పొద్దు పొద్దుగాల
నిద్ర చెట్టు మీదినుంచి దించే
కోడిపుంజు పిలుపు లెక్క
పుస్తకం నా కనులు తెరిపిస్తుంది
చిన్నప్పటి బడిలో
నా మనసులోకి సూటిగా ప్రవహించిన
దయానందం సారు పాఠం లెక్క
పుస్తకం నా జేబులో కొన్ని అక్షరాలను నింపుతుంది
నల్లటి మా పొలంలో
తెల్లటి అన్నం ముద్దలను తవ్వితీసే
నడిచే చెమటచుక్క-మా బాపు లెక్క
పుస్తకం నా కడుపుకింత బువ్వ పెడుతుంది
జీవితం చేతిలో
వీపు సాపు చేయించుకుంటున్నప్పుడల్లా
గాయానికి నల్లాలం ఆకుపసరయ్యే
జిగిరీ దోస్తులా
పుస్తకం నా చేతిలో చెయ్యిగా ఒదుగుతుంది
కలుషితం కాని నవ్వులతో
లోలోపలి చీకటినంతా కడిగేసే..
నా ఇంటిదీపం లెక్క
పుస్తకం నా చేతిలోని కాగడా అవుతుంది
పుస్తకం.. నా చేతిలోనుంచి సూటిగా
రక్తంలోకి పరుగులెత్తుతుంది
నన్ను నిజమైన మనిషిని చేస్తుంది.
తోకల రాజేశం
96767 61415