తెలంగాణలో బీసీలను కాంగ్రెస్ చారిత్రక మోసం చేసింది. నవంబర్‌లో 50 రోజుల పాటు ప్రభుత్వం చేపట్టిన కులగణన తెలంగాణ దళిత, బహుజన సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక పారదర్శకంగా లేదని యావత్ బీసీ సమాజం మూకుమ్మడిగా వ్యతిరేకించింది. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల పెంపుతోపాటు, సంపద వికేంద్రీకరణ జరగాలనేది కులగణన లక్ష్యం. అయితే, ప్రభుత్వం మాత్రం దీనిని చాలా తేలిగ్గా తీసుకుందని నివేదిక చూస్తే అర్థమవుతుంది. సర్వేను ఇటు అధికారులు కానీ, అటు ప్రభుత్వం కానీ సీరియస్‌గా తీసుకోలేదు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర సర్వే బోగస్ అని కొట్టిపడేస్తున్న రేవంత్ ప్రభుత్వం మళ్లీ అదే సర్వేతో తమ సర్వేను పోల్చుకోవడం గమనార్హం. కేసీఆర్ హయాంలో ఓసీ జనాభా 21 శాతం ఉంటే తమ సర్వేలో 15 శాతమే తేలారని చెప్తున్నారు. అంటే సమగ్ర సర్వేను అంగీకరిస్తున్నట్టే కదా.
రాష్ట్రంలో పదేండ్ల కాలంలో బీసీ జనాభాను తగ్గించి చూపించడాన్ని బీసీ సహా ఏ ఇతర సమాజం కూడా స్వాగతించడం లేదు. దీనినిబట్టి ఆ నివేదికలో పారదర్శకత ఎంతో అర్థం చేసుకోవచ్చు. 2001లో 3,09,87,271 ఉన్న తెలంగాణ జనాభా 2011 నాటికి 3,50,03,674 పెరిగింది. అంటే 13.58 శాతం. కులగణనను కాసేపు పక్కన పెడితే ఈ లెక్కల ప్రాతిపదికనైనా ఈ 13 ఏండ్ల కాలంలో కనీసం 60 లక్షల జనాభా అయినా పెరగాలి. కానీ, ప్రభుత్వం 3,54,77,554గా చూపిస్తున్నది. ఈ లెక్కల తీరు చూస్తుంటే ఈ నివేదిక తప్పుల తడక కానే కాదు, ఇది వ్యూహత్మకంగా చేసిన కుట్రలో భాగంగానే మేధావులు భావిస్తున్నారు. పదేండ్ల కాలంలో తెలంగాణలో బీసీ జనాభా పెరగలేదనడం కాంగ్రెస్ ఆధిపత్య వర్గాల పకడ్బందీ ప్రణాళికలో భాగమే. బీసీ జనాభాను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడతారోననే దురుద్దేశంతోనే ఈ కుట్రకు తెరలేపారు. శాస్త్రీయత లేని కులగణన నివేదికను తెలంగాణ బీసీ సమాజం వ్యతిరేకిస్తున్నది. ఆ లెక్కలను చూస్తే కులగణన రూపం ఒకటి, సారం మరొకటిగా తేటతెల్లమైంది. కేసీఆర్ ఒక్క రోజులో సమగ్ర సర్వే చేస్తే రాని విమర్శ కాంగ్రెస్ 50 రోజుల సర్వేలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే గ్రామాల వారీగా, వార్డుల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా యూనిట్‌గా తీసుకొని ఆయా కులాల జనాభాను ప్రకటించాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తున్నది. లేదంటే పకడ్బందీగా రీసర్వే చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో వెనుకబడిన కులాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ, సంక్షేమ, సామాజిక రంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది.
-డాక్టర్ బక్కతట్ల వెంకటేష్ యాదవ్, 97054 88333
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి కులగణన సర్వేలో బలహీన వర్గాల జనాభాని తగ్గించి చూపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక విషయంలో బలహీన వర్గాల నుంచి వస్తున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన ప్రభుత్వం మొండి వాదనతో సున్నితమై అంశానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తుండటం సిగ్గుచేటు. పైపెచ్చు కులగణన చరిత్రాత్మకమని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుంది. బలహీనవర్గాలు కులగణనని ప్రశ్నించడం లేదు. కానీ, కులగణన రిపోర్టులో బీసీలకు నష్టం చేస్తున్న అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తుతున్నారనే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తున్నది.
