తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతుండటం బాధాకరం. ఎంతో చరిత్ర గల కాకతీయ కళాతోరణానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత గుర్తింపును తీసుకొచ్చారు. కేసీఆర్ సూచనల మేరకు కళాకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించిన తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణాలకు చోటు దక్కడం ఈ ప్రాంత గంగా జమునా తెహజీబ్కు, ఘన వారసత్వానికి నిదర్శనం. చరిత్రను తెలుసుకోకుండా కాకతీయ కళా వైభవాన్ని ప్రస్తుత రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి రాచరికపు ముద్రలని పేర్కొనడం శోచనీయం. రాచరికం పేరు మీద విధ్వంసం చేయడం సబబేనా? కాకతీయులు తవ్వించిన చెరువులను, యునెస్కో గుర్తించిన రామప్ప కట్టడాలను చరిత్రలో లేకుండా చేస్తారా? అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించడం స్వాగతించదగిన విషయమే. కానీ, కాకతీయులు, గోలుకొండ నవాబుల గురించి ప్రస్తావించిన పాటను రాష్ట్ర గీతంగా నిర్ణయించి.. తెలంగాణ చరిత్రకు ఆనవాళ్లు అయిన కాకతీయ తోరణం, చార్మినార్ను చిహ్నం నుంచి తొలగించాలనుకోవడం సీఎం రేవంత్రెడ్డి అవగాహనారాహిత్యానికి, అపరిపక్వతకు నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలి.
– ఆలేటి రమేశ్, 99487 98982