HomeEditpageBeyond The National Capital Delhi Hyderabad Is Moving Towards The Top Position In All Fields
గంగా-జమున తెహజీబ్
దేశ రాజధాని ఢిల్లీని మించి హైదరాబాద్ అన్నిరంగాల్లో అగ్రస్థానం దిశగా దూసుకువెళ్తున్నది. నీటికి కటకట, కాలుష్య కోరల్లో చిక్కుకుని హస్తిన తల్లడిల్లుతుంటే... హైదరాబాద్ పచ్చదనంలో అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్నది.
దేశ రాజధాని ఢిల్లీని మించి హైదరాబాద్ అన్నిరంగాల్లో అగ్రస్థానం దిశగా దూసుకువెళ్తున్నది. నీటికి కటకట, కాలుష్య కోరల్లో చిక్కుకుని హస్తిన తల్లడిల్లుతుంటే… హైదరాబాద్ పచ్చదనంలో అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్నది. ఐటీ, బల్క్‌డ్రగ్, వ్యాక్సిన్లు, వైద్యం, ఏవియేషన్ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. స్టార్టప్‌లకు నిలయంగా మారిన నగరం టీహబ్, వీహబ్, టీవర్క్స్తో సత్తా చాటుతున్నది.
హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. హైదరాబాద్ ‘గంగా జెమునీ తహ్జీబ్’కు ప్రతీక. ఈ మహా నగరంలో పలు మతాలు, ప్రాంతాల ప్రజలు ఏండ్ల తరబడి సంతోషంగా జీవిస్తున్నారు. పేదోడి నుంచి ధనవంతుడి వరకు అందరూ సంబురంగా బతికేయవచ్చు. ఈ నగరం గొప్పతనం ఎంత చెప్పుకొన్నా తక్కువే.
మినీ ఇండియా, ఉపాధి కార్ఖానా..
హైదరాబాద్ నగర నిర్మాణానికి ఏ శుభ ముహూర్తాన కులీ కుతుబ్ షా భూమి పూజ చేశారో కానీ ఈ నగరం దినదిన ప్రవర్ధమానమై విశ్వనగరంగా ఎదుగుతున్నది. దేశంలోని ఐదు పెద్ద నగరాల్లో ఇదొకటి. సాగరతీరంలో బుద్ధుడు నెలవైన హైదరాబాద్ సిగలో ఇప్పుడు ఆకాశమంత ఎత్తులో అంబేద్కర్ కొలువుదీరారు. ఈ యుగపురుషుల నీడలో కొత్త తోవన పరుగులు తీస్తున్నదీ చారిత్రక నగరం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ నగర రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. హైదరాబాద్ ఆధునికతను సంతరించుకుంటూ వేగంగా అభివృద్ధి సాధిస్తున్నది. ఇక్కడి నీరు, గాలి, వాతావరణం, ప్రకృతి సౌందర్యం, ప్రజల ప్రేమాభిమానాలు, కలుపుగోలుతనం, ఫ్రెండ్లీ ప్రభుత్వం కారణంగా ఇక్కడికి వచ్చినవారు తిరిగివెళ్లడానికి ఇష్టపడటం లేదు. నిరంతర విద్యుత్తు, పుష్కలమైన నీరు, మెరుగైన మౌలిక వసతులు, ట్రాన్స్‌పోర్టు కనెక్టివిటీ, టీఎస్ ఐపాస్‌తో వేగంగా పరిశ్రమలకు అనుమతులు లభిస్తుండటంతో పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. దేశవిదేశాల పారిశ్రామికవేత్తలు, ఎంఎన్సీల గమ్యస్థానం ఇప్పుడు హైదరాబాద్ అయింది. హైదరాబాద్ ఇప్పుడు పరిశ్రమల ఖిల్లా.. ఉపాధికి అడ్డా. నిర్మాణరంగం ఊపందుకొని లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. మూడు షిఫ్టుల్లో పనిచేస్తుండటంతో కార్మికులకు ఓటీలు లభిస్తున్నాయి. పరిశ్రమలు మంచి ఉత్పత్తులు సాధిస్తూ లాభాలు గడిస్తున్నాయి. ఏటా దసరా, దీపావళి సమయాల్లో కార్మికులకు బోనస్‌లు ఇస్తున్నాయి. పొట్టచేత పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకొని తన కడుపులో దాచుకుంటున్నదీ గడ్డ.
