షేర్ మార్కెట్ సూచీలు పతన దిశగా పోతున్నప్పుడు విదేశీ మదుపుదారులు, మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. అంటే తాము గతంలో కొనుగోలు చేసిన షేర్లను అమ్మేసుకుంటారు. అలా అమ్మినప్పుడు వారికి వచ్చే మొత్తం రూపాయలలో ఉంటుంది. కానీ, ఆ పెట్టుబడిదారులు భారతదేశ రూపాయలను తమ దేశానికి తీసుకువెళ్లరు. అంటే వారు మన రూపాయలను, తిరిగి తమ దేశీయ కరెన్సీ రూపంలోకి మార్చుకుంటారు.
ఈ దశలో వారు భారత రూపాయిని అమ్మేసి తమ దేశీయ కరెన్సీ రూపంలోకి మార్చుకుంటారు. ఇక్కడ రూపాయి అమ్మేయబడుతోంది. అంటే, రూపాయికి డిమాండ్ తగ్గిపోయింది. అదీ కథ. వివిధ దేశాల కరెన్సీల విలువలు ఒకదానితో ఒకటి ఏ విధంగా మారకం విలువను నిర్ణయించుకుంటాయో, వాటి వాటి ‘డిమాండ్’ నిర్ణయించే కథ.
ఇక ప్రస్తుత స్థితి అయిన డాలర్ ప్రభావం తగ్గడమనేది ప్రధానంగా 1980ల తర్వాత మొదలైంది. 1980ల అనంతరం అమెరికా ఆర్థిక పరిస్థితులు దిగజారుతూ రావడం దీని వెనుక ఉన్న కారణం. అమెరికా ఆర్థికస్థితిని, తలకిందులు
చేసిన ముఖ్యమైన పరిణామాలుగా: 1. ఔట్ సోర్సింగ్, 2. ఆటోమేషన్ ఉన్నాయి. 1980ల అనంతరం అమెరికాలోని సరుకు ఉత్పత్తి పరిశ్రమలు చౌకైన శ్రమశక్తి వేటలో చైనా వంటి ఇతర దేశాలకు తరలివెళ్లడం మొదలయ్యింది. దీని ఫలితంగా అమెరికాలో ప్రజలకు సరుకు ఉత్పత్తి రంగంలో, ఉపాధి అవకాశాలు క్షీణించిపోయాయి. ఇక అలాగే 1990ల అనంతరం, అంటే ఇంటర్నెట్ ఆవిష్కరణ అనంతరం అమెరికాలోని సేవారంగంలోని పరిశ్రమలు కూడా భారతదేశం వంటి ఇతర దేశాలకు తరలివెళ్లడం మొదలయ్యింది. ఈ క్రమంలోనే, అమెరికా సేవారంగంలో కూడా ఆ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు క్షీణించసాగాయి.
ఇక దీనంతటితో పాటుగా, 1980ల అనంతరం మరింత వేగం పుంజుకున్న యాంత్రీకరణ (ఆటోమేషన్) అంటే రోబోట్ల వంటివాటి ఆవిష్కరణ అమెరికాలోనూ, ఇతర ధనిక దేశాల్లోనూ ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. ఉదాహరణకు 1960 – 2017 మధ్యకాలంలో అమెరికాలోని సరుకు ఉత్పత్తిరంగంలో ఉపాధి ఆ దేశంలోని మొత్తం ఉపాధిలో భాగంగా 28 శాతం (1960) నుంచి 8 శాతానికి (2017 మార్చి) పడిపోయింది. అలాగే, సేవారంగంలో కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు. దీని ఫలితంగానే నేడు అమెరికాలో నెలకొన్న ఉపాధిరాహిత్యం, ఆర్థిక సమస్యల క్రమంలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తోన్న భారతీయుల వంటి వారికి వ్యతిరేకంగా ట్రంప్ నేతృత్వంలో ఆ దేశంలో హెచ్1బీ వీసాలు, గ్రీన్ కార్డులు… పౌరసత్వం తదితర అంశాలపై కొత్తగా ఆ దేశంలో స్థిరపడుతోన్నవారికి వ్యతిరేకంగా దాడులు జరుగుతున్నాయి.
ఇటువంటి ఉపాధి, డిమాండ్ రాహిత్య స్థితి, ప్రజల కొనుగోలు శక్తి పతనం నుంచి బయటపడేందుకు 1980ల అనంతరం అమెరికాలో ‘క్రెడిట్ బూమ్’ వచ్చింది. అంటే, అప్పుచేసి పప్పుకూడు అన్నమాట. క్రెడిట్ కార్డుల మంజూరు, వినియోగం వంటివి పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే, అమెరికా ప్రజలు నేడు భారీగా అప్పులపాలై ఉన్నారు.
