మనది ప్రజాస్వామ్య దేశమని గొప్పగా చెప్తుంటాం. ప్రజాస్వామిక హక్కులేమో గానీ ప్రాథమిక హక్కుల ఫలాలు కూడా అందుకోలేకపోతున్నాం. మన దేశంలో అలాంటి పాలన సాగుతున్నది. ఇప్పటికే నక్సలైట్ల పేరిట 18 వేల నుంచి 20 వేల మందిని ఎన్కౌంటర్ చేశారని చరిత్ర చెప్తున్నది. నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వాల అణచివేత రూపాలు మారుతున్నాయే తప్ప, హత్యాకాండలు మాత్రం ఆగడం లేదు.నారాయణపూర్‌లో 2025 మే 21న జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు చనిపోయారని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, అది ఎన్కౌంటర్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. సజీవంగా పట్టుకున్న నంబాల కేశవరావును చిత్రహింసలు పెట్టి ప్రభుత్వం కాల్చిచంపిందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని హక్కుల సంఘాలు దశాబ్దాల నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. అయినా ప్రభుత్వాల్లో చలనం రావడం లేదు. అయితే, 1995లో మధుసూదన్‌రావు హత్య తర్వాత ఉమ్మడి ఏపీ న్యాయస్థానంలో సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. తత్ఫలితంగా విస్తృత ధర్మాసనం ఒక కీలక తీర్పు వెలువరించింది. ఆ తీర్పు ఫలితంగా ఎన్కౌంటర్ల హత్యాకాండలు ఆగిపోతాయని భావించాం. కానీ, ఆ తీర్పును నిలిపివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ తీర్పును నిలిపివేస్తూ, దాని స్థానంలో సుప్రీంకోర్టు బలహీనమైన (పీయూసీఎల్ వర్సెస్ మహారాష్ట్ర) తీర్పును ఖరారు చేసింది. నాటినుంచి ఈ ఎన్కౌంటర్ల హత్యాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి.
గతంలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో సుమారు 400 మందికి పైగా ఆదివాసీలు మరణించారు. 2005లో కొనసాగిన సల్వాజుడుంకు మరో రూపమే ప్రస్తుత ‘ఆపరేషన్ కగార్’. నాడు ఆదివాసీల బేస్‌క్యాంపులను ఏర్పాటు చేయగా, నేడు దేశంలోని లక్షలాది మంది సాయుధ బలగాలను ఆదివాసీ ప్రాంతాలకు తరలించి సాయుధ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. దండకారణ్యాన్ని చుట్టుముట్టిన సాయుధ బలగాల చేతుల్లో ఆదివాసీలు చనిపోతూనే ఉన్నారు.
ఆదివాసీల హననం తర్వాత అడవిని కార్పొరేట్లకు ప్రభుత్వం పూర్తిగా అప్పగించేస్తుంది. దాంతో ప్రభుత్వ బాధ్యత తీరిపోతుంది. ప్రభుత్వాలకు ఆ కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు ముట్టచెప్తాయి. కార్పొరేట్లకు ఖనిజ సంపద ఇస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు మాత్రం వారి కుటుంబ సభ్యుల మృతదేహాలు కూడా ఇవ్వడం లేదు. ఇదెంత అమానుషం.
కుమ్రం భీం పోరాటం తర్వాత నిజాం సర్కారు మానసిక తత్వవేత్త హైమన్‌డార్ఫ్‌ను తీసుకువచ్చి పరిశోధన చేసి మరీ వారి సమస్యలను తీర్చే ప్రయత్నం చేసింది. కానీ, నక్సలైటు ఉద్యమంపై ఏ ప్రభుత్వమూ అటువంటి పరిశోధన చేయలేకపోయింది. అందుకు బదులుగా నిరంతరం అణచివేతనే నమ్ముకున్నది. అందువల్ల ఆ ఉద్యమం మరింతగా విస్తృతమై ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పేరిట 17 రాష్ర్టాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వాలు హత్యాకాండలను నమ్ముకున్నంతగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని విశ్వాసంలోకి తీసుకోలేపోయాయి. అందువల్లనే ఏ ప్రభుత్వమైనా గాని సాయుధ బలగాల ద్వారా వివిధ రకాల ఆపరేషన్లు చేయించడం, ఎన్కౌంటర్ల పేరిట శాంతిభద్రతలను కాపాడుతున్నట్టుగా నటిస్తున్నాయి.
ప్రభుత్వం ఇటీవల అత్యంత దారుణంగా నంబాల సహా 28 మందిని ఎన్కౌంటర్ పేరిట హత్య చేసింది. వారిలో ఏపీ, తెలంగాణకు చెందినవారు ఐదుగురున్నారు. వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు ఇవ్వలేదు. పైగా మృతదేహాల కోసం వెళ్లిన కుటుంబసభ్యులు, బంధువులకు కౌన్సెలింగ్ పేరిట భయానక వాతావరణాన్ని సృష్టించడం అత్యంత ఖండనీయం. పెద్దగా రాజకీయ చైతన్యం లేకపోయినా వారు బలమైన రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. వాళ్లకు తెలిసినంతగా కూడా ప్రభుత్వాలకు తెలియకుండా పోయింది. మనిషి సజీవంగా ఉన్నప్పుడే రాజకీయ అవగాహనతో పోరాటాలు చేస్తాడు. విగతజీవిగా రాజకీయాలేం చేస్తాడు? ఆ మాత్రం తెలియకుండా మృతదేహానికి ఇవ్వాల్సిన గౌరవమర్యాదలు ఇవ్వకపోవడం ఎంత అన్యాయం?
1995-2000 మధ్యలో శవాల స్వాధీన కమిటీ పేరుతో మృతదేహాలకు హక్కులుంటాయని డిమాండ్ చేస్తూ, గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘనత తెలుగు ప్రజానీకానికి ఉన్నది. ఆ చైతన్యం నుంచే కుటుంబ సభ్యులందరూ నారాయణపూర్‌కు వెళ్లి తమవారి మృతదేహాల కోసం వారం రోజులు పడిగాపులు కాశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం కాటికాపరి అవతారమెత్తింది. అయితే, ఉద్దేశపూర్వకంగా ఈ మృతదేహాలను రానివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఎక్కడ చనిపోతే అక్కడే దహనం చేస్తే ఉద్యమకారుల దాడుల్లో చనిపోయిన రాజకీయ నాయకులకు స్వగ్రామాల్లో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు? ఈ ఐదుగురి మృతదేహాల అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుపడింది?
ఇది మావోయిస్టు ఉద్యమ చైతన్యం కాదు. ఒక కుటుంబ మృతదేహానికి సంబంధించిన చైతన్యం. ఆ చైతన్యాన్ని కూడా అణచివేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఏ ప్రజాస్వామిక హక్కులు, ఏ ప్రాథమిక హక్కులను కాపాడగలుగుతుంది? ఇప్పటికే దేశంలో గాని, రాష్ట్రంలో గాని ప్రాథమిక హక్కులు అమలవుతున్నాయా అంటే కచ్చితంగా చెప్పలేం. రాజకీయ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా, రాజకీయ పార్టీల అభివృద్ధే దేశాభివృద్ధిగా పాలకులు భావిస్తున్నారు. ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయిన ప్రజలు ప్రజాస్వామిక విలువల్లో భాగంగా వారి వారి పోరాటాలు, ఆచరణను వాళ్లే నిర్దేశించుకుంటారు. అది వాళ్ల హక్కు కూడా.
– వ్యాసకర్త: పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు