Idupu Kayitham | ఇడాకులైనంక గూడా వాని చుట్టాలను బెట్టుకున్న చూడు, అక్కడే ఉన్నది మన తప్పంతా. మన బిడ్డ మొగడొక్కడే చెడ్డోడనుకున్నం గానీ, వాళ్ల బలగమంతా అట్లనే పాడయింది! ఒక్క తెలంగాణ సీన్మను భరించలేనోడు నవనిర్మాణం చేస్తడంట. ఇప్పటికి చేసింది చాలలే? చెరువులు, నాలాలు, <నిజామిచ్చిన లక్షల ఎకరాలు, బంజారా జాతికి ఇచ్చిన బంజారాహిల్స్ అన్నీ ఆక్రమించిన్రు గదా! ఇంకేం కావాలి? మా ఎంకన్న రాసినట్టు మీరు రావచ్చు.. పోవచ్చు.. రొయ్యలమ్ముకోవచ్చు, రవీంద్రభారతిలో రాయబార నాటకమాడచ్చు కానీ బయట నాటకాలు, నాటు మాటలు ఇగచెల్లవు.
అర్థం కానీ హిందీ సినిమాలు చూస్తరు గదా, ఒక్క ముక్క మాట్లడలేరు. మరి అరవై ఏండ్ల నుంచి ఇంటున్న తెలుగు అర్థం కాదా? లేక నాటకాలా? మరి మా నెత్తిన ఆ అనాగరిక సీన్మలు రుద్దారు. మేమేమన్నాం? పక్కవాడిని కొట్టడం గేలిచేయడం- అదే హాస్యం గదా మీకు? సీన్మలో ఏ హీరో అయినా కారో, మోటరు బైకో దిగి దాన్ని గేటుకు అడ్డంగా పెట్టి గేటు తీసుకొని వస్తాడు కదా! తీసిన గేటు వేసిన హీరోను నేను ఏ సీన్మలో చూడలే! అమ్మాయిల కొంగులు లాగే హీరోలు, వారిని ఎట్లా పడేయాలి అని కాలేజీల్ల్లో చర్చించే పోరలు, పాఠం చెప్పే గురువును రకరకాలుగా ఏడిపించే అబ్బాయిలు ఇవన్నీ మా సీన్మలల్ల లేనందున మీకు నచ్చవు. మీరు మా సీన్మలు చూడొద్దు, మేము మీ సీన్మలు చూడము. సరేనా? అసలు మీ అనాగరిక సీన్మలు మాకు వద్దు, మా పోరలు ఇప్పటికే చెడిపోయి, తన రాష్ర్టానికి ఏమీ చెయ్యని మంత్రిని హీరో అనుకొని వెంటపడుతున్నరు. గిట్ల పాడైతే మా తెలంగాణ సంస్కృతి పాడైతది. గప్పుడు మేం కూడా రెండర్థాల పాటలు, రికార్డింగ్ డాన్సులలోకి దిగాలి. నేరేడుపండు రంగు పాంటు, గులాబీ రంగు అంగీ వేసుకొని లిప్‌స్టిక్ పెట్టుకొని మీ డాన్సుబాబు లాగ మా పోరలను చూడలేం! మీ డబ్భు ఏండ్ల సోపతిలో నా భాష గూడ చెడిపోయింది!
ఇక మీరు అనువాదం అక్కరలేకుండా మీ భాషలో చెప్తాను అసలు మాకు కొన్ని సందేహాలొస్తాయి. వచ్చింది అనే పదం అమెకు వాడుతాం, మరి ఆయన వచ్చిండు అనాలి కదా సరిగ్గా భాష తెలిస్తే? ఈ వచ్చాడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటివి రాస్తే ఒక పుస్తకం నిండుతుంది. మీరు మీ అమ్మాయిని పుట్టింటికి తీసుకొస్తారు, మేం మా బిడ్డను తొలుకొస్తాం. అంటే వారే నడిచి వస్తారు ఇంట్లోకి, తీసుకురావక్కర లేదు. ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు తన సెగట్రీని అడుగుతాడు. రాయుడు వచ్చాడా? తీసుకొచ్చావా? అని. అంటే అర్థమైందనుకుంటాను. నెల్లూరులో పెరిగిన వాళ్లు షాపులో ఏదైనా వస్తువు కొనడానికి ఎత్తి అంటారని మాకు తెలియదు. ఒకసారి ఒక ఆవిడ మా అమ్మగారి దగ్గర కొంచెం డబ్బు అప్పు తీసుకొని తర్వాత ఇస్తా అనడానికి బదులు చీర ఎత్తినంక ఇస్తానండీ అనగానే మా అమ్మగారు కంగారుపడి సరే సరే అని ఆవిడని పంపించేశారు. అలాగే ఒకసారి ఒక బిచ్చగాడు మా ఇంటి ముందు నుంచుని పిలిచాడు ఏదైనా వేయమని.