పైగా ఉక్రెయిన్-రష్యా యుద్ధక్రమంలో రష్యా మీద అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది. వీటిలో భాగంగానే, రష్యా దేశం తన విదేశీ లావాదేవీల కోసం డాలర్‌ను వినియోగించుకొనే అవకాశం లేకుండా చేసేందుకుగానూ డాలర్ లావాదేవీల కోసం ఏర్పరిచిన ‘స్విఫ్ట్’ వ్యవస్థ నుంచి రష్యాను అమెరికా బహిష్కరించింది. ఈ బహిష్కరణ ప్రపంచంలోని అనేక దేశాల ఆలోచనలో పెద్దమార్పును తెచ్చింది.
ఈ క్రెడిట్ బూమ్ కొనసాగింపుగా 1990లలో ‘డాట్‌కామ్ బబుల్’ వచ్చిచేరింది. అంటే, 1990లలో మొదలైన సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ విప్లవంతో అమెరికా షేర్ మార్కెట్లో టెక్నాలజీ షేర్ల సూచీలు (నాస్క్) విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికా ప్రజలలోని అత్యధిక శాతం షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారు. కాబట్టి ఈ టెక్నాలజీ షేర్ల విలువల పెరుగుదల ఆదాయపరంగా వారికి బాగా అనుకూలించింది. అంటే వారు పెట్టిన పెట్టుబడుల విలువ పెరగడంతో అమెరికా ప్రజలకు అదనపు ఆదాయాలు లభించాయి. ఈ రకంగా 1990ల నుంచీ – 2001 వరకూ, షేర్ మార్కెట్ల నుంచి లభించే స్పెక్యులేటివ్ ఆదాయం అమెరికా ప్రజల కొనుగోలు శక్తిని కాపాడింది. అయితే, 2001లో డాట్‌కామ్ బబుల్ బద్దలు కావడంతో షేర్ మార్కెట్ సూచీలు పతనమై ప్రజలకు అదనపు ఆదాయవనరుగా ఉన్న షేర్ మార్కెట్ పెట్టుబడులకు గండిపడింది. అంటే కథ మళ్లీ మొదటికి రాసాగింది. సరైన ఉపాధిలేని స్థితి నుంచి ప్రజలను కాపాడుతూ వచ్చిన క్రెడిట్ బూమ్ ప్రభావం సన్నగిల్లుతూ రావడంతో పాటుగా డాట్‌కామ్ బబుల్ బద్దలు కావడంతో అమెరికాలో మరలా మార్కెట్ల పతనం, ఆర్థిక సంక్షోభ వాతావరణం నెలకొనసాగాయి.
ఈ క్రమంలోనే, 2003 ప్రాంతంలో అమెరికాలో మరో సరికొత్త బూమ్‌కు తెరలేచింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీరేట్లు భారీగా తగ్గించడంతో రియల్ ఎస్టేట్ బూమ్ మొదలయ్యింది. ఈ క్రమంలో, రియల్ ఎస్టేట్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయి అది ప్రజలకు ఒక ఆదాయవనరుగా మారింది. ఆ రకంగా, ఉపాధిరాహిత్య స్థితి ప్రభావం నుంచి రియల్ ఎస్టేట్ బూమ్ ద్వారా అమెరికా అప్పటికి బయటపడింది. అయితే, ఈ స్థితి కూడా తాత్కాలికమేనని 2008, సెప్టెంబర్‌లో ఈ బుడగ బద్దలు కావడంతో రుజువయ్యింది. ఈ 2003-2008 రియల్ ఎస్టేట్ బూమ్ కాలంలో, ఒకానొక దశను చేరుకునేసరికి రియల్ ఎస్టేట్ రుణాలపై భారీగా లాభాలు సంపాదిస్తోన్న అమెరికా బ్యాంకులు దురాశకు పోయాయి.
