అర్థమైతే తప్ప, బీఆర్ఎస్ను దేశంలో ఇక వీయనున్న గాలి అనటం ఎందువల్లనో బోధపడదు. ముందుగా కొద్దిమాటల్లో ఒక విషయం చెప్పాలంటే, భారతదేశం వంటి ఒక వర్ధమాన మాజీ వలస సమాజానికి, దాని వర్తమానం, భవిష్యత్తుల కోసం ఎటువంటి అజెండాతో, ఆచరణతో కూడిన గాలిని వీయాలో కాంగ్రెస్ గాని, వివిధ ఫ్రంట్లు గాని వీయలేదు. బీజేపీ వల్ల కూడా ఆ పని జరగకపోగా పరిస్థితి క్షీణిస్తున్నది. దేశంలో ఈ గుర్తింపు ఏర్పడి నానాటికి విస్తరిస్తున్నది. సరిగా ఈ గుర్తింపు, దాని విస్తరణ కారణంగానే బీఆర్ఎస్ ఒక ప్రత్యామ్నాయంగా కన్పించి ఆకర్షిస్తున్నది.
సదరు ఆకర్షణ ఇంత వేగంగా ఉండటానికి గల కారణం కూడా అర్థం చేసుకోదగ్గదే. సులువైన రీతిలో చెప్పాలంటే, నమ్మిన వారి పట్ల ఆశలు సన్నగిల్లటం ఎంత వేగంగా జరిగితే, ఆ నమ్మకాలు
మరొకరి వైపు మళ్లటం అంత వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఇతర పార్టీలకు, బీఆర్ఎస్కు మధ్య వివిధ వర్గాల విషయంలో జరుగుతున్నది అదే. అందువల్లనే కేవలం నాలుగు నెలల కాలంలోనే ఒక కొత్త పార్టీ, అంతవరకు ప్రాంతీయ పార్టీగా ఉన్నది, ఇంత వేగంగా ఇతర రాష్ర్టాలు, పార్టీలు, సంస్థల వారిని ఆకర్షించగలుగుతున్నది.
అదే సమయంలో ఇందులోని కీలకం, టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో గత ఎనిమిదేండ్లలో సంపాదించుకున్న పరిపాలనాపరమైన ప్రతిష్ఠ. అది దేశవ్యాప్తమైన తీరు. కేసీఆర్ పదే పదే చెప్తున్న ‘తెలంగాణ నమూనా’కు గాని, బీఆర్ఎస్లో చేరుతున్న ఇతర రాష్ర్టాల వారి ప్రశంసలకు గాని మూలాలు ఇందులో ఉన్నాయి. కేసీఆర్ ఈ దేశం కోసం చేద్దామని చెప్తున్నది ఇంతకాలపు ఇతర పార్టీల వలె వట్టి మాటలుగా కాకుండా తన రాష్ట్రంలో ఏండ్ల తరబడి ఆచరించి మరీ చూపారు గనుకనే వారికి ఆ నమ్మకాలు కుదురుతున్నాయి. అంతే తప్ప వారేమీ అమాయకులు కాదు, అనుభవం లేనివారు కాదు. దేశంలో ఇటువంటి పాత శూన్యాలు గాని, కొత్త నమ్మకాలకు ఇటువంటి ప్రాతిపదికలు గాని లేనిపక్షంలో తెలంగాణ ఎక్కడ, వారెక్కడ? కేసీఆర్ ఎవరు, తామెవరు? సరిగా ఈ స్థితినే, ఇక వీయనున్న గాలికి సూచికగా తీసుకోవలసి ఉంటుంది. సమగ్రాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమాల కోసం దేశ ప్రజలు ఇన్నేండ్లలో ప్రతిసారి కొత్త శక్తులను ఆహ్వానిస్తూనే వస్తున్నారు. అధికారమే పరమావధి అయిన రాజకీయవర్గాల వైఖరి ఎట్లున్నప్పటికీ సామాన్య ప్రజలూ, వారికోసం నిలిచే నాయకత్వాలూ, సంస్థలూ, ఆలోచనాపరులు మాత్రం పాత పార్టీలను కాదని కొత్త శక్తుల వెంట నిలిచి నడవటం మనకు ప్రతి దశలో కనిపిస్తున్నది. విఫలమైనవారిని నిరసించి ఉద్యమాలు సాగించింది, ప్రత్యామ్నాయాలను సృష్టించింది ఈ వర్గాలే. కొత్త గాలుల వెంట నడిచి వాటిని బలోపేతం చేసింది వీరే.
ప్రస్తుతం దేశంలో గల ప్రతిపక్షాలు, వాటి ప్రభుత్వాలలో కనీసం కొన్ని ప్రజానుకూల స్వభావం గలవే. కానీ అవేవీ కూడా జాతీయస్థాయిలో మొత్తం దేశం గురించి ఆలోచించటం గాని, వర్తమాన-భవిష్యత్తుల కోసం ఒక స్పష్టమైన దార్శనికతతో సమగ్ర దృక్పథం తీసుకోవటం గాని, ఆ దిశలో ధైర్యంగా నిలిచి మాట్లాడుతూ కార్యాచరణను ఆరంభించటం గాని చేయటం లేదు. ఇదంతా చేస్తున్నది, అందుకు తగిన అనుభవ నేపథ్యం ఉన్నది కేసీఆర్కు మాత్రమేనని, ఆ విధంగా ఆయన ఈ దేశానికి అవసరమైన కొత్త ప్రత్యామ్నాయం కాగలరనే భావన దేశమంతటా సామాన్య ప్రజలలో, వారివెంట నిలిచే వర్గాలలో వేగంగా వ్యాపిస్తున్నది. ఎపుడైనా కొత్త శక్తుల విజయ రహస్యం ఇదే. అందుకే బీఆర్ఎస్ ఈ దేశంలో ఇక వీయనున్న గాలి అవుతున్నది.
టంకశాల అశోక్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- For tribals
- minorities
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

