e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎడిట్‌ పేజీ రక్తదానం ప్రాణదానమే

రక్తదానం ప్రాణదానమే

అత్యవసర స్థితిలో ఉన్న రోగికి రక్తం అవసరం ఉంటుంది. రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయినవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. నేటికీ రక్తదానంపై చాలామందికి సరైన అవగాహన లేదు. రక్తదానం చేస్తే నీరసించిపోతామని, బలహీనపడిపోతామనే అపోహ ప్రజల్లో ఉంది. స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్‌ లాంటివి గ్రామాల్లో, పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి రక్తాన్ని సేకరిస్తున్నాయి. అయినా యువత రక్తదానం అంటేనే వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి దీనిపై శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రోత్సాహం అవసరం.

రక్తదానం ప్రాణదానమే

ప్రతి ఆరోగ్యవంతుడిలో సుమారు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. 18 ఏండ్ల నుంచి 65 ఏండ్లలోపు వయసున్న ఎవరైనా రక్తదానం చేయవచ్చు. ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకోసారి అంటే, ఏడాదికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు. 45 కిలోల బరువు పైగా ఉన్నవారు మాత్రమే రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి నుంచి 350 మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్తదానం చేసే వ్యక్తికి వైద్యుల సంరక్షణలో కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. హైపటైటిస్‌, బీపీ, హెచ్‌ఐవీ, రక్తహీనత, షుగర్‌, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రక్తదానం చేయడానికి అనర్హులు. ఒకవేళ తెలియక చేసినా రక్తం ఉపయోగపడదు. రక్తదానం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీవో నెంబర్‌- 184 ద్వారా ఆ రోజు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేయబడుతుంది.

రక్తదానం చేసినవారికి పూర్తిస్థాయిలో రక్తం 21 రోజుల్లో తిరిగి ఉత్పత్తి అవుతుంది. సుమారు 500 మిల్లీ లీటర్ల రక్తంతో మూడు నిండు ప్రాణాలు కాపాడవచ్చు. రక్తదానం చేసేవారు మిగతా వారికన్నా చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు. రెడ్‌క్రాస్‌ అంతర్జాతీయ సంస్థ, ఆయా జిల్లాల దవాఖానలకు అనుబంధంగా ఉన్న రక్తనిధి కేంద్రాలు అధిక సంఖ్యలో రక్తాన్ని సేకరిస్తున్నాయి. ఏటా వందల సంఖ్యలో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేస్తూ వేల యూనిట్ల రక్తం సేకరిస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రాలు, డివిజన్‌ కేంద్రాల్లో రక్తదాన కేంద్రాలున్నాయి. అనేకమంది తమ జన్మదినాలు, పెళ్లిరోజును పురస్కరించుకొని కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేస్తూ తమ మిత్రులు, బంధువులు, సన్నిహితుల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. ఆ రక్తాన్ని బ్లడ్‌ బ్యాంకులకు అందజేస్తూ తమ దాతృత్వంతో ఉదారతను చాటుతున్నారు.

రెడ్‌క్రాస్‌, ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలలో నామమాత్రపు డబ్బులతో రక్తం అందిస్తున్నారు. సమాజంలో ఇప్పటివరకు రక్తదానం చేయనివారు అధిక సంఖ్యలో ఉన్నారు. రక్తదానం చేయడం అంటే ఓ మనిషిని బతికించటమే. రక్తం ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఇం తటి ముఖ్యమైన రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన కొరవడటం విషాదం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కరపత్రాలు, గోడ పత్రికలు, సదస్సుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి. మహిళా సంఘాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. రక్త దానానికి మించిన దానం లేదనే నినాదాన్ని ప్రచారం చేయాలి. ఎక్కువసార్లు రక్తదానం చేసినవారికి విద్య, ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో సముచిత స్థానం కల్పించాలి. రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేట్లు ప్రోత్సహించాలి.

కరోనా కాలంలో రక్త నిల్వలు తగ్గి, అనేకమంది చనిపోతున్నారు. ఈ సమయంలో ప్లాస్మా ప్రాధాన్యం ఎంత గా ఉన్నదో అందరికీ తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా ఇస్తే ఎందరో మృత్యుముఖం నుంచి బయటపడ్డారు. కాబట్టి కరోనా పరిస్థితుల్లో రక్తం, ప్లాస్మా ఇవ్వటానికి ముందుకు వచ్చే విధంగా విస్తృతంగా ప్రచారం చే యాలి. అవసరమైన అవగాహన కల్పించాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా, రక్తదానం గురించి ప్రతి ఒక్కరూ ముందుకురావాలి. తోటివారి ప్రాణాలను కాపాడాలి.

కామిడి సతీష్‌ రెడ్డి
(వ్యాసకర్త: గవర్నర్‌ అవార్డు గ్రహీత, 59 సార్లు రక్త దానం చేశారు.)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రక్తదానం ప్రాణదానమే

ట్రెండింగ్‌

Advertisement