‘శక్తి’ పథకం పేరుతో పాలిటెక్నిక్‌లు, ఐటీఐలు, ఏసీటీలను ఒకే ఫ్రేమ్‌లో పెట్టి పబ్లిక్-ప్రైవేట్ మోడ్‌లో నడిపిస్తామంటున్నారు కాంగ్రెస్ పాలకులు. కానీ, డిప్లొ మా చదువును స్కిల్ ట్రైనింగ్‌గా మార్చి, చదువుకున్న టెక్నీషియన్ల నుంచి చీప్ లేబర్‌గా మారుస్తారా? ఏంది అనే భయం విద్యార్థులకు పట్టుకున్నది. మూడేండ్లు కష్టపడి చది విన డిప్లొమా విలువ ఏంది? ఈసెట్ రాసి డైరెక్టుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరే ల్యాటరల్ ఎంట్రీ ఉన్నదా లేదా అని విద్యార్థులు అడుగుతుంటే సర్కార్ పెద్దలు సమాధానం చెప్తలేరు. గట్టిగా అడిగితే లాఠీలతో గొంతు నొక్కుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా విద్యార్థులు రోడ్లెక్కితే, ప్రభుత్వం మాత్రం ఇప్పుడు నింపాదిగా ‘రంది పడకుండ్రి, కమిటీ వేసినం!’ అంటున్నది.
ముందే సరైన అధ్యయనం చేసి విధాన నిర్ణయాలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా! పిల్లలను ఆగం చేసి, ఇప్పుడు కమిటీ అంటే, అది సమస్య పరిష్కారం కోసమా? సమస్యను కొంతకాలం అటకెక్కించడానికా? చాలా రాష్ర్టాలు తిరస్కరించిన ఈ ‘శక్తి’ స్కీమ్ మన రాష్ట్రంలో అమలు చేయడానికి కాంగ్రెసోళ్లు ఎందుకు ఉరుకులాడుతున్నరో! ఏ ప్రయోజనాల కోసమో! విద్యార్థుల భవిష్యత్తు కోసమే అయితే ఇంత హడావుడెందుకు? విద్యార్థుల మీద అణచివేత చర్యలు ఎందుకు? ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఉన్న వేల కోట్ల విలువైన భూముల మీది ఆసక్తితోనే విద్యార్థుల మీద ‘శక్తి’నంతా చూపిస్తున్నరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చదువు పేరుతో స్కీమ్! వెనుక స్కామ్.. ఇదేనా కాంగ్రెస్ విద్యా విధానం?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు లౌడ్ స్పీకర్ లెక్క మొత్తుకునేటోళ్లు. రోజుకో కొత్త ఆరోపణతో లేఖలు, ధర్నాలు, ప్రెస్మీట్లతో ఎగిరెగిరి పడేటోళ్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏమైందో బ్యాటరీ డౌన్ అయినట్టు కనబడుతున్నరు. కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కిట్ పోయింది, న్యూట్రిషన్ కిట్ ఆగింది, రైతుబీమా నిలిచిపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్, బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులు, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏల ముచ్చట అటకెక్కింది.

రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తయో, ఎంత వస్తాయో తెలియదు. కల్యాణలక్ష్మి పరిస్థితీ అదే. జీవో 97 రద్దు చేయాలని విద్యార్థులు రోడ్లెక్కితే లాఠీలతో సమాధానం చెప్తున్నారు. అయినా కమలం పార్టీ నేతలు మాత్రం సైలెంట్! దేవుడన్నా.. మోదీ అనుకుంటూ మొత్తుకునే ఒకాయన ఇప్పుడు ఎందుకో గప్‌చుప్ అయిపోయాడు. బీఆర్ఎస్పై ఫైర్ అయి, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఫ్యాన్ అయిండేమో అని సెటైర్లు వేస్తున్నరు. ఇదే ముచ్చట పువ్వు పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నరు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపుల దగ్గర మోదీ ఫొటో పెట్టాలంటూ ధూంధాం చేసిన బీజేపీ నేతలు, ఇప్పుడు ఇంటింటికీ ఇస్తున్న స్మార్ట్‌రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోల వ్యవహారంపై ఎందుకు కిక్కురుమనడం లేదు? బీజేపీ, కాంగ్రెస్ పెద్దల చీకటి సోపతి పట్ల రెండు పార్టీల శ్రేణులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎవరైనా నోరు జారితే చాలు.. ’ఎథిక్స్ కమిటీకి పంపాలి’ అంటూ అధికార పక్షం తొడ కొట్టింది. కడియం శ్రీహరిపై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద అయితే మరీ పెద్ద హడావుడే జరుగుతున్నది. సరే.. పంపండి, విచారించండి, చర్యలు తీసుకోండి.. ఎవరు వద్దన్నరు? కానీ బీఆర్ఎస్ వాళ్లు ’అసలు ఎథిక్స్ కమిటీ ఉన్నదా?’ అని అడిగేసరికి అధికార పక్షం నేతలు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నరు. అయ్యబాబోయ్.. కమిటీనే లేకుండా కేసు ఎక్కడికి పంపుదామనుకున్నరో ఏమో, వెంటనే తేరుకున్న సీఎం ’ముందు కమిటీ ఏర్పాటు చేయండి స్పీకర్ గారూ!’ అంటూ కోరిండ్రు. అంటే షూటింగ్ ముందు.. స్క్రిప్ట్ తర్వాత అన్నట్టున్నది.! ఇదేనా మీ ముందు చూపు అని బీఆర్ఎస్ వేసిన సెటైర్లకు అధికారపక్షం వైపు నుంచి సమాధానం లేదు.

