అవ్వా! నీ చేత్తోని బుక్కెడంత బువ్వ పెడుతవా
రా బిడ్డా ! కూసోని కడుపు నిండా తిను
అసలు
ఈ మట్టి గొప్పతనమే ఇది !
బత్కుదెరువు ఎట్లుంటదో చూద్దామని
ఆకలాకలనుకుంటూ పొట్ట చేత పట్టుకుని
పిడికెడన్నం కోసం
ఆశతో వచ్చినోళ్లెవరు
ఈడ నుండి వాపసు పోలేదు
ఎట్ల పోతరు ?
ఈడ ఏం తక్కువున్నదని
కష్టపడాలన్న ఇగురముంటే
ఈ పూటకింత అన్నమే కాదు
నువ్వింత తిని
నలుగురికింత పెట్టే
మనిషిని జేస్తది గీ భూమి !
మానం మర్యాద నేర్పుతది
జోర్దార్గా నడిపిస్తది
తెలంగాణ అంటేనే మనిషిగా బత్కడం
యాడినుంచో ఆశగా బత్కనీకొచ్చినోల్లకింత
అన్నం పెట్టి బత్కనివ్వడం !
బతుకునివ్వడం !
అవ్వ చేతి బువ్వ అంటే ఇదే మరీ !!