దానిలో భాగంగానే అవి అడ్డగోలుగా రుణ మంజూరులు చేశాయి. అంటే, లాభాల వేటలో అవి అర్హతలేని, రుణాలను తిరిగి చెల్లించేందుకు తగిన సామర్థ్యం లేనివారికి కూడా రుణాలు మంజూరు చేశాయి. ఈ రుణాలనే ‘సబ్‌ప్రైమ్’ రుణాలు లేదా నింజా (NINJA) రుణాలు అంటారు. నింజా రుణాలు అంటే నో ఇన్కమ్ (ఆదాయంలేని), నో జాబ్ (సరైన ఉపాధి లేని), నో ఎసెట్స్ (రుణాల కోసం గ్యారెంటీగా చూపగల ఆస్తులు లేని) వారికి ఇచ్చిన రుణాలు. ఫలితంగా, 2007లో అమెరికా బ్యాంకుల వడ్డీరేట్లు మళ్లీ పెరిగిపోవడం మొదలుకావడంతో ముందుగా ఈ సబ్‌ప్రైమ్ లేదా నింజా రుణాలు, మొండిబకాయిలుగా మారడం మొదలయ్యింది. అనతికాలంలోనే ఇది 2008 చివరి నాటికి ఫైనాన్స్ సంక్షోభంగా అమెరికాను చుట్టుముట్టింది. ఫలితంగా, రాత్రికిరాత్రే అమెరికా జనాభాలోని 50 శాతం మంది వరకూ ఆ దేశ దారిద్య్రరేఖ దిగువకు పడిపోయారు.
ఇక తర్వాతి కాలంలో సృష్టించేందుకు మరే బుడగా మిగలలేదు. ఈ కారణంతోనే నాడు 2009, జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బరాక్ ఒబామా అమెరికా ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు సుమారుగా 900 బిలియన్ డాలర్ల ఉద్దీపన పథకాన్ని ప్రకటించారు. అంటే, దివాలా తీసిన అమెరికా బ్యాంకులు, వివిధ కంపెనీలను తిరిగి నిలబెట్టేందుకు అమెరికా ప్రభుత్వమే డాలర్లను ముద్రించి, సాయం అందించింది.
అలాగే, అమెరికా ప్రజల కొనుగోలుశక్తిని తిరిగి నిలబెట్టేందుకు కూడా వివిధ రూపాలలో ప్రయత్నించింది. 2009 నాటి నుంచి కూడా సుదీర్ఘకాలం పాటు ఈ ఉద్దీపన పథకాలు, అంటే డాలర్లను ముద్రించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని కాపాడే యత్నం కొనసాగుతూనే వచ్చింది. 2020 కొవిడ్ మహమ్మారి కాలంలో ఈ డాలర్ల ముద్రణ పరాకాష్ఠకు చేరింది. నాడు కొవిడ్ లాక్డౌన్ల వలన ప్రజలకు పని చేసుకునే అవకాశం, ఆదాయం లేని స్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ స్థితిలో అమెరికా ప్రభుత్వం ఇతర అనేక దేశాల ప్రభుత్వాల లాగానే తన దేశంలోని ప్రజలకు వారివారి బ్యాంక్ ఎకౌంట్లలో డబ్బును డిపాజిట్ చేయసాగింది. దీనికోసం ఆయా ఇతర దేశాలలో లాగానే అమెరికా కూడా విపరీతంగా డాలర్లను ముద్రించింది.
డాలర్ అనేది కాగితం కరెన్సీ అనీ, దాని ముద్రణ లేదా సరఫరా పెరిగిపోయిన కొద్దీ దాని విలువ పడిపోతుందనేది వేరే చెప్పనవసరం లేదు. ఈ సహజతర్కంలో భాగంగానే 2022 నుంచీ ద్రవ్యోల్బణం రూపంలో అనేక ఇతర దేశాల కరెన్సీలతో పాటుగా, అమెరికా డాలర్ విలువ పతనం కూడా వ్యక్తం కాసాగింది. ఇక మరెంత మాత్రమూ అదనంగా డాలర్ల ముద్రణ సాధ్యంకాని స్థితి ఏర్పడింది. అంటే, అమెరికా ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టుకునేందుకు సరికొత్తగా మరే బుడగలు తేలేని స్థితికి తోడుగా డాలర్ల ముద్రణ ద్వారా ఉద్దీపన పథకాలను ఇచ్చుకునే అవకాశం ఇక లేకుండాపోయింది. దీనికి అదనంగా అమెరికా ప్రభుత్వం అప్పులు 37 లక్షల కోట్ల డాలర్ల పైకి పెరిగిపోవడంతో సరికొత్తగా అప్పులు పుట్టడం కూడా అమెరికాకు కష్టమవుతోంది.
మొత్తంగా అమెరికా ఆర్థికవ్యవస్థ, దానిపై ఆధారపడ్డ డాలర్ ప్రాభవం కూడా నేడు వేగంగా సన్నగిల్లడాన్ని ప్రపంచం గమనిస్తోంది. ఫలితంగా నేడు చాలా దేశాలు తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో ఉన్న డాలర్ల శాతాన్ని తగ్గించుకుంటున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న అనేక చర్యలు, నిర్ణయాల వలన డాలర్ పతనం మరింత వేగాన్ని పుంజుకుంది. పారిశ్రామికంగా డొల్లగా మారిపోయిన స్థితిలో అమెరికా దేశ మనుగడకు మిగిలిన ఏకైక అస్త్రం దాని డాలర్‌కు ప్రపంచంలో ఉన్న ఆమోదయోగ్యత మాత్రమే! నేడు ఈ ఆమోదయోగ్యతకే ముప్పు వచ్చిపడుతోంది.
