పిల్లలదేముంది
మొక్కలు పెరిగినట్టు పెరుగుతరు
నీళ్లుపోసో కన్నీళ్లుపోసో
కంటికి రెప్పలా కాపాడుకుంటూ
మన హృదయాలను కంచెగా వేసి
పాదుల్లో మొక్కల్ని పెంచినట్టు
పిల్లలని పెంచుతాం
ఏ చీడపీడలు సోకినా
విలవిలలాడిపోతాం
ఏ తుపాను గాలులు వీచినా
చివురుటాకుల్లా వణికిపోతాం
ఏదో ఒక రోజుకు
పూలు పూసి ఫలాలు కాసి
ఏపుగా పంటచేలలా ఎదిగిన
పిల్లల్ని చూస్తే
పచ్చని పంటను చూసి
మీసం మెలేస్తున్న రైతులా
గర్వంగా ఉంటది మనసు
పిల్లలదేముంది
మొక్కలు పెరిగినట్టు పెరుగుతురు
కుటుంబంతోపాటు
ఈ దేశానికింత నీడనివ్వగలిగే
మహా వృక్షాలయినప్పుడే
మరింత గర్వంగా ఉంటుంది
అచ్చం దేశానికి అన్నంపెట్టే రైతన్నలాగే
మన పిల్లల్ని చూసుకుని మురిసిపోతాం!
– సత్య చిత్తలూరి
91338 32246