ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నిచ్చెనమెట్ల కులస్వామ్యంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నప్పటికీ బీసీ కులాలు పాలకుల చేతుల్లో నయవంచనకు గురవుతూనే ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 42 శాతం వర్గీకరణతో అమలుచేస్తామని చెప్పింది. అందులో భాగంగా రెండు బీసీ బిల్లులను ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతుతో ఏకగ్రీవంగా శాసనసభ, శాసనమండలిలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించి మరోసారి బీసీ రిజర్వేషన్లను పద్ధతి ప్రకారం అటకెక్కించింది.
బీసీ సంఘాలను, మేధావులను మొత్తం బీసీ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నమే ఇది. రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అధికరణల్లోని లోపాల ఆధారంగా వెలువడుతున్న సుప్రీంకోర్టు తీర్పులు బీసీ కులాలకు శాపంగా మారాయి. రాజ్యాంగంలో వెనుకబడిన కులాలను కాస్త వెనుకబడిన తరగతులుగా (Backward Classes), వెనుకబడిన పౌరులుగా (Backward Citizens) చిత్రీకరించిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు బీసీ కోటా 42 శాతం అమలుచే యలేమనేది కాంగ్రెస్ పెద్దలకు తెలియని అంశం కాదు.
కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల కంటే ముందు బీసీ కోటా 42 శాతానికి పెంచి వర్గీకరణ ద్వారా అమలుచేస్తామని బీసీ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిశీలించినట్టయితే, సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల అమలుపై ప్రత్యేకమైన మూడు నిబంధనలను పెట్టింది. వాటిలో మొదటిది, వెనుకబడిన తరగతుల పౌరుల వెనుకబాటుకు సంబంధించి ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా ఆమోదయోగ్యమైన లెక్కలు తీయాలి.
రెండవది, ఆ లెక్కల ద్వారా బీసీ కోటాను నిర్ధారించాలి. మూడవది, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లతో కలిపి 50 శాతం నిలువు రిజర్వేషన్లు దాటకూడదని తెలిపింది. ఇదే తీర్పులో అసలు సామాజికంగా వెనుకబడిన తరగతుల జాబితా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు, స్థానిక సంస్థల్లో వెనుకబడిన పౌరుల జాబితా వేరుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 (4), 15 (5), 16(4) ప్రకారం బీసీ కులాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించారు. అదే స్థానిక సంస్థల్లో ఆర్టికల్ 243 ప్రకారం బీసీ కులాలను వెనుకబడిన పౌరులుగా గుర్తించారు. భారత రాజ్యాంగంలో బీసీ కులాలను గుర్తించేవిధంగా అధికరణలు లేకపోవడం నేడు బీసీ కులాల పాలిట శాపంగా మారింది. ఈ సమస్యలన్నీ పాలకులకు తెలియనివి కావు. సుప్రీంకోర్టు 2021లో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వికాస్ కిషన్‌రావు గవలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు తీర్పులో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారానే అమలు చేయాలని, లేనట్లయితే బీసీ రిజర్వేషన్లు లేకుండానే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2022లో సుప్రీం కోర్టు సురేశ్ మహాజన వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు తీర్పులో మధ్యప్రదేశ్ స్థానిక సం స్థల ఎన్నికలకు సంబంధించి ట్రిపుల్ టెస్ట్ ద్వారానే స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు చేయాలని, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, బీసీ గణాంకా లు లేకపోతే బీసీ రిజర్వేషన్లు అమలుచేయవలసిన అవసరం లేదని, ప్రతి ఐదేండ్లకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో సహా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను 2022లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. అంటే 2022 నుంచి దేశంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా అమలుచేయాలంటే బీసీ గణాంకాలు తప్పనిసరి, అదే విధంగా మొత్తం నిలువు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ కోటాతో కలిపి 50 శాతానికి మించి అమలుచేసే అవకాశం లేదు. అందులోభాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కులగణన చేసి బీసీ జనాభాను 56 శాతంగా తేల్చింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చెయ్యడం కోసం, సుప్రీంకోర్టు 1992లో 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మండల్ కమిషన్ తీర్పులో ప్రధానంగా నిలువు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధన విధిస్తూనే, ఒకవేళ బీసీ గణాంకాలు ఆమోదయోగ్యంగా ఉండి ప్రత్యేక పరిస్థితులు, బీసీల ప్రాతినిధ్యం లేనట్టయితే 50 శాతానికి మించి కూడా రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చని అదే తీర్పులో తెలిపింది. ఇదిలా ఉంటే గత బీఆర్ఎస్ 2022లో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడం వల్ల నిలువు రిజర్వేషన్లు విద్య, ఉదోగాల్లో 54 శాతానికి చేరుకున్నది. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా తో కలిపి 64 శాతానికి చేరుకున్న విషయం అందరికీ విదితమే.
భారత రాజ్యాంగ సమాఖ్య సిద్ధాంతం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్ధారించి అమలుచేసుకోవాలి. అంతేగానీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బీసీ బిల్లులను అమలుచేసి బీసీ కులాలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా వెంటనే అమలుచెయ్యాలి. ఒకవేళ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎవరైనా కేసులు వేసినట్టయితే, ఆ కేసులను బీసీ కులాల విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యాల లెక్కలను కోర్టుల ముందు ఉంచి నెగ్గే ప్రయత్నం చేయాలి. లేనట్టయితే, సమాజం కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేవు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై న్యాయ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకొని భారత రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం ఉన్నది. రాజ్యాంగంలో విద్య, ఉద్యోగ ఇతర అంశాలకు సంబంధించిన అధికరణల్లో బీసీ తరగతులను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా గుర్తించాలి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అధికరణల్లో కుడా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా గుర్తించాలి లేదా బీసీ కులాలు ఓట్ల విప్లవం, రాజకీయ ప్రక్రియ ద్వారా ద్రవిడ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని రాజ్యాధికారంలోకి రావాలి. లేనట్టయితే దేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు ప్రశ్నార్థకమే.