మాట ఇచ్చి తప్పడమనేది బీజేపీకి సర్వసాధారణమైపోయింది. తొమ్మిదేండ్ల కిందట నరేంద్ర మోదీని ముందు పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ఎన్నెన్నో హామీలిచ్చింది. ‘అచ్చే దిన్’ అన్నారు. స్విస్ బ్యాంకులోంచి నల్లధనం తెచ్చి ఖాతాల్లో పోస్తామన్నారు. యువత పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఉసూరుమంటున్నదని తెగ జాలిపడిపోయారు. దేశంలో యువజనుల సంఖ్య పెరిగిపోయిందని, ఇది దేశానికి శుభసూచకమన్నారు. వారికి ఉద్యోగాలు కల్పిస్తే దేశం అభివృద్ధిలో అంగలు వేస్తుందని ఊరించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మోదీ తొమ్మిదేండ్ల పాలన తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే నానాటికి తీసికట్టు అన్నట్టుగా తయారైంది.
దేశంలో ఉపాధి పెరగడం మాట అటుంచితే నిరుద్యోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ముఖ్యంగా కరోనా సమయంలో మోదీ సర్కారు అనుసరించిన అనాలోచిత నిర్ణయాల ఫలితంగా ఉద్యోగాలు పోయి యువత రోడ్డునపడ్డారు. 2022లో భారత్ యువజన నిరుద్యోగిత రేటు (23.22 శాతం) ఇరుగు పొరుగు దేశాల కన్నా చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రపంచబ్యాంకు తాజాగా వెల్లడించిన గణాంకాలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ నిరుద్యోగిత రేటు 11.3 శాతం ఉండటం మనకు సిగ్గుచేటు. బంగ్లాదేశ్(12.9 శాతం), భూటాన్ (14.4 శాతం) పరిస్థితి మనకన్నా మెరుగ్గా ఉండటం గుర్తించదగ్గ అంశం. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) డాటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. 15-24 ఏండ్ల యువత ఈ నిరుద్యోగిత పరిధిలోకి వస్తారు. బీజేపీ ఎక్కువగా ఆశలు కల్పించింది ఈ వయోవర్గం వారికే అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. చదువులు పూర్తిచేసుకొని కోటి ఆశలతో ఉద్యోగాల వేటలో పడే వీరికి నిరాశామయమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఇది సూచిస్తున్నది.
2021-22లో 25 ఏండ్ల లోపు గ్రాడ్యుయేట్లు 42 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా-2023’ నివేదిక తెలియజేసింది. వేతనాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం కూడా సమస్యేనని పేర్కొనడం గమనార్హం. ఇదే కాలవ్యవధిలో స్వయం ఉపాధిని ఎంచుకునే మహిళల సంఖ్య 50 నుంచి 60 శాతానికి పెరిగింది. అంటే ఉద్యోగాల కన్నా స్వయం ఉపాధే నయమనుకునేవారు పెరిగారన్న మాట. దేశ ఆర్థికవృద్ధి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. జీడీపీ పెరుగుతున్న కొద్దీ ఉపాధి అవకాశాలు తగ్గిపోయే విచిత్ర పరిస్థితి దేశంలో నెలకొన్నది. సకలజనుల బాగుకోసం కాకుండా పిడికెడు మంది మేలు కోసం అనుసరిస్తున్న మోదీ సర్కారు విధానాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. బీజేపీ ఉద్యోగ హామీలు మొత్తం మీద ఎన్నికల జుమ్లా వలె మిగిలిపోయాయి.