2015లో నాటి బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 51.1 శాతంగా ఉంటే కులగణన సర్వేలో మాత్రం 46.25 శాతానికి ఎలా తగ్గారు? సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 1.88 కోట్లుగా ఉంటే ప్రస్తుత సర్వేలో మాత్రం 1.64 కోట్లుగా చూపిస్తున్నారు. అంటే 24 లక్షల జనాభా ఏమైనట్టు? సమగ్ర కుటుంబ సర్వేలో అగ్రవర్ణాలను 21 శాతంగా చూపిస్తే, కులగణన సర్వేలో 28.35 శాతంగా అంటే 7 శాతం ఎక్కువగా చూపించడంతో బీసీల జనాభా శాతం తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా రాష్ట్ర జనాభా 3.51 కోట్లుగా ఉంటే వార్షిక వృద్ధి రేటు 1.3 శాతంగా ఉన్నది. ఈ లెక్కన రాష్ట్రంలో ఏడాదికి 1.3 శాతం చొప్పున జనాభా పెరిగితే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రాష్ట్ర జనాభా 4.2 కోట్లుగా ఉండాలి. కానీ, కులగణన రిపోర్టులో 3.54 కోట్లుగా పేర్కొన్నారు. అంటే, 60 నుంచి 70 లక్షల జనాభా సర్వే పరిధిలోకి రాలేదు. రాష్ట్రంలో 1.17 కోట్ల కుటుంబాలు ఉంటే సర్వే పరిధిలోకి మాత్రం కేవలం 1.12 కోట్ల కుటుంబాలు వచ్చాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకారం రాష్ట్రంలో 3.35 కోట్ల ఓటర్లు ఉంటే, కుల గణన రిపోర్టు ప్రకారం రాష్ట్ర జనాభా 3.54 కోట్లుగా చూపిస్తున్నారు. అంటే ఓటర్లుగా నమోదు కాని వారు రాష్ట్రంలో 19 లక్షలేనా? అందుకే సర్వే రిపోర్ట్ అశాస్త్రీయంగా ఉందనే భావన వ్యక్తం అవుతున్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు భవిష్యత్తులో అడ్డంకులు ఎదురు కావద్దనే రిపోర్టులో అగ్రవర్ణాల జనాభా శాతాన్ని 15.79 శాతంగా చూపించి, బీసీల జనాభా శాతాన్ని 46 శాతానికి తగ్గించారనే అనుమానాలు కలగక మానవు. బీసీలు, మైనార్టీ, బలహీన వర్గాలు కలిపి 61 శాతానికి పైగా ఉండాలి. కానీ, నివేదికలో వారి జనాభా శాతాన్ని 56.33 శాతానికి పరిమితం చేయడం వెనక కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-డాక్టర్ తిరుణహరి శేషు , 98854 65877
అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత బీఆర్ఎస్ పలు సవాళ్లను ఎదుర్కొన్నది. పార్టీ నేతల ఫిరాయింపులు, కీలక నేతలపై వేధింపులు, పార్టీ అధినేత కేసీఆర్‌కు గాయం వంటి ఎన్నో సమస్యలు ఎదురైనా నడుంబిగించి పోరాట పంథాను కొనసాగిస్తున్నది. తెలంగాణ హక్కులకు విరుద్ధంగా కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తున్న అంశంపై బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించడంతో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం. 6 గ్యారెంటీల (420 హామీలు) అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో ప్రభుత్వ అసమర్థతను ప్రజలకు వివరించి చెప్పడంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇది ఆ పార్టీకి ప్రజాదరణను మరింత పెంచింది. ‘హైడ్రా’ పేరుతో పేదల గుడిసెలు కూల్చడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మూసీనది పరీవాహక ప్రాంత ప్రజలకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించింది. దామగుండం అటవీ ప్రాంతంలో ప్రతిపాదిత రాడార్ సంస్థ ఏర్పాటు నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. లగచర్ల గిరిజనులకు మద్దతుగా నిలిచింది. ఢిల్లీ వరకు ఈ సమస్యను తీసుకెళ్లి వారికి న్యాయం చేయడానికి కృషి చేసింది.
ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నిరుద్యోగులకు న్యాయం చేస్తామని, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ మర్చిపోయింది. పేద, మధ్య తరగతి కుటుంబంలోని పిల్లలు చదువుకునే గురుకులాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫలితంగా వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు, అవుతున్నారు. 56 మంది విద్యార్థులు మరణించారు. ఈ దారుణ పరిస్థితిని బీఆర్ఎస్ ‘గురుకుల బాట’ అనే కార్యక్రమం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో రైతన్న పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాను అరకొరగా చేసింది. బీఆర్ఎస్ ఒత్తిడి చేయడంతోనే ఆమాత్రమైనా చేసింది. తెలంగాణ కోసం ఉద్యమించిన బీఆర్ఎస్ ఆ తర్వాత రాష్ర్టాభివృద్ధికి పాటుపడింది. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాను ఎండగడుతూ ప్రజా ప్రయోజనాల కోసం మరింత బలంగా పోరాడుతున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ తిరిగి బలపడుతున్నది. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తూ, ప్రజలకు అండగా నిలుస్తున్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రజల మద్దతుతో మరింత బలంగా రాజకీయ వేదికపై నిలిచే అవకాశం ఉన్నది. తెలంగాణ ప్రజా హక్కుల కోసం, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, బడుగు వర్గాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తూనే ఉంది, ఉంటుంది.
– రాజేష్ నాయక్, 96035 79115