గుజరాత్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన దుర్ఘటనపై జరుగుతున్న దర్యాప్తు నివృత్తి చేస్తున్న సందేహాల కంటే, లేవనెత్తుతున్న ప్రశ్నలే అధికంగా ఉన్నాయి. బోయింగ్ 787 (మోడల్ 8) విమానం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పైకి లేచిన తర్వాత క్షణాల్లోనే కూలిపోయి 275 మందిని బలిగొన్న విషయం విదితమే. ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ పరిధిలోని ప్రమాదాల దర్యాప్తు విభాగం (ఏఏఐబీ) ఇటీవల ప్రాథమిక నివేదికను సమర్పించింది. అయితే, ఇంజిన్లకు ఇంధనం అందకపోవడంతోనే విమానం కూలిందని అందులో వెల్లడించడంపై పెద్ద దుమారమే చెలరేగుతున్నది. విమానం గాల్లోకి ఎగిరిన సెకండ్ల వ్యవధిలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చులు ‘రన్’ పొజిషన్ నుంచి ‘కట్ ఆఫ్’ పొజిషన్‌కు మారినట్టు ఏఏఐబీ తెలిపింది. ఈ విషయమై పైలట్లు ఒకరినొకరు ప్రశ్నించుకున్నట్టు వాయిస్ రికార్డ్ అయ్యిందనీ ఏఏఐబీ అంటున్నది. ఆ తర్వాత ఫ్యూయల్ స్విచ్చ్‌లు ఆన్ చేసినప్పటికీ, అప్పటికే ఘోరం జరిగిపోయిందని ప్రాథమిక నివేదిక సారాంశం.
విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఒకటి నిర్మాణ లోపాలు, రెండు మానవ తప్పిదాలు. డ్రీమ్‌లైనర్‌గా పిలిచే బోయింగ్ 787పై నిర్మాణపరంగా సందేహాలున్నాయి. గతంలో పలువురు ప్రస్తుత, మాజీ బోయింగ్ ఉన్నతాధికారులు లోపాలను ఎత్తిచూపిన విషయం తెలిసిందే. కాగా, ప్రాథమిక నివేదిక పైలట్ల మీదనే అనుమానం కలిగించేలా చేస్తున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఏఏఐబీ ఆరోపణలను ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్పీఏ) తీవ్రంగా ఖండించాయి. ప్రాథమిక నివేదికలో పైలట్లది తప్పిదమని పేర్కొనడంపై ఏఎల్పీఏ అనుమానం వ్యక్తం చేసింది. దర్యాప్తు బృందానికి కనీస అవగాహన లేదని ఏఎల్పీఏ అధ్యక్షుడు శామ్ థామస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్’ అనే పదాన్ని ‘డ్యూయల్ ఇంజిన్ కంట్రోల్’గా పేర్కొన్నారని, పైలట్లను బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. స్విచ్చ్లలో లోపముందా లేక వాటిని నొక్కే చేతులు తప్పు చేశాయా అనేది ఇక్కడ అసలు సమస్య. దర్యాప్తు బృందంలో బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్, ఎయిర్ ఇండియా, ఇండియన్ రెగ్యులేటర్స్, యూఎస్, యూకే ప్రతినిధులు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
విమానంలో ఎలాంటి మెకానికల్, మెయింటెనెన్స్ తప్పిదాలు లేవనీ, ఫ్యూయల్ క్వాలిటీ విషయంలోనూ సమస్యలు లేవని ఏఏఐబీ ప్రాథమిక నివేదిక తెలిపినట్టు ఎయిర్ఇండియా సీఈవో కాంప్‌బెల్ వెల్లడించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు చెప్తున్నట్టుగా ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. బోయింగ్‌లో ఇంజిన్ల ఫ్యూయల్ స్విచ్చులు ప్రత్యేకంగా ఉంటాయి. డబుల్ లాక్ ఉన్నందువల్ల వాటిని అనుకోకుండా, యథాలాపంగా ఆన్-ఆఫ్ చేయడం సాధ్యపడదనేది నిపుణుల మాట. మొత్తమ్మీద ప్రాథమిక నివేదిక బయటపడినా విషయంలో స్పష్టత రాలేదు. తుది నివేదికలోనైనా సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తారని ఆశించవచ్చా?