మరి అదే సమయంలో అధికార పక్షం నేతల నోటి నుంచి వివాదాస్పద మాటలు జారినప్పుడు ఈ ఎథిక్స్ గుర్తుకు రాలేదా?! సభలో దూకుడులు, అనుచిత పదజాలాలు, వివాదాస్పద సైగలు జరిగినప్పుడు కనీసం సీనియర్ సభ్యులైనా వారిస్తే బాగుండేది అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. కొందరు మాట్లాడితే ఎథిక్స్.. ఇంకొందరు మాట్లాడితే రాజకీయమా అనే విమర్శలు కూడా విరివిగానే వినపడుతున్నాయి. అసలు ఎథిక్స్ అంటే సభలో సభ్యులందరికీ ఒకే కొలమాన మా.. లేక పార్టీల జెండా రంగు చూసుకుని వేసే రబ్బరు స్టాంపా? ప్రతిపక్షం తప్పు చేస్తే ఎథిక్స్ కమిటీ అంటరు, అధికార పక్షం తప్పు చేస్తే ‘ఎంటర్టైన్మెంట్’ అన్నట్టున్నది వ్యవహారం! పార్టీలను చూడటంలో ఎథిక్స్ కమిటీకి రంగుల కండ్లద్దాలు ఉంటయా?
అరెరే.. రాష్ట్రంలో కాంగ్రెస్ నడుపుతున్నది సర్కారో? సర్కసో అర్థమైతలేదు. ఎందుకంటే హస్తం పార్టీ పాలనలో వింతవింత విన్యాసాలు కనబడుతున్నయి. అటువంటిదే ఈ ముచ్చట. విపక్షాల విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో గాంధీభవన్‌లో కాంగ్రెసోళ్లు ఓ మీటింగ్ పెట్టుకున్నరు. ఆ మీటింగ్‌కు పార్టీకి సంబంధం ఉన్నవాళ్లు మాత్రమే వెళ్తారు. కానీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే సీపీఆర్వో వెళ్లి కాంగ్రెస్ మీడియా సమావేశంలో పాఠాలు చెప్పడం విడ్డూరం.

ప్రభుత్వ ప్రచార బాధ్యతలు చూడాల్సిన ఉద్యోగి రాజకీయ పార్టీకి పొలిటికల్ ట్యూషన్లు కూడా చెప్తడా? ఇదేదో ఘనకార్యమన్నట్టుగా పార్టీ సోషల్ మీడియాలో బాధ్యులు డబ్బా కొడుతున్నరు. ప్రజాధనాన్ని జీతం రూపంలో తీసుకునే అధికారి ఓ పార్టీ మీటింగుకు వెళ్లడం దేనికి సంకేతం? ఇదే విషయంపై సోషల్ మీడియాలో జనాలు మండిపడటంతో కాంగ్రెసోళ్లు సోషల్ మీడియా నుంచి ఆ ఫొటోలను డిలీట్ చేసుకున్నరు. మళ్లీ సీపీఆర్వో కనబడని ఫొటోలను అప్లోడ్ చేసిండ్రు. ఇంతకూ విపక్షాల విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో మీటింగ్‌లో చర్చించుకున్నరా? తప్పులు చేసి దొరికిపోతే, పోస్టులు ఎలా డిలీట్ చేయాలో నేర్చుకున్నరా? అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
-దాము నర్మాల