Ap Reorganisation Act
ముందు గదిలో కూర్చున్న ఒక తూర్పుగోదావరికి చెందిన మనిషి పైకెళ్లు, ఇక్కడేం లేదు అని అన్నాడు. ఆ బిచ్చగాడు సందేహించకుండా పక్కనే ఉన్న మెట్లెక్కి పై పోర్షన్‌కు వెళ్లిపోయాడు. ఎందుకంటే తూగోజీ వాళ్ల భాషలో పైకెళ్లు అంటే వీధిలో ఇంకో చోటికి వెళ్లుమని! అలాగే తూగోజీ వాళ్లకు కబురు అంటే చావు కబురే, మామూలు మాట కాదు.
మిగతా వాళ్లంతా సరదాగా కబుర్లాడుకుంటారు, వాళ్లు మాత్రం కబురొస్తే మైలస్నానం చేయాల్సిందే! ఇక తాట తియ్యడం, నార తియ్యడం, తాట వలవడం, నిలువునా చీరేయడం, అడ్డంగా నరకడం, దానిని, దీనిని పడేయడం లాంటి మాటలను మేం ఎంత కష్టపడి భరిస్తున్నాం? ఒకసారి ఇలాగే మా ఇంటికి వచ్చిన ఆంధ్ర పెద్ద మనిషి, నా అయిదేండ్ల అబ్బాయి భాషను ఎక్కిరించాడు. ఏరా నువ్వు మాట్లాడితే నాకు ఏమీ అర్థం కావటడంలేదు అన్నాడు. అప్పుడు మా కొడుకు అంకుల్ మీరు మా తెలంగాణకు వచ్చారా, మేము మీ ఆంధ్రాకు వచ్చామా? మా దగ్గరకు వచ్చినప్పుడు మా భాష మీరు నేర్చుకోవాలి అని తన భాషలోనే సమాధానం చెప్పాడు.
ఈ మాట మన చరిత్రలోనే ఉన్నది. ఇక్కడ సాలార్జంగ్-1 ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఆ కాలంలో మానవ చరిత్రలోనే నంబర్‌వన్ సంపన్నుడైన నిజాము రాజ్యంలో భారతదేశంలో పని చేస్తున్న ఐసీఎస్ (ఇప్పటి ఐఏఎస్‌తో సమానం) ఆఫీసర్ల కంటే ఒక ప్రభుత్వోద్యోగి జీతం ఎక్కువ ఉండేది. అందుకే అప్పుడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదివి పట్టా పొందిన కొందరు ముస్లింలు నిజాం రాజ్యానికి వచ్చి ఉద్యోగాలిమ్మని అడిగారు. అప్పుడు ఇక్కడ పర్షియన్ జాతీయ భాషగా ఉన్నది. ప్రభుత్వ భాష, విద్యాలయాల్లో ఆ భాష మాధ్యమమే ఉండేది. అప్పుడు సాలార్జంగ్ మీరు పర్షియన్ నేర్చుకొని రండి ఉద్యోగాలిస్తాం అని చెప్పారు. అయితే వాళ్లు తమకు ఉర్దూ బాగా వచ్చనీ, అరబిక్ కొద్దిగా తెలుసనీ చెప్పినా, ఆయన సమాధానం ఒకటే! మా దేశంలో బతకాలంటే, ఉద్యోగాలు చేయాలంటే మా భాషలో మీరు నిష్ణాతులుగా ఉండాల్సిందే అని ఖరాఖండిగా చెప్పారు. ఇప్పుడు మనం అదే నిష్కర్షగా చెప్పాలి. ఆంధ్ర వాళ్లతో తెలంగాణ భాషలోనే మాట్లాడాలి. మరి ఈ విచిత్ర జీవులు అమెరికాలో వాళ్ల హీరోల సినిమాలు చూస్తూ చేసే అల్లరి, గోలకే కదా అక్కడి సామాన్య ప్రజలు అసహ్యించుకుంటున్నారు!
ఆంధ్ర, తెలంగాణ భాషల గురించి ప్రసంగాలు చేసినప్పుడు జయశంకర్ సార్ ఒక సంగతి చెప్పేవారు. తెలంగాణ వాళ్లు తమ మాటల్లో ఎక్కువ ఉర్దూ వాడుతారని ఆంధ్రవారు ఎక్కిరిస్తారు. కానీ నిజానికి ఇక్కడి వారి కంటే ఆంధ్రవారే తమ భాషలో ఎక్కువ ఉర్దూ పదాలు వాడతారు. అయితే వాళ్లు ఎందుకు మనల్ని గేలి చేస్తారంటే, వారు వాడేవి ఉర్దూ పదాలని వారికి తెలియదు. వారికి తెలియదన్న విషయం కూడా వారికి తెలియదు అనేవారు ఆయన. ఈ మాటలు చెప్పే ఆనందరావు తోట, జయశంకర్ గార్లు విజయవాడలోని జంధ్యాల పాపయ్య గారి నోరు మూయించారు. కరుణశ్రీ అని కలం పేరు పెట్టుకొని ఆయన తెలంగాణ మీద విషం కక్కేవాడు. తెలంగాణ రాష్ట్రం విడిగా చేస్తే అది దక్షిణ పాకిస్థానం అవుతుందనీ, ఇక్కడ భాష తౌరక్యాంధ్రం అవుతుందనీ నికృష్టపు మాటలు రాసేవాడు. అసలు ఇక్కడి భాష ఆంధ్రం కాదు, తెలుగు. మరి వారి తౌరక్యాంధ్రం ఎట్లా ఉంటుందో మనం విశ్లేషిద్దాం.