పైగా ఉక్రెయిన్-రష్యా యుద్ధక్రమంలో రష్యా మీద అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది. వీటిలో భాగంగానే, రష్యా దేశం తన విదేశీ లావాదేవీల కోసం డాలర్‌ను వినియోగించుకొనే అవకాశం లేకుండా చేసేందుకుగానూ డాలర్ లావాదేవీల కోసం ఏర్పరిచిన ‘స్విఫ్ట్’ వ్యవస్థ నుంచి రష్యాను అమెరికా బహిష్కరించింది. ఈ బహిష్కరణ ప్రపంచంలోని అనేక దేశాల ఆలోచనలో పెద్దమార్పును తెచ్చింది.
రేపు ఏదో ఒక రోజున తాము కూడా అమెరికాను కాదంటే తమకు కూడా ఇటువంటి ముప్పు వస్తుందని అనేక దేశాలు గ్రహించాయి. అంటే అమెరికాకు ఎదురుతిరిగితే తాము కూడా డాలర్ లావాదేవీల వ్యవస్థ నుంచి బయటకు నెట్టివేయబడే ప్రమాదం ఉందని వాటికి అర్థమయ్యింది. ఈ కారణంతోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో భాగంగా చాలా దేశాలు నేడు తమ విదేశీ మారకద్రవ్య నిల్వలలో డాలర్ల శాతాన్ని కూడా తగ్గించుకుంటున్నాయి. గతంలో కొద్ది దశాబ్దాల నుంచీ డాలర్‌ను చాలా మంది ప్రపంచ నేతలు, దేశాలు కూడా సవాలు చేస్తున్నాయి. ఈ పరంపరలోని మాజీ ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, లిబియా నేత గదాఫీ వంటి వారిని అమెరికా అంతమొందించింది. ఇంతచేసినా డాలర్ వేగాన్ని అమెరికా నియంత్రించుకోగలిగింది. కానీ, అది అంతిమంగా డాలర్ తన పతనాన్ని నివారించుకోలేని స్థితిలో పడిపోతోంది. ఈ క్రమంలోనే డాలర్‌కు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తే, ‘మీ మీద టారిఫ్ అస్ర్తాన్ని ప్రయోగిస్తా’నంటూ బ్రిక్స్ దేశాలైన – బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా వంటివాటిని ట్రంప్ బెదిరిస్తున్నారు. కానీ, ఈ బెదిరింపులు కేవలం ఉడత ఊపులుగానే, దింపుడు కళ్లెం ఆశగానే మిగిలిపోవడం ఖాయం!!
ఈ అనివార్యతను ఎదుర్కొనేందుకే నేడు ట్రంప్ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కానీ, అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌కు కనుమరుగు కావడం నేడు కనుచూపు మేరలో కనపడుతూనే ఉంది. 2025 ఆరంభం నుంచీ డాలర్ విలువ వేగంగా దిగజారడాన్ని ప్రపంచం గమనిస్తూనే ఉంది. డాలర్ ఆమోదయోగ్యత తగ్గిపోతుండటంతో ఏర్పడుతోన్న శూన్యంలోకి, నేడు బంగారం వేగంగా ప్రవేశిస్తోంది. అందుచేతనే, వివిధదేశాల రిజర్వ్ కరెన్సీలలో నిన్నటి వరకూ, డాలర్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న యూరో కరెన్సీని వెనక్కు నెట్టివేసి నేడు బంగారం ఆ స్థానంలోకి రాగలిగింది.
రేపటిరోజున డాలర్ సంక్షోభం మరింత పెరిగిన కొద్దీ, అంతిమంగా (తాత్కాలికంగానైనా) బంగారం డాలర్ స్థానంలోకి అంటే వివిధ దేశాల రిజర్వ్ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకడం ఖాయం! ఈ క్రమంలో ఇప్పటికే అనేక సంవత్సరాలుగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని రికార్డు స్థాయిలలో కొనుగోలు చేస్తున్నాయి. సో గుడ్ బై డాలర్! వెల్కమ్ టు ‘న్యూ వరల్డ్ ఆర్డర్!!’
– డి.పాపారావు 98661 79615