నగరం.. నయా లుక్
పేదలకు పెద్ద వైద్యం అందిస్తున్న గాంధీ దవాఖాన ఎదుట 16 అడుగుల మహాత్ముడి కాంస్య విగ్రహం, నగర నడిబొడ్డున 278 అడుగుల ఎత్తులో ఆధునిక హంగులతో నిర్మితమైన రాష్ట్ర పాలనా సౌధం సచివాలయం, తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం 161 అడుగుల ఎత్తులో జ్వలించే దీపం ఆకారంలో సిద్ధమైన అమరవీరుల స్మారక చిహ్నం దేశానికే ఆదర్శంగా. విదేశాలను తలదన్నేలా 272 అడుగులతో ప్రారంభించుకున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం, హుస్సేన్‌సాగరంలో 58 అడుగుల ఎకశిలా బుద్ధుడి విగ్రహం, దుర్గం చెరువుపై 233 మీటర్ల ఎత్తులో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి, 183 అడుగుల చారిత్రక చార్మినార్… ఇలా అనేక పాత, కొత్త నిర్మాణాలు హైదరాబాద్ నగరానికి నూతన శోభను తెచ్చిపెట్టాయి. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, లింక్‌రోడ్లు, ఆధునిక జంక్షన్లు, మెట్రోరైల్, పార్క్‌లు, బహుళ అంతస్థుల భవనాలు, థీమ్ పార్కులు నగర రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, బిర్యానీ, హలీమ్‌కు ఫేమస్ అయిన హైదరాబాద్‌లో ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లోనే ఈ హోటళ్లుండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు, కేఫ్‌లు, టీ పాయింట్లు, మాల్స్ కనిపిస్తున్నాయి. ఏ మూలకు వెళ్లినా నచ్చిన తిండి దొరుకుతున్నది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్… ఇలా చెప్పుకొంటూ పోతే అనేక చిత్ర పరిశ్రమలు ఈ రోజున హైదరాబాద్‌లో సినిమాలు చిత్రీకరిస్తున్నాయి.
నలువైపులా నగరీకరణ
అభివృద్ధి ఒక్కచోటనే కేంద్రీకృతమైతే ఇబ్బందులు తప్పవు. దీంతో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే అనేక ఇబ్బందులు ఎదురౌతాయి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని నలువైపులా అభివృద్ధి చేస్తున్నది. ఉప్పల్, రాయదుర్గం, శంషాబాద్, మియాపూర్, కొంపల్లి, సుచిత్ర, ఇస్నాపూర్, ఎల్బీనగర్, శామీర్‌పేట్.. ఇలా అనేక ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతున్నాయి. రింగ్‌రోడ్డుతో ఈ ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ అందుబాటులోకి రావడం ప్రయాణానికి అనువైంది. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే సౌకర్యం ప్రగతికి బాటలు వేస్తున్నాయి. ఇక రీజనల్ రింగు రోడ్డు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ హైదరాబాద్ మహానగరంతో కలిసిపోయే అవకాశం ఉన్నది. తద్వారా రాష్ట్రం మరింతగా పురోగమించనున్నది.
పదేండ్ల కిందటి హైదరాబాద్‌ను ప్రస్తుత నగరానితో పోల్చి చూస్తే హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఎన్ని మార్పులు చోటుచేసుకున్నదో అర్థమవుతుంది. రాయదుర్గం, మణికొండ, హైటెక్‌సిటీ ప్రాంతాలను చూస్తే మనం హైదరాబాద్‌లో ఉన్నామా లేక అమెరికాలో ఉన్నామా అన్న ఊహ కలుగుతుంది. దేశానికే ఆశాకిరణంగా హైదరాబాద్ ఎదుగుతుండటం యావత్ తెలంగాణకే గర్వకారణం.