ముందుగా వారి సంస్కృతి గురించి ఒక్కమాట! పాత ఆంధ్ర సినిమాలోనే ఒక హాస్య సంబంధమైన పాట ఉన్నది. డబ్బొస్తే సుబ్బమ్మే సుబ్బలక్ష్మి, ధనమొస్తే ఎంకయ్యే వెంకటేశ్వర చౌదరి అని! హైదరాబాద్‌లో అన్ని హంగులతో ఇండ్లు కట్టుకొని, వ్యాపారాలు చేసుకుంటూ అహంకారంగా స్థానికుల మీద వారి సంస్కృతి మీద హేళనగా విమర్శలు చేసే బదులు, వారి ప్రాంతంలో ఇంకా సత్తెమ్మలు, అప్పిగాళ్లు ఉన్నారు కదా, ఈ ధనవంతులు వారి గురించి ఎందుకు ఆలోచించటం లేదు? ముఖ్యమంత్రితోపాటు వారానికి మూడు రోజులు ఈ అనాగరిక నగరంలో ఎందుకు బతకడం? త్వరగా వారి ప్రపంచ నగరం అమరావతిని పూర్తి చేసుకొని అక్కడికి వెళ్లవచ్చు కదా!
ఇక వీరి తౌరక్యాంధ్రం! ఒక వర్గం వారు బాగా సంపన్నులయ్యాక తమ పేరు వెనుక చౌదరి అని పెట్టుకుంటారని మనకు ఆంధ్రవారి సోపతిలో తెలిసిందే కదా! ఆ చౌదరి అన్నది ఉర్దూపదం, మరి అది వాడే వారికి ఆ విషయం తెలుసా? అ, ఇ, ఉ అక్షరాలతో పదాలు చూద్దాం. అసలు, అండ, అంబారి, అజమాయిషీ, అటకాయించు, అడ్డా, ఆసామీ, ఉడాయించు. ఇడుపు కాయితం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నదే. ఇక మిగతా కొన్ని చాలా సాధారణంగా వాళ్ల సొంత భాషలాగే ఆంధ్రులు వాడే పదాలు చూద్దాం.
కంకర, కంగాళీ, కబురు, కబేలా, కమాను, కమామీషు, ఖరారు, కుళాయి, కళాసి, కామందు, కాయము, ఖాయిలీ, కాళీ, కితాబు, కిలాడి, కుల్లాయి, ఖైదీ, కైఫియత్తు, కౌలు, ఖజానా, ఖరీదు, ఖర్చు, ఖామందు, ఖాయం, గప్పాలు, గమ్మత్తు, గాబరా, గిరాకీ, గుంజాయిషీ, గుత్తేదారు, గుమాస్తా, గులాబీ, గులాం, గైర్హాజరు, గోడ, ఘెరావ్ మొదలైనవి. ఇలా కొన్ని వందల పదాలు వాటి ఉచ్ఛారణ మార్చేసి కొన్ని కొన్ని పదాల అర్థాలు మార్చేసి కూడా ఆంధ్రవారు ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఖూన్ అంటే హత్య. ఖూనీ అంటే హత్య చేసినవాడు. ఆంధ్రవారు హత్యను ఖూనీ అని వ్యవహరిస్తారు. ఖూనీ ఖూన్ చేస్తాడు. కానీ వీళ్లు మొత్తం భాషనే ఖూన్ (వాళ్ల తౌరక్యాంధ్రంలో ఖూనీ) చేస్తారు. ఇలా పదాలు ఒక 100 పేజీలకు సరిపడా ఉన్నాయి. మరి తేనెలొలికే తెలంగాణ తెలుగు సంకర భాషనా? తౌరక్యాంధ్రం సంకరభాషనా? ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటుంటే కాళోజీ గారితో చర్చిస్తుంటే గంటలు నిముషాల్లా గడిచేవి. ఆయన ఒకమాట చెప్పి నవ్వేవారు. దఫ్తర్కెళ్లి దరఖాస్తు దాఖలు చేశిన అని అంటే హేళనగా నవ్వేవాళ్ల మాతృభాష ఇలా ఉంటుంది. ఆఫీసుకెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేశాను అని. అది ఆంధ్రభాషే వారికి అనేవారాయన. ఇక ఇడుపు కాయితం పుచ్చుకొని ఆంధ్రులు వారి ప్రాంతానికి వెడితే వారి భాష గురించి మేము మాట్లాడం ప్రామిస్!
– కనకదుర్